ఫోన్ కాల్‌తో రూ. 25 వేలు మాయం
- బ్యాంకు అధికారినంటూ మోసం
దుబ్బాక: ఒక్క ఫోన్ కాల్‌తో రూ. 25 వేలు మాయమైన సంఘటన మండలంలోని రఘోత్తంపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్ల నర్సవ్వ–ఆంజనేయులు దంపతుల కుమారుడు మురళికి బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో 7546922653 మొబైల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నేను ఎస్‌బీహెచ్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను.
మీ ఏటీఎం లాకవుతోంది. మీ ఏటీఎం పిన్, బార్ కోడ్, ఆధార్ నెంబర్ చెబితే లాకవుతోన్న ఏటీఎంను సరి చేస్తామని చెప్పడంతో ఆ యువకుడు నమ్మాడు. బ్యాంకు అధికారి అడిగిన నంబర్లు చకచకా చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన యువకుడు గురువారం తన ఎస్‌బీహెచ్ దుబ్బాక శాఖలోని ఎస్‌బీ అకౌంట్‌లో డబ్బులను సరిచూసుకోగా అందులో నుంచి రూ. 25 వేలు డ్రా చేసినట్లు ఉంది. డ్రా చేసిన డబ్బులు కూడా ఏటీఎం ద్వారా ఒకే రోజు ఆరు సార్లు డ్రా చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో కంగుతిన్న యువకుడు లబోదిబోమంటూ బ్యాంకు అధికారుల ముందు తన గోడును వెళ్లబోసుకున్నాడు.