ప్లాట్‌ఫాం మీదకు దూసుకొచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
నారాయణపేట రూరల్ : డ్రైవర్ అజాగ్రత్తతో ఆర్టీసీ అద్దె బస్సు బస్టాండ్‌లోని ప్లాట్‌ఫాం మీదకు దూసుకువచ్చింది. ఈ సంఘటనలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పేట ఆర్టీసీ డిపోలో అద్దె ప్రాతిపదికన నడుస్తున్న బస్సు ప్రతిరోజు పరిగి– హైదరాబాద్ రూట్‌లో తిరుగుతుంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఆదివారం ఉదయం రూట్‌పై వెళ్లేందుకు బస్టాండ్‌లోని ఫ్లాట్‌ఫాం నం.4 దగ్గర ఆపాలి. అక్కడ యానాగుంది బస్సు ఉండటంతో ఫ్లాట్‌ఫాం నం.3 పై బస్సు ఆపేందుకు ప్రయత్నిస్తూ అజాగ్రత్తగా నడపడంతో ఒక్కసారిగా బస్సు జంప్ అయ్యి బస్టాండ్‌లోకి దూసుకువచ్చి స్తంభాన్ని ఢీకొట్టింది.
ఉదయం వేళ, సెలవు రోజు కావడంతో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే సమయంలో పేపర్ బాయ్స్ దినపత్రికలను సరిచేసుకుంటూ అక్కడే కూర్చోగా.. బస్సును గమనించి పక్కకు తప్పుకోవడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన బస్సుకు సంబంధించిన బ్రేక్ ఎప్పుడూ మొరాయిస్తుందని, యజమాని పట్టించుకోడని ఇతర బస్సు డ్రైవర్లు ఆరోపించారు. ఏదేమైనా డిపోను ఆర్‌ఎం తనిఖీ చేసిన మరునాడే ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.