సాక్షి, హైదరాబాద్: ‘వాహనాలు ఎడమ వైపునే వెళ్లాలి.. కుడివైపు నుంచి మాత్రమే ఓవర్‌టేక్ చేయాలి’ఇది మన దేశంలో ట్రాఫిక్ నిబంధన. కానీ హైవేలపై ఎడమ వైపు నుంచి వెళ్లాల్సిన లోడ్‌లారీలు కుడివైపు నుంచి వెళ్తున్నా యి. దీంతో అనివార్యంగా ఎడమ వైపు నుంచే ఓవర్‌టేక్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది డ్రైవర్లలో అయోమయానికి కారణమై తరచూ ప్రమాదాలకు హేతువుగా మారుతోంది.
శనివారం ప్రజ్ఞాపూర్ సమీపంలోని రిమ్మనగూడ వద్ద జరిగిన ఘోర దుర్ఘటనకు కూడా ఇదే కారణంగా కనిపిస్తోంది. ఎడమ వైపు నుంచే ఓవర్‌టేక్ చేసే క్రమం లో ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ఒకవేళ కుడి వైపు నుంచి ఓవర్‌టేక్ చేస్తూ.. లారీని ఢీ కొని ఉంటే లారీ ఎడమవైపు రోడ్డు దిగువకు దూసుకెళ్లి ఉండేది. ప్రమాదం తప్పేది. కానీ ఎడమ వైపు నుంచి ఢీ కొనటంలో లారీ.. అవతలి రోడ్డుపై కంటైనర్, కారును ఢీకొంది. దీంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇంత జరుగుతున్నా.. ఇటు పోలీసు శాఖ కానీ అటు రవాణా శాఖ పట్టించుకోవట్లేదు.
ఏం జరుగుతోంది?
సాధారణంగా హెవీ లోడ్ లారీలు, కంటైనర్లు నెమ్మదిగా ప్రయాణిస్తాయి. ఇవి రోడ్డుకు ఎడమ వైపున వెళ్లాలి. వేగంగా వెళ్లే కార్లు, బస్సులు కుడివైపున వెళ్లాలి. కానీ మనరోడ్లపై లారీలు పూర్తిగా కుడి వైపు నుంచి వెళ్తున్నాయి. దీంతో వెనక వచ్చే కార్లు, బస్సులు వాటి ని నిబంధనలకు విరుద్ధంగా ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేయాల్సి వస్తోంది.
వేరే వాహనాలు ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేసేప్పుడు ఉన్నట్టుండి ముందున్న లారీలు కూడా ఎడమ వైపు జరుగుతున్న సందర్భాలూ ఉన్నాయి. ఎడమవైపు నుంచి వెళ్లే ద్విచక్ర వాహనాలకు ఈ తప్పుడు ఓవర్ టేకింగ్స్ ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఓవర్‌టేక్ చేసేప్పుడు భారీ వాహనాలు ఎడమవైపు వచ్చి ద్విచక్రవాహనాలపైకి వెళ్తున్నాయి.
పరిమితికి మించి పొడవు
బస్సుల తయారీలో నిబంధనల ఉల్లంఘన కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. కంపెనీలు నిబంధనల ప్రకారమే చాసిస్‌ను రూపొందిస్తున్నాయి. తర్వాత దానికి బాడీ తయారు చేసేప్పుడు నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధన 93.. బస్సు పొడవు, ఎత్తు తదితర వివరాలను స్పష్టం చేస్తోంది.
రవాణా బస్సు 12 మీటర్లకు మించి పొడవు, 3.8 మీటర్లకు మించి ఎత్తు ఉండొద్దు. కానీ సంస్థలు అక్రమంగా బస్సు పొడవు, ఎత్తు పెంచుతున్నాయి. బాడీ తయారీ సమయంలో ముప్పావు మీటరు మేర దానికి అతుకు ఏర్పాటు చేసి పొడవు పెం చేస్తున్నాయి. అదనంగా సీట్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో బస్సు సులభంగా అదుపు తప్పేందుకు కారణమవుతోందని, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు.
బస్సుపై భాగంలో మాత్రమే లగేజీ ఏర్పాటుకు చట్టం అనుమతిస్తోంది. కానీ బస్సు దిగువ భాగంలో విడిగా క్యాబిన్ ఏర్పాటు చేసి లగేజీ ఉంచుతున్నారు. బస్సు ఎత్తు పెరగటానికి ఇది కూడా కారణమవుతోంది. ఆర్టీసీ కూడా ఈ అక్రమాలకు పాల్పడుతోంది. కంపెనీ రూపొందించే చాసిస్‌కు అతుకు ఏర్పాటు చేసి పరిమితికి మించి బాడీ రూపొందిస్తోంది.
ఉల్లంఘనలే కారణం..
ఎడమ వైపు నుంచి వేగంగా ఓవర్‌టేక్ చేయటం, బస్సులను పరిమితికి మించి పొడవుగా రూపొందించటం.. ఈ రెండు ఉల్లంఘనలు భారీ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటిని వెంటనే నియంత్రించాల్సి ఉంది. వీటిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజా ప్రమాదంలోనూ ఈ ఉల్లంఘనలే కారణమై ఉంటాయని అనిపిస్తోంది.
– ‘సాక్షి’తో రవాణా శాఖ విశ్రాంత అదనపు కమిషనర్, హైకోర్టు న్యాయవాది సీఎల్‌ఎన్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment