ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన డీసీఎం, బస్సు, ప్రేమ్‌కుమార్(ఫైల్)
మహబూబాబాద్: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్తిపేట కమాన్ శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఈర్ల ప్రేమ్‌కుమార్(28) కరీంనగర్‌లో ఉంటూ ఫ్లిప్‌కార్ట్ సంస్థలో డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
విధుల్లో భాగంగా ఆదివారం ఉదయం కరీంనగర్ నుంచి భూపాలపల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రేగొండ మండలం భాగిర్తి పేట కమాన్ శివారులో భూపాలపల్లి నుంచి పరకాల వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రేమ్‌కుమార్ క్యాబిన్‌లోనే ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందగా ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లు వీరబోయిన రమేష్, మురళితో పాటు ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే 108లో క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రేగొండ ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, తీగల మాధవ్ ఘటనా స్థలికి చేరుకుని ప్రేమ్‌కుమార్ మృతదేహాన్ని డీసీఎం క్యాబిన్ నుంచి బయటకు తీసి పరకాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈఘటనపై మృతుడి సోదరుడు రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పొగ మంచు, అతివేగమే కారణం?
పరకాల–భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి పొగ మంచు, అతివేగమే కారణమంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. రహదారిపై రాకపోకలు తక్కువగా ఉండడంతో వాహనాల వేగం ఎక్కువగా ఉంటుందని, దీనికి తోడు పొగ మంచుతో దారి, ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, భాగిర్తిపేట కమాన్ శివారు ప్రమాదాలకు అడ్డగా మారుతోంది. ఏటా కమాన్ సమీపంలో భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment