ఆర్టీసీ ఆదాయానికి ప్రై‘వేటు’ | rtc loss income because of private buses | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఆదాయానికి ప్రై‘వేటు’

Published Sun, Nov 6 2016 10:13 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

ఆర్టీసీ ఆదాయానికి ప్రై‘వేటు’

ఆర్టీసీ ఆదాయానికి ప్రై‘వేటు’

లాభదాయక రూట్లలో ఆటోలు, మినీబస్సులు
ఏడాదికి రూ.24కోట్ల నష్టం 
–అధికారుల నిర్లప్తత
 
ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఆదాయానికి ప్రైవేటు సర్వీసులు గండికొడుతున్నాయి. జిల్లాలోని లాభదాయక రూట్లలో వాహనాలను తిప్పుతూ కోట్లు కొల్లగొడుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన ఆర్టీసీ అధికారులు నిర్లప్తత ప్రదర్శిస్తున్నారు. 
 
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : 
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల వల్ల ఆదాయాన్ని కోల్పోయిన ఆర్టీసీకి కొత్త పోటీ ఎదురైంది. కొన్ని ప్రధాన రూట్లలో ప్రైవేటు యాజమాన్యాలు మినీబస్సులను నడుపుతున్నాయి. ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఆటోలు, మినీబస్సుల వల్ల జిల్లావ్యాప్తంగా సంస్థ ఏడాదికి రూ.24కోట్లు నష్టపోతోంది. అయినా అధికారుల్లో చలనం లేదు. ప్రైవేటు వాహనాలను నియంత్రించలేకపోతున్నారు.  
నిబంధనలకు విరుద్ధంగా
జిల్లాలోని ఆదాయం అధికంగా వచ్చే ప్రధాన రూట్లపైనే ప్రైవేటు యాజమాన్యాలు దృష్టిసారించాయి. కొన్ని రూట్లలో మినీబస్సులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా తాడేపల్లిగూడెం, ఏలూరు మధ్య మినీబస్సులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. ఈ బస్సులన్నీ నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి.వాస్తవానికి జిల్లాలో సుమారు 300 మినీ బస్సులు, ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వీలున్న వాహనాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదానికీ స్టేజ్‌ కార్యిరియర్‌ పర్మిట్లు ఇవ్వలేదు. అయినా మినీబస్సులు  స్టేజ్‌ క్యారియర్లుగా తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ల వద్ద నుంచే ప్రయాణికులను ఎక్కించుకుపోతున్నాయి. బస్టాండ్లకు సుమారు కిలోమీటర్ల దూరంలో నిలుపుకోవాలన్న నిబంధననూ తుంగలో తొక్కుతున్నాయి.  
ఆటోలదీ అదే తీరు
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీని ఘోరంగా దెబ్బతిసిన ఆటోలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనికి ఆర్టీసీ ప్రజలకు సరైన సేవలు అందించకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఆర్టీసీ సర్వీసులు సమయపాలన పాటించకపోవడం, ఎక్కువ సర్వీసులను తిప్పలేకపోవడం వల్ల గ్రామీణులు ఆటోలపై ఆధారపడుతున్నారు. వాటిల్లో ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా తప్పక ప్రయాణిస్తున్నారు. కొందరు ఆటోవాలాలు నిబంధనలను మీరుతున్నారు. నిబంధనల మేరకు ఆటోలు జాతీయ రహదారులపై తిరగకూడదు. చిన్న ఆటోలో నలుగురిని, పెద్ద ఆటోలో ఏడుగురిని మాత్రమే ఎక్కించుకోవాలి.  కానీ చిన్న ఆటోల్లో సుమారు 8 మందిని, పెద్ద ఆటోల్లో 12 మందిని ఎక్కించుకుంటున్నారు.
నియంత్రణ కరువు 
ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్న ప్రైవేటు వాహనాలను నియంత్రించే చర్యలను ఆ సంస్థ అధికారులు చేపట్టడం లేదు. . ప్రైవేటు వాహనాలను నిరోధించే నిమిత్తం రవాణా శాఖకు చెందిన ఒక ఎంవీఐ (బ్రేక్‌ఇన్స్‌పెక్టర్‌)కు ఆర్టీసీ జీతం ఇస్తూ సంస్థకు చెందిన జీపునూ ఇస్తోంది. ఆయన జిల్లా వ్యాప్తంగా దాడులు చేసి ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ దిశగా చర్యల్లేవు.  ప్రతి మూడునెలలకోసారి ఆర్టీసీ జిల్లాస్థాయి కమిటీ  సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీ, ఉపరవాణా కమిషనర్, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ సభ్యులుగా ఉంటారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకూ ఆ కమిటీ రెండుసార్లు మాత్రమే సమావేశమైంది. ఈ సమావేశాల్లో కలెక్టర్, ఎస్పీ ప్రైవేటు వాహనాల నియంత్రణకు సలహాలు, సూచనలు ఇస్తున్నా.. అధికారులు పాటించడం లేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.  
రూ. 24 కోట్లు నష్టం
ఈ ఏడాది ఆర్టీసీ ఏలూరు రీజియన్‌ ఇప్పటి వరకూ రూ.24 కోట్ల నష్టాల్లో నడుస్తోంది. ప్రైవేటు వాహనాలను నియంత్రించడానికి పోలీస్, రవాణా శాఖ అధికారులు సహకరిస్తున్నారు. మా సంస్థ సిబ్బంది కూడా కొంత మంది ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. బస్టాండ్ల వద్ద ప్రైవేటు వాహనాలను నియంత్రించడానికి కూడా కొంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నాం.
ఎస్‌.ధనుంజయ రావు, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌
సిబ్బంది నియామకం అవసరం 
ఆర్టీసీకి నష్టాలు రావడానికి ప్రధాన కారణం ప్రైవేటు వాహనాలే. ఆ విషయం యాజమాన్యానికీ తెలుసు. కానీ ఎప్పుడూ కార్మికులే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవడం బాధాకరం. ప్రైవేటు వాహనాలను నియంత్రిస్తే మరో 50 శాతం పైగా ఆదాయం సంస్థకు వస్తుంది. దీనికోసం మరింత మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది. సంస్థ ఉద్యోగులతోనే ప్రైవేటు వాహనాల నియంత్రణ సాధ్యమవుతుంది.
టి.పట్టాభిరామ్‌ దొర, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రీజనల్‌ కార్యదర్శి.
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement