ప్రైవేట్ బస్సుల దారి దోపిడీ
హైదరాబాద్: రవాణా రంగంలో మాఫియాగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున దారి దోపిడీకి పాల్పడుతున్నారని, ఏటా రూ. 1,500 కోట్ల నుంచి రూ. రెండు వేల కోట్ల వరకు అక్రమార్జనకు పాల్పడుతున్నారని తెలంగాణ ఉద్యమ వేదిక నేత చెరుకు సుధాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆర్టీసీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొట్టడమే కాకుండా ప్రజలను నిలువునా దోచుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బచావో తెలంగాణ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీసీ జేఏసీ మాజీ చైర్మన్ ఆనందరావులతో కలసి ఆయన మాట్లాడారు.
వివిధ పట్టణాలు, నగరాలకు రాకపోకలు సాగించేందుకు సుమారు 830 బస్సులు 33 రూట్లలో అధికారికంగా పర్మిట్లు తీసుకున్నప్పటికీ.. అనధికారికంగా రెండు వేల బస్సులు తిరుగుతున్నాయని ఆరోపించారు. ఒకే నంబర్‌పైన 2 నుంచి 4 బస్సులు అక్రమంగా తిరుగుతున్నాయన్నారు. ప్రైవేటు బస్సుల వల్ల ఆర్టీసీకి ఏటా రూ. 420 కోట్ల నుంచి రూ. 450 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందన్నారు. కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన బస్సులు స్టేజీ క్యారేజీలుగా ప్రతి ఊళ్లో ఆగుతూ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
6 రకాల ఆన్‌లైన్ సంస్థలు ప్రైవేట్ సంస్థలకు బుకింగ్ ఏజెన్సీలుగా పని చేస్తున్నాయని, ఇవి కాకుండా పలు ట్రావెల్స్ సైతం అక్రమంగా ప్రయాణికులను బుక్ చేసి తరలిస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వీటిపై వెంటనే ప్రభుతం చర్యలకు ఉపక్రమించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగుతామని ఆయన హెచ్చరించారు.