ఆర్టీసీ పార్శిల్ సర్వీస్ ద్వారా రూ.200 కోట్లు కార్గో రవాణా లక్ష్యం
- ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ (కమర్షియల్) శశిధర్
- అన్నవరం బస్ స్టేషన్‌లో పార్శిల్ సర్వీస్ కార్యాలయం ప్రారంభం
- ప్రస్తుతం రెండు వేల బస్సుల ద్వారా వస్తువుల రవాణా
- ఈ ఏడాది అన్ని బస్సుల ద్వారా రవాణా చేయాలని నిర్ణయం
అన్నవరం (ప్రత్తిపాడు): ఏపీఎస్ ఆర్టీసీ పార్శిల్ సర్వీస్ ద్వారా వస్తువుల (కార్గో) రవాణా ద్వారా 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కమర్షియల్) శశిధర్ తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో పార్సిల్ సర్వీస్ కార్యాలయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఇప్పటి వరకూ ఆర్టీసీ బస్సుల ద్వారా ఏఎన్‌ఎల్ పార్సిల్ సర్వీస్ అనే ప్రవేట్ సంస్థ వస్తువులను వివిధ ప్రాంతాలకు రవాణా చేసేదని తెలిపారు. అయితే ఆర్టీసీని ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకుగాను వస్తువుల రవాణా ఆర్టీసీ స్వయంగా చేపట్టాలని నిర్ణయించి గత ఏడాది జూన్ నెలలో ప్రారంభించామన్నారు. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లలో వివిధ షాపుల నిర్వహణ, వాహనాల పార్కింగ్ స్టాండులు, డార్మెట్రీల నిర్వహణ ద్వారా గత ఏడాది రూ.115 కోట్లు ఆదాయం వస్తే ఈ కార్గో రవాణా ద్వారా రూ.15 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. అన్ని బస్‌స్టేషన్లలో ఈ పార్సిల్ సర్వీస్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.
ప్రస్తుతం రెండు వేల బస్సుల ద్వారా వస్తువుల రవాణా...
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రెండు వేల బస్సుల ద్వారా ప్రస్తుతం ఈ వస్తువుల రవాణా జరుగుతోందని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ శశిధర్ తెలిపారు. ఈ బస్సుల సంఖ్యను మరంత పెంచుతామని వివరించారు. ఈ రవాణాకు వస్తున్న డిమాండ్ చూస్తుంటే ప్రతి ఆర్టీసీ డిపో ఒకటి, లేదా రెండు బస్సులను కేవలం ఈ వస్తువుల రవాణాకు ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో 27 కేంద్రాల ద్వారా వస్తువుల రవాణా: రాజమహేంద్రవరం ఆర్‌ఎం రవికుమార్
తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకూ 27 చోట్ల ఈ పార్సిల్ సర్వీస్‌లు ప్రారంభించామని ఏపీఎస్‌ఆర్‌టీసీ రాజమహేంద్రవరం ఆర్‌ఎం రవికుమార్ తెలిపారు. అన్నవరం బస్‌స్టేషన్‌లో ప్రారంభించినది 28వదని ఆయన తెలిపారు. నిషేధిత వస్తువులు, ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సిన వస్తువులు మినహా మిగిలిన అన్ని వస్తువులను ఈ పార్శిల్ సర్వీస్ ద్వారా కోరినచోటకు ఆర్టీసీ బస్సుల ద్వారా రవాణా చేస్తామని తెలిపారు. గత ఏడాది జూన్ నెల నుంచి ఇప్పటి వరకూ తూర్పుగోదావరి జిల్లాలో ఈ వస్తువుల రవాణా ద్వారా రూ.మూడు కోట్లు ఆదాయాన్ని ఆర్జించామని తెలిపారు. కార్యక్రమంలో తుని ఆర్టీసీ డీఎం రామకృష్ణ, పార్సిల్ సర్వీస్ జిల్లా మేనేజర్ మనోహర్, తదితరులు పాల్గొన్నారు.