దసరా బాదుడు
♦ దసరా స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ దోపిడీ
♦ పేద, మధ్య తరగతిపై 50 శాతం అదనపు భారం
♦ 22వ తేదీ నుంచి ప్రత్యేక సర్వీసులు
♦ రద్దీని బట్టి టికెట్ రేటు, అదనపు సర్వీసులు
సరదాల పండుగ దసరాకు రవాణా భారం ప్రజలను బెంబేలెత్తిస్తుంది. ప్రయాణికుల అవసరాన్ని ఆర్టీసీ కూడా సొమ్ము చేసుకుంటోంది. సాధారణ రోజులకంటే చార్జీలను అదనంగా పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అసలు పండుగకు ఊరెళ్లాలా.. వద్దా అనే మీమాంస పడిపోయారు సామాన్య ప్రజలు. ఇప్పటికే ఆర్టీసీలో ప్రత్యేక బస్సులు సైతం రయ్..రయ్ మనేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ప్రైవేటు వాహనదారులు భారీ దోపిడీకి తెరలేపారు. అదనపు చార్జిలు అనేందుకు అవకాశం లేకుండా ఆర్టీసీ సైతం ఫ్లెక్సీ ఫేర్ (రద్దీ రోజును బట్టి టిక్కెట్ రేటు నిర్ణయించడం) విధానం అమలు చేస్తుండడంతో ప్రైవేటు వాహనదారుల హవాకు ఇక కళ్లెం వేయడం కష్టం అనే భావన
వ్యక్తమవుతోంది.
ఒంగోలు:
దసరా పండుగకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేవారి కోసం ఆర్టీసీ భారీగానే ఏర్పాట్లు చేపట్టింది. హైదరాబాద్ నుంచే ప్రయాణికులు అధికంగా వస్తుండడంతో దీని కోసం ఏ తేదీ, ఏ డిపో నుంచి ఎన్ని సర్వీసులు నడపాలో కూడా నిర్ణయించేసింది. ఈనెల 22వ తేదీ నుంచి జిల్లాలోని 8 డిపోల నుంచి నాన్ ఏసీ సర్వీసులైన ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులను ప్రత్యేక బస్సుల రూపంలో నడపాలని నిర్ణయించింది. ఏసీ సర్వీసులైన ఇంద్ర, గరుడ, అమరావతి సర్వీసులకు మాత్రం ఫ్లెక్సీ ఫేర్‌తో కొంతమేర మాత్రమే వడ్డించి ఉన్నత వర్గాలను ఆకట్టుకునేందుకు యత్నించింది.
డిపోల వారీగా సర్వీసులు..
హైదరాబాద్ నుంచి ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ ఉంటుందని భావించి సర్వీసులు కేటాయింపు చేశారు. అద్దంకి డిపో నుంచి 12 ఎక్స్‌ప్రెస్‌లు, చీరాల నుంచి 19 అల్ట్రా డీలక్స్‌లు, 2 ఎక్స్‌ప్రెస్‌లు, గిద్దలూరు డిపో నుంచి 6 సూపర్‌లగ్జరీ, ఒక అల్ట్రా డీలక్స్, 7 ఎక్స్‌ప్రెస్‌లు, కందుకూరు డిపోనుంచి 15 సూపర్‌లగ్జరీ, 17 అల్ట్రా డీలక్స్‌లు, 5 ఎక్స్‌ప్రెస్, కనిగిరి డిపో నుంచి 20 అల్ట్రాడీలక్స్, 10 ఎక్స్‌ప్రెస్, మార్కాపురం డిపో నుంచి 9 సూపర్ లగ్జరీ, 6 అల్ట్రా డీలక్స్, 10 ఎక్స్‌ప్రెస్, ఒంగోలు డిపో నుంచి 6 సూపర్ లగ్జరీ, 20 అల్ట్రా డీలక్స్, 4 ఎక్స్‌ప్రెస్, పొదిలి డిపోనుంచి 6 సూపర్‌లగ్జరీ, 4 అల్ట్రాడీలక్స్, 4 ఎక్స్‌ప్రెస్ వెరసి మొత్తంగా 42 సూపర్‌లగ్జరీ, 87 అల్ట్రాడీలక్స్, 54 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రయాణికులను జిల్లాకు తీసుకువచ్చేందుకు నడపాలని నిర్ణయించారు. అన్ని డిపోల నుంచి 27వ తేదీన 27, 28వ తేదీ 43, 29వ తేదీ 50 సర్వీసులు నడపాలని నిర్ణయించారు. ఇక తిరుగు ప్రయాణానికి మాత్రం రద్దీని బట్టి అంటే అక్టోబరు 1, 2 తేదీల్లో అత్యధికంగా బస్సులు నడపాలని ప్లాన్ చేస్తున్నారు.
దోపిడీ ఇలా...
ప్రస్తుత టిక్కెట్ ధరలను పరిశీలిస్తే ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ ఛార్జీ రూ.281, సూపర్ లగ్జరీకి రూ.374, ఇంద్రా ఏపీకి రూ.471, గరుడ ఏసీ రూ.551, అమరావతి ఏసీ ధర రూ.641 గా ఉంది. మధ్య తరగతి ఎక్కువుగా ప్రయాణించే బస్సులు ఎక్స్‌ప్రెస్, డీలక్స్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీలు. వీటిలో ప్రస్తుతం సాధారణ షెడ్యూలు బస్సుల్లో డీలక్స్, అల్ట్రా డీలక్స్‌లు లేనేలేవు. ఇక మిగిలిన ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీలను పరిశీలిస్తే వాటి ధరలు 50శాతం పెంచేసి ప్రత్యేక సర్వీసులుగా ప్రకటించేశారు. అంటే ప్రత్యేక బస్సులకు ఎక్స్‌ప్రెస్ టికెట్ ధర రూ.440కు, అల్ట్రా డీలక్స్ రూ.532కు, సూపర్ లగ్జరీ రూ.561కు పెంచారు.
ఏసీ సర్వీసులకు మాత్రం 10 నుంచి 20 శాతం చార్జిలను పెంచారు. ఇంద్ర, గరుడ సర్వీసులకు 20 శాతం పెంచగా అమరావతి సర్వీసుకు మాత్రం 10 శాతం చార్జి మాత్రమే పెంచారు. తద్వారా ఏసీ సర్వీసులలో ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవాలనే ఉద్దేశం కనబరుస్తున్నారు. ఇంద్ర, గరుడ, అమరావతి రోజువారీ నడిచే బస్సులే తప్ప ప్రత్యేకంగా ఎటువంటి బస్సులు వేయనప్పటికీ ఫ్లెక్సీ ఫేర్ పేరుతో ధర పెంచేశారు. ప్రయాణికుల రద్దీ రోజులంటూ కొద్దికాలంగా ఆర్టీసీ ధరలు అమాంతం పెంచేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ పెంచిన ధరలను అమలు చేస్తున్నారు. అమరావతి సర్వీసు «టికెట్ రూ.706, గరుడ సర్వీసు టిక్కెట్ ధర రూ.662, ఇంద్ర సర్వీసు రూ.566గా నిర్ణయించారు.
పట్టపగ్గాలు లేని ప్రైవేటు దోపిడీ...
ప్రైవేటు బస్సుల దోపిడీకి పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి. తిరుగు ప్రయాణంపైనే ఎక్కువుగా ప్రైవేటు రవాణా సంస్థలు దృష్టి సారించాయి. నాన్ ఏసీ హైటెక్ టిక్కెట్ ధర రూ.549 మొదలు రూ.860 వరకు వసూలు చేస్తున్నారు. ఏసీ టిక్కెట్లను రూ.1,134 నుంచి రూ2,754 వరకు ఆన్‌లైన్‌లో విక్రయిస్తుండడం దసరా దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.