
సహస్ర బాబాయే సూత్రధారి...
కనిగిరి/విజయవాడ: ప్రకాశం జిల్లాలో గురువారం కిడ్నాప్ అయిన చిన్నారి సహస్ర కేసును పోలీసులు ఛేదించారు. కనిగిరిలో నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న సహస్రను సొంత బాబాయే కిడ్నాప్ చేశాడు. దీంతో సహస్ర తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా వారు 24 గంటలు గడవకముందే కిడ్నాప్ డ్రామాకు తెరదించి చిన్నారిని రక్షించారు.
కృష్ణాజిల్లా విజయవాడలో కిడ్నాపర్లను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు కావడంతో చిన్నారి అమ్మమ్మ ఇంటి దగ్గర ఉందని, అక్కడ ఆడుకుంటుండగా కిడ్నాప్ చేశారు. ఇంటి ముందు ఆడుకుంటుండగా బ్లాక్ పల్సర్ బైక్‌పై హెల్మెట్‌లు పెట్టుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు చిన్నారిని కిడ్నాప్ చేశారు.
అనంతరం కిడ్నాపర్లు చిన్నారి తల్లిదండ్రులకు పలుమార్లు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారని, అయితే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పవద్దని బెదిరించారు. దీంతో సహస్ర తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా కిడ్నాపర్లను పోలీసులు పట్టుకుని, చిన్నారిని క్షేమంగా విడిపించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో తమ చిన్నారి క్షేమంగా బయటపడిందని సహస్ర తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆర్థిక లావాదేవీల కారణంగానే సహస్రను కిడ్నాప్ చేసినట్లు సమాచారం.