- కృష్ణసాహితి కూచిపూడి అరంగేట్రం
అరవిరిసిన నాట్యపారిజాతం
Published Sun, Dec 25 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
రాజమహేంద్రవరం కల్చరల్:
పువ్వు పుట్టగానే పరిమళించింది. మూడో తరగతి విద్యార్థిని కడియం కృష్ణసాహితి తన హావభావాలు, అభినయాలతో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్ర ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న కృష్ణసాహితి కూచిపూడి రంగప్రవేశం (అరంగేట్రం) ఆదివారం సాయంత్రం రివర్‌బే ఆహ్వానం హాలులో ఘనంగా జరిగింది. ’గం గణపతికివే నా ప్రణతులు’ (గణపతి కౌతం), ’వలచి వచ్చియున్నానురా’ (నవరాగమాలిక వర్ణం), బాలగోపాల (తరంగం), మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ (దశావతార శబ్దం), జయజయ దుర్గే (దుర్గాసూక్తి), ’నారాయణ తే నమోనమో’ (అన్నమయ్య కీర్తన), ధిరతాన ధీంతా (తిల్లాన)లకు ఆమె చేసిన నృత్యాభినయం ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకుంది. కృష్ణసాహితిని అతిథులు, నిర్వాహకులు సత్కరించారు. ముందుగా నాట్యాచారిణి గోరుగంతు ఉమాజయశ్రీకు కృష్ణ సాహితి గురుపూజ నిర్వహించింది. శ్రీ రాధాకృష్ణ సంగీత, నృత్యకళాక్షేత్ర విద్యార్ధులు బృందగానాలు ఆలపించారు. ప్రియాంక వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంస్థ డైరెక్టర్ జి.రాధాకృష్ణ స్వాగత వచనాలు పలికారు. కళారత్నహంస అవార్డు గ్రహీత డి.రాజకుమార్ వుడయార్, హైదరాబాద్‌కు చెందిన నాట్యకళాకారిణి డాక్టర్ పి.ఇందిరా హేమ, కూచిపూడి నాట్యకళాకారుడు పసుమర్తి శ్రీనివాసు, అయినవిల్లి సర్పంచ్ కె.రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement