- ఇక ట్రెజరీ ద్వారా వేతనాలు!
- సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో అమలు?
- అర్చకుల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం
- మంత్రి తుమ్మల చొరవతో సమస్య కొలిక్కి
- 460 మంది అర్చకులకు చేకూరనున్న లబ్ధి
ఇక అర్చకులకు మంచి రోజులు రానున్నాయి. ట్రెజరీ ద్వారా వారికి వేతనాలు చెల్లిస్తూ.. సర్కారు ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. వేతనాల పెంపును పక్కనపెట్టి.. ప్రస్తుతం ఉన్న వేతనాన్నే 010 పద్దు ద్వారా చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల అర్చకుల ఆందోళనతో ప్రభుత్వం జూన్ 3న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని.. ఇందులో కీలక సభ్యుడిగా ఉన్న మంత్రి తుమ్మల చొరవతో అర్చకులను గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఖమ్మం కల్చరల్: అర్చకులకు ఇక మంచి రోజులు రానున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నెరవేరనుంది. ట్రెజరీ ద్వారా వారికి వేతనాలు చెల్లిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. అర్చకులు, ఉద్యోగులు రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే ట్రెజరీల ద్వారా తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. రాష్ట్రం ఏర్పడిన సమయంలో సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా అపరిష్కృతంగా ఉన్న అర్చకుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ అది నెరవేరకపోవడంతో ఆగ్రహించిన అర్చక, ఉద్యోగ జేఏసీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా 2015, జూన్‌లో నిరవధిక సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా ఉన్న రమణాచారి నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. కమిటీ విధివిధానాలు రూపొందించి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా దానిని కొందరు తుంగలో తొక్కారనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత పలు ప్రాంతాల్లో అర్చక ఉద్యోగ జేఏసీ నేతలు సమావేశాలు ఏర్పాటు చేసి.. ఆమరణ నిరహార దీక్షలు చేస్తామని.. సమస్యల పరిష్కారానికి కేసీఆర్ చొరవ చూపాలని హెచ్చరికలు జారీ చేయడంతో.. సమస్య ఓ కొలిక్కి వచ్చింది.
010 పద్దు ద్వారా వేతనాలు?
అర్చకుల సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసినట్లు సమాచారం. వేతనాల పెంపును పక్కనపెట్టి.. ప్రస్తుతం ఉన్న వేతనాన్నే 010 పద్దు ద్వారా చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తర్వాత మిగిలిన సమస్యలను పరిష్కరించవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు శాఖ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అర్చక, ఉద్యోగుల వివరాలు సేకరించాలని దేవాదాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు. జిల్లాలో భద్రాచలం మినహా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 105 ఆలయాలు, ఆ శాఖ గుర్తించిన 448 ఆలయాల్లో పనిచేస్తున్న సుమారు 460 మంది అర్చక, ఉద్యోగుల వివరాలను ఫొటోలతో సహా సేకరించింది. వీటిని ఆన్‌లైన్ చేసి.. రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయానికి పంపే పనిలో జిల్లా ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నెల రోజుల సమయం పట్టవచ్చని.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి అర్చక, ఉద్యోగులు ట్రెజరీ ద్వారా వేతనాలు పొందే అవకాశం ఉందని దేవాదాయ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
మంత్రి తుమ్మల చొరవతో...
జిల్లాలోని అర్చక, ఉద్యోగులతోపాటు ఇతర జిల్లాలకు చెందిన అర్చక, ఉద్యోగులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి సమస్యను వివరించారు. స్పందించిన ఆయన సీఎం కేసీఆర్‌కు సమస్య ప్రాధాన్యతను వివరించారు. ఆ వెంటనే సీఎం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో జూన్ 3న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న మంత్రి తుమ్మల చొరవతో నెల రోజుల్లోనే సమస్యను ఓ కొలిక్కి వచ్చినట్లు దేవాదాయశాఖ ఉద్యోగి చెప్పారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ప్రభుత్వం మా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ.. వేతనాల ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిసింది. ఏళ్లుగా అనుభవిస్తున్న మా వెతలను ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదు. ప్రస్తుతం వాటిని గుర్తించి.. మాకు సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి జిల్లా అర్చక, ఉద్యోగ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.
– దాములూరి వీరభద్రశర్మ, జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు