ఏ ‘నోటా’ విన్నా..!
అవే కష్టాలు..తొలగని ఇబ్బందులు
- పెద్దనోట్ల రద్దుతో విలవిల్లాడుతున్న జనం
- ఆదివారం పనిచేయని బ్యాంకులు
- మూతపడిన ఏటీఎంలు
- తీరని అత్యవసరాలు..
కర్నూలు(అగ్రికల్చర్): పెద్దనోట్ల రద్దు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి..చిల్లర దొరకక ప్రజల అవస్థలు వర్ణనాతీతం. ఆదివారం బ్యాంకులు పనిచేయకపోవడం, ఏటీఎంలు మూతపడడంతో సమస్యలు ఎక్కువయ్యాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం గ్రామీణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు తీసుకోవడానికి ఆంక్షలు విధించడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటి వరకు జిల్లాలో కొత్త రూ. 500 నోట్లు అందుబాటులోకి రాకపోగా..రూ. 100 నోట్లు కూడా లభ్యం కావడం గగనమైంది. అందుబాటులోకి వచ్చిన రూ.2000 నోట్లకు చిల్లర దొరకడం కష్టమయింది. వెరసి దినసరి ఖర్చులకు అవసరమైన డబ్బులు లేక అల్లాడాల్సి వస్తోంది. ఇంత దుర్భరమైన పరిస్థితి ఎప్పుడూ చూడ లేదని రైతులు వాపోతున్నారు.
కొరవడిన సహకారం..
రిజర్వుబ్యాంకు ఆదేశాల మేరకు జిల్లా సహకార కేంద్రబ్యాంకు, పీఏసీఎస్‌ల్లో నోట్ల మార్పిడి జరగడం లేదు. డిపాజిట్లు స్వీకరించకపోవడంతో గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు పెరిగాయి. పెద్దనోట్ల రద్దు రోజు నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు స్తంభించిపోయాయి. కర్నూలు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించినప్పటికి మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు మొదలు కాలేదు. మార్కెట్‌ల బంద్‌తో హమాలీలు, కాటాదారులు, కూలీలకు ఉఫాది కరువైంది.
కొనుగోళ్లు బంద్..
వ్యవసాయ మార్కెట్ కమిటీలలో లావాదేవీలు సాఫీగా కొనసాగడానికి వీలుగా రూ.50వేల వరకు నగదు తీసుకునే అవకాశం ఉన్నా..బ్యాంకుల్లో డబ్బు లేకపోవడం వల్ల ఇది సాధ్యం కాలేదు. ఎస్‌బీఐ, ఆంధ్రబ్యాంకు, విజయబ్యాంకులకు కరెన్సీ చస్ట్‌లు ఉండటంతో వీటిలో అంత ఇబ్బంది లేదు. మిగిలిన అన్ని బ్యాంకుల్లో కొరత తీవ్రంగా ఉంది. రూ.50వేల తీసుకోవాలని పోతే డబ్బులు లేవంటూ అరకొరగా ఇస్తున్నారు. ఇవి ఏ మూలకు సరిపోతాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. తాము పండించిన పంట ఉత్పత్తులు కొనండి... నగదు రూపంలో10శాతం మాత్రమే ఇవ్వండి.. మిగిలిన మొత్తాన్ని చెక్‌ల రూంలో ఇచ్చి సరేనని రైతులు పేర్కొంటున్నా...నగదు లభ్యం కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ, సి. క్యాంపు రైతు బజార్‌లో మినీ ఏటీఎంలు ఏర్పాటు చేసినా.. 100 నోట్లు కేవలం 10 మాత్రమే వస్తున్నాయి.
ఇబ్బందులు మరిన్ని రోజులు
నగదు లభ్యత సాధారణ స్థాయికి రావాలంటే కనీసం నెల రోజులు పట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఏదో విధంగా మార్కెట్‌లు పనిచేసే విధంగా చూసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా ఇప్పట్లో నగదు అవసరం అయినంత ఇవ్వలేమంటూ బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. రైతుల పరిస్థితి, మార్కెటింగ్ మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఏర్పడింది.
జన్‌ధన్ ఖాతాలకు డిమాండ్....
పెద్ద నోట్లు రద్దుతో జన్‌ధన్ ఖాతాలకు డిమాండ్ పెరిగింది. జిల్లాలో 6లక్షల ఖాతాలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికే 50 శాతం ఖాతాల్లో రూ.50వేల వరకు డిపాజిట్లు వచ్చి పడ్డాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు వీటిపై దృష్టి సారించాయి.