రాయిన్‌పల్లిలో అడవిలో భారీ గుంతలు
- ఎడాపెడా తవ్వేస్తున్న అక్రమార్కులు
- ఫిల్టర్లు ద్వారా జోరుగా ఇసుక తయారీ
- యథేచ్ఛగా లక్షల్లో అక్రమ వ్యాపారం
- పట్టించుకోని అటవీ శాఖ అధికారులు
మెదక్/మెదక్ రూరల్: చుట్టూ భయంకరమైన అడవి.. అటవీ శాఖ అధికారులకు తప్ప మరో వ్యక్తికి తెలియని ప్రదేశం. మూడో కంటికి తెలియకుండా లక్షల్లో జరుగుతున్న అక్రమ ఇసుక వ్యాపారం. ఫిల్టర్లు ఏర్పాటుచేసి మరీ దుండగులు మట్టిని తవ్వేస్తున్నారు. ఇదీ మెదక్ మండలం రాయినపల్లి పంచాయతీ పరిధి మల్కాపూర్ తండా ప్రాంతంలోని జరుగుతున్న దందా. విషయం తెలిసి అటువైపు వెళ్తే దాడి చేసేందుకు కొందరు ఎప్పుడూ రెడీగా ఉండటంతో ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
మెదక్ మండలం రాయిన్‌పల్లి పంచాయతీ పరిధి మల్కాపూర్ తండా ప్రాంతంలోని అడవిలో కొంతకాలంగా కొందరు ఇసుక ఫిల్టర్లను అక్రమంగా ఏర్పాటు చేసి ఇసుకను దర్జాగా తరలించుకుపోతున్నారు. ఫలితంగా పచ్చటి అడవిలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలే కనిపిస్తున్నాయి.
మెదక్ పట్టణంతో పాటు మండలానికి చెందిన కొందరు ఏకమై అటవీ ప్రాంతంలో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటుచేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జేసీబీలతో మట్టిని తవ్వేస్తున్నారు. ఈ అడవి చుట్టూ దాదాపు 30 మంది యువకులు బిజినెస్‌కు కాపలాగా ఉంటున్నారు. మరికొంతమంది ఇసుక ఫిల్టర్ల వద్ద పని చేయిస్తుంటారు. మెదక్, చిన్నశంకరంపేట తదితర ప్రాంతాల నుంచి ఇక్కడకు కూలీలను తీసుకొస్తున్నారు. ఈ ప్రాంతంలో 3 ఫీట్ల లోతులో ఇసుక మేటలు విపరీతంగా రావడంతో స్వార్థపరుల పంట పండుతోంది. ఈ ఇసుకను మెదక్ పట్టణంతో పాటు రాత్రిళ్లు హైదరాబాద్‌కు కూడా తరలిస్తున్నట్టు సమాచారం.
బైక్‌లు కూడా వెళ్లని దారులు
ఇసుక ఫిల్టర్ల వద్దకు ట్రాక్టర్లు తప్ప ద్విచక్ర వాహనాలు వెళ్లలేనంత బురదతో రహదారి ఉంటుంది. అడవిలోకి వెళ్లేందుకు నాలుగైదు దారులు ఏర్పాటుచేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమ దందా జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవం లేదు. ఈ తతంగమంతా అధికారులకు తెలిసే జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, అడవికి ఆనుకొని ఉన్న పొలాల రైతులు గతంలో అక్రమ వ్యాపారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా దాడులు చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది.