no action
-
సంభాల్ మసీదు బావి వివాదం.. యథాతథ స్థితిని కొనసాగించండి
న్యూఢిల్లీ: సంభాల్‌లోని మొఘలుల నాటి జామా మసీదు సమీపంలోని వివాదాస్పద బావిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని శుక్రవారం సుప్రీంకోర్టు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)తోపాటు ఉత్తరప్రదేశ్ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి జామా మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రం, ఏఎస్ఐలతోపాటు సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్‌కు, హరి శంకర్ జైన్ తరపున ఉన్న హిందూ కక్షిదారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21వ తేదీన ఉంటుందని, రెండు వారాల్లోగా అక్కడి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బావికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్ట రాదని స్పష్టం చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు మసీదులో చేపట్టిన సర్వే నివేదికను సీల్డ్ కవర్లోనే ఉంచాలంది. -
చార్మినార్ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్‌పై.. ఎలాంటి కఠిన చర్యలు వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మేఘా రాణి అగర్వాల్‌తో పాటు పవన్ మిస్త్రాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ర్యాలీలో జరిగిన వివాదంపై వివరణ ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నందున, వారి వివరణ వినాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వెలువడిన నాటి నుంచి 3 రోజుల్లో సీఆర్పీసీ 41ఏ నోటీసులకు వివరణ ఇవ్వాలని పిటిషనర్లకు చెప్పింది. హైదరాబాద్ హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్‌లో తమపై దాఖలైన కేసులో అరెస్టు సహా ఇతర చర్యలు చేపట్టకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ మేఘా రాణి అగర్వాల్‌తో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ న్యాయవాది అంజలి అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలో ఒకరైన మేఘా రాణి అగర్వాల్ చార్మినార్ నుంచి పోటీ చేస్తున్నారని, ఈ నెల 9న నిర్వహించిన ర్యాలీ సందర్భంగా కొంత గందరగోళం చోటుచేసుకుందన్నారు. ర్యాలీలో గందరగోళంపై ఎండీ.జాఫర్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పిటిషనర్లపై కేసు నమోదైంది. 22న పిటిషనర్లకు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. పిటిషనర్లు వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పోలీసులు అరెస్టు సహా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వివరణ ఇచ్చేందుకు వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ, పిటిషన్లో వాదనలను ముగించారు. -
నవంబర్ 17 వరకూ అనిల్ అంబానీపై చర్యలు వద్దు
ముంబై: బ్లాక్ మనీ చట్టం కింద ఐటీ శాఖ నోటీసులు అందుకున్న రిలయన్స్ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్ 17 వరకూ ఎటువంటి బలప్రయోగ చర్యలు తీసుకోవద్దని ఆదాయ పన్ను శాఖను న్యాయస్థానం ఆదేశించింది. రెండు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 814 కోట్ల వివరాలు వెల్లడించకుండా రూ. 420 కోట్ల మేర పన్నులు ఎగవేశారంటూ ఆగస్టు 8న అంబానీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. పన్నులు ఎగవేయాలనే ఉద్దేశ్యంతో, ఆయన కావాలనే తన విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించలేదని ఆరోపించింది. నోటీసులో పొందుపర్చిన సెక్షన్ల ప్రకారం అనిల్ అంబానీకి జరిమానాతో పాటు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఈ నోటీసులను సవాలు చేస్తూ అనిల్ అంబానీ హైకోర్టును ఆశ్రయించారు. నిర్దిష్ట లావాదేవీలు 2006–07 నుంచి 2010–11 మధ్యలో జరిగినవని ఐటీ శాఖ చెబుతుండగా.. బ్లాక్‌మనీ చట్టం 2015లో అమల్లోకి వచ్చిందని ఆయన తరఫు లాయరు రఫిక్ దాదా వాదించారు. గతంలో జరిగిన లావాదేవీలకు ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. దీన్ని ఇప్పటికే ఐటీ కమిషనర్ వద్ద సవాలు చేసినట్లు, సివిల్ వివాదం పెండింగ్‌లో ఉండగా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి లేదని దాదా తెలిపారు. అనిల్ అంబానీ పిటిషన్‌పై స్పందించేందుకు కొంత సమయం కవాలని ఐటీ శాఖ కోరింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. -
‘వనస్థలిపురం పోలీసులపై నమ్మకం లేదు’
సాక్షి, సిటీబ్యూరో : గడిచిన కొన్నేళ్లుగా తనను వివిధ రకాలుగా వేధించిన ఇన్స్పెక్టర్ కె.చంద్రకుమార్ విషయంలో వనస్థలిపురం పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు గురువారం వాపోయారు. ఈ మేరకు ఆమె ‘సాక్షి టీవీ’కి సందేశాలు పంపారు. ఈ ‘ఖాకీ’చకుడిని నగర పోలీసు కమిషనర్ సస్పెండ్ చేయగా... నిర్భయ కేసు నమోదైనా వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేయకపోవడం సందేహాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌లో (ఎస్బీ) ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తూ సస్పెన్షన్‌కు గురైన ఇన్స్పెక్టర్ కె.చంద్రకుమార్ తక్షణం అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సందేశాలు, ఫోన్ కాల్స్‌తో పాటు నగ్న వీడియో కాల్స్ ద్వారా బాధితురాలి పట్ల హేయంగా ప్రవర్తించిన చంద్రకుమార్‌పై నమోదైన కేసు విషయంలో వనస్థలిపురం పోలీసులు ఆది నుంచి అనుమానాస్పదంగానే ప్రవర్తిస్తున్నారు.(నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ సీఐ వేధింపులు..) ఈ ఇన్స్పెక్టర్ బాధితురాలు సోమవారం మధ్యాహ్నం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని తొలుత జనరల్ డైరీలో (జీడీ) ఎంట్రీ పెట్టిన అధికారులు ఎఫ్ఐఆర్ నం.748/2020గా కేసు నమోదు చేశారు. ఇందులో ఐపీసీలోని 354, 354 సీ, 354 డీ, 504, 506, 509 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్‌లోని 67, 67 ఏ సెక్షన్ల కింద ఆరోపణలు పొందుపరిచారు. చంద్రకుమార్ వ్యవహారంపై ప్రాథమిక విచారణ చేయించిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అతడిని మంగళవారం సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీంతో పాటు చంద్రకుమార్‌పై వనస్థలిపురం పోలీసుస్టేషన్లో కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆ ఠాణా ఇన్స్పెక్టర్ను సంప్రదించారు. చంద్రకుమార్‌పై సోమవారమే కేసు నమోదైందన్న విషయాన్ని గోప్యంగా ఉంచడానికి వనస్థలిపురం పోలీసుల అధికారులు ప్రయత్నించారు. ఆయన తమ కమిషనరేట్ అధికారి కాదని, ఇక్కడ ఎలాంటి కేసులు నమోదు కాలేదంటూ చెప్పి తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. పోలీసులు తప్పు చేసినా తప్పించుకోలేరు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ నగర కొత్వాల్ తన ట్విట్టర్ ద్వారా చంద్రకుమార్ సస్పెన్షన్‌ను బయటపెట్టారు. అయితే ఓ మహిళతో అత్యంత హేయంగా ప్రవర్తించిన చంద్రకుమార్‌పై నమోదైన కేసు విషయాన్ని మాత్రం వనస్థలిపురం పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం.(వనస్థలిపురం ఎసీపీ సస్పెన్షన్ కేసు దర్యాప్తు వేగవంతం) దీనికి తోడు నిర్భయ వంటి కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు ఇన్స్పెక్టర్ను వనస్థలిపురం పోలీసులు గురువారం వరకు అరెస్టు చేయకపోవడం బాధితురాలి అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. వరంగల్‌లో పని చేస్తున్న ప్రభుత్వ అధికారిణి అయిన బాధితురాలు గురువారం ‘సాక్షి టీవీ’తో మాట్లాడుతూ... ‘నా వద్ద ఉన్న అన్ని ఆధారాలను డీజీపీ, రాచకొండ సీపీతో సహా అందిరికీ పంపించా. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతామని హామీ ఇచ్చారు. అయితే మూడు రోజులు ఎదురు చూసినా అది జరగలేదు’ అని వాపోయారు. -
విశాఖ భూ కుంభకోణంపై చర్యలు నిల్
-
నకిలీ వైద్యులపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును తప్పుపడుతూ గురువారం శాసనమండలిలో అధికారపక్ష సభ్యులే మంత్రి లక్ష్మారెడ్డిపై విమర్శలు చేశారు. నకిలీ వైద్యులకు సంబంధించిన ప్రశ్న సందర్భంగా ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లు అమాయక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. అలాంటి వారిపై పీడీ చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఓ ఆస్పత్రిలో చేరిన మహిళకు పరీక్షలేవీ చేయకుండానే 15 రోజుల వ్యవధిలో మూడు సర్జరీలు చేసి ఆమె మృతికి కారణమైన వైద్యులు, ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి, మంత్రి పేషీకి ఫిర్యాదు చేసినా ఇంత వరకు స్పందించలేదని మరో సభ్యుడు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి విమర్శించారు. అలాగే సరైన వైద్యం అందించక పోవడంతో అదే ఆస్పత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే మృతి చెందిన ఘటనపైనా ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. దీనిపై లక్ష్మారెడ్డి స్పందిస్తూ మహిళ మృతి కేసులో చట్ట ప్రకారం ఆస్పత్రిపె చర్యలు తీసుకుంటామని, మాజీ ఎమ్మెల్యే మృతి అంశంపై విచారణ జరుగుతోందన్నారు. ఇంకా పలువురు సభ్యులు విమర్శలు కురిపించడంతో మంత్రి లక్ష్మారెడ్డి కొంత అసహనానికి గురవగా ఆర్థిక మంత్రి ఈటల కల్పించుకొని మాట్లాడుతూ రాత్రికి రాత్రే అన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు. ఏవైనా సమస్యలుంటే మంత్రుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలంటూ అందరినీ సమాధాన పరిచారు. 1.83 లక్షల కేసీఆర్ కిట్ల పంపిణీ రాష్ట్రంలో స్వల్పకాలంలోనే 1.83 లక్షల కేసీఆర్ కిట్లను పంపిణీ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. గురువారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభమయ్యాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 55 శాతం ప్రసవాలు పెరిగాయని, మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. -
‘నిర్లక్ష్యపు’ నిప్పు
జిన్నారం(పటాన్చెరు): రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కోట్ల రూపాయల ఆస్థి నష్టంతో పాటు, కొన్ని సార్లు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పరిశ్రమల యజమానులు కనీస నియమనిబంధనలను కూడా పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నయాన్న విమర్శలు ఉన్నాన్నాయి. ఎండాకాలంలో ప్రమాదాలు మరింతా పెరిగే ప్రమాదం ఉంది. జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని ఖజీపల్లి, బొల్లారం, గడ్డపోతారం, గుమ్మడిదల, అనంతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో దాదాపు 200 రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 50 శాతానికి పైగా చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియట్ ప్రొడక్టులను తయారు చేస్తుంటారు. తగిన రక్షణ పరికరాలు లేకపోవటంతో తరచూ వీటిలోనే అధికంగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన పరిశ్రమలకు అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రమాదం జరుగుతున్న సమయంలో సైతం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు సంఘటనా స్థలానికి రాకుండా, ప్రమాదం జరిగిన తరువాత రోజు వచ్చి పరిశీలించటం ఆనవాయితీగా మారింది. ప్రమాదం జరుగతున్న సమయంలో తీవ్రత తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి అధికారులు అందుబాటులో ఉండడం లేదు. పరిశ్రమల్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాకర్టరీస్ అధికారులు సూచించిన మేర రక్షణ చర్యలు ఉండాలి. ఈ విషయాన్ని అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఇటీవల జరిగిన ప్రమాదాలు.. - గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో నెల రోజుల క్రితం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. - బొల్లారంలోని ఓ రసాయన పరిశ్రమలో రెండు నెలల క్రితం కార్మికులు రసాయనాలను కలుపుతుండగా అగ్ని ప్రమాదం జరిగింది - బొంతపల్లిలోని మరో పరిశ్రమలో రెండు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో కార్మికులకు గాయాలయ్యాయి. పరిశ్రమ పూర్తిగా దగ్ధం కావడంతో తీవ్ర ఆస్థినష్టం జరిగింది. - అనంతారంలోని మరో చిన్నతరహా పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులుతీవ్రంగా గాయపడగా, భారీ ఆస్థి నష్టం జరిగింది. - ఇటీవల గుమ్మడిదలోని మహాసాయి రసాయన పరిశ్రమలో రసాయనాలను దింపుతుండగా స్పార్క్ వచ్చి ప్రమాదం జరిడంతో రూ. 30 కోట్ల వరకు ఆస్థినష్టం జరిగింది. పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. నిపుణులైన కార్మికులు లేకే..? రియాక్టర్ల వద్ద అనుభవం ఉన్న నిపుణులైన కార్మికులతో పనులు చేయించాల్సి ఉంటుంది. వీరికి అధిక మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ యాజమాన్యాలను అనుభవం లేని కార్మికులతో పనులు చేయిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. రసాయనాలను కలపడం, దిగుమతి చేస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎండాకాలం మరింత జాగ్రత్త అవసరం.. ఎండాకాలంలో రసాయన ప్రతి చర్యలు అధికంగా జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏటా పారిశ్రామిక వాడల్లో దాదాపు 30 ప్రమాదాలు జరిగితే అందులో 20 వరకు ఎండాకాలంలో జరిగినవే ఉంటాయి. అగ్నిమాపక కేంద్రం లేక.. పారిశ్రామిక వాడల్లో అగ్నిమాపక కేంద్రాలు లేకపోవటంతో ప్రమాదం జరిగిన సమయంలో ఆస్థినష్టం అధికమవుతోంది. గుమ్మడిదల, జిన్నారం మండలాల్లోని పారిశ్రామిక వాడల్లో ఎమైనా ప్రమాదాలు జరిగితే పటాన్చెరు, జీడిమెట్ల, నర్సాపూర్, బీహెచ్ఈఎల్ల నుంచి అగ్నిమాపక వాహనాలు రావాల్సిన పరిస్థితి. గడ్డపోతారం పారిశ్రామిక వాడకు హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి వచ్చిన సమయంలో ఈ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా విషయం కార్యరూపం దాల్చలేదు. తెలియని ప్రమాదాలు ఎన్నో.. మల్టీనేషన్ కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాల విషయం బయటకు రావటం లేదు. వాటిల్లో ప్రమాదాలు జరిగినా అప్పటికప్పుడు మంటలను ఆర్పివేసేలా విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సంఘటనల్లో కార్మికులు మృతి చెందినా విషయం బయటకు రానివ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. చర్యలు తీసుకుంటున్నాం రసాయన పరిశ్రమల్లో అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకునేలా యజమాన్యాలకు సూచనలు చేస్తున్నాం. నిబంధనలను పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంతో పాటు, నోటీసులు అందిస్తున్నాం. ఇటీవల గుమ్మడిదలలో జరిగిన ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. – రాజ్‌గోపాల్, ఇన్స్పెక్టర్ ఆఫ్ప్యాక్టరీస్ అధికారి -
జకీర్‌పై రెడ్‌కార్నర్ నోటీస్‌కు ఇంటర్‌పోల్ నో
న్యూఢిల్లీ: వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌ను ఏ దేశంలోనైనా అరెస్ట్ చేసేలా రెడ్ కార్నర్ నోటీస్ జారీచేయాలన్న భారత విజ్ఞప్తిని ఇంటర్‌పోల్ శనివారం తిరస్కరించింది. అస్పష్ట ప్రకటనలు, ఆరోపణలతో జకీర్‌పై అభియోగాలు మోపడంతో పాటు ఆయనపై పోలీసులు ఇప్పటివరకూ ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ఇంటర్‌పోల్ భారత విజ్ఞప్తిని తోసిపుచ్చింది. జకీర్‌కు సంబంధించి తమతో పాటు భారత్ పంపిన వివరాలను అన్ని దేశాలు తమ డేటాబేస్‌ల నుంచి తొలగించాలని ఇంటర్‌పోల్ ఆదేశించింది. -
‘వేటు’కు విరామం...!
► చర్యలు వద్దు ► స్పీకర్‌కు హైకోర్టు ఆదేశం ► డీఎంకే ఎమ్మెల్యేలకు తాత్కాలిక ఊరట ► గవర్నర్‌తో భేటీకి స్టాలిన్ నిర్ణయం సస్పెన్షన్ వేటు నుంచి డీఎంకే ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి బయటపడ్డారు. మద్రాసు హైకోర్టు రూంలో తాత్కాలికంగా ఊరట లభించింది. గుట్కా కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్ ధనపాల్కు హైకోర్టు న్యాయమూర్తి దురై స్వామి గురువారం ఆదేశాలు ఇచ్చారు. సాక్షి, చెన్నై : గవర్నర్ బల పరీక్షకు ఆదేశిస్తే, సంకటంలో పడుతామన్న ఆందోళనతో సీఎం పళని స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు సిద్ధపడ్డ విషయం తెలిసిందే. ఆ మేరకు అసెంబ్లీలో సాగిన గుట్కా వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే సభ్యులు 21 మందిని సస్పెండ్ చేయడానికి తగ్గ కార్యాచరణ సిద్ధం చేశారు. సభా హక్కుల సంఘం ద్వారా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు సైతం ఇప్పించారు. నోటీసుకు వివరణ ఇవ్వడానికి మరో పదిహేను రోజులు సమయం కావాలని ఇప్పటికే డీఎంకే సభ్యులు అసెంబ్లీ కార్యదర్శి భూపతికి విజ్ఞప్తి చేశారు. అలాగే, గుట్కా వ్యవహారం కోర్టులో విచారణలో ఉండడం, ఇప్పటికే నిషేధిత వస్తువులపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉండటాన్ని అస్త్రంగా చేసుకుని సభా హక్కుల ఉల్లంఘన నోటీసు రద్దుకు డీఎంకే సభ్యులు హైకోర్టు తలుపు తట్టారు. ఈ తలుపులు తెరచుకోవడంతో ప్రస్తుతానికి సస్పెన్షన్ వేటు నుంచి డీఎంకే సభ్యులకు ఊరట కల్గినట్టు అయింది. వేటుకు విరామం సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ డీఎంకే సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ గురువారం న్యాయమూర్తి దురై స్వామి నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. డీఎంకే తరపున సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ హాజరయ్యారు. నిషేధిత గుట్కాల వ్యవహారం, జోరుగా సాగుతున్న విక్రయాల వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బయట నిషేధిత వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్న సమయంలో, ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా, వాటిని ఆధారాలతో సహా నిరూపించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉందని ఈసందర్భంగా ప్రస్తావించారు. బల పరీక్షలో నెగ్గాలన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, గుట్కా అస్త్రంతో డీఎంకే సభ్యులను సస్పెండ్ చేయడానికి ప్రయత్నాలు సాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంతలో అడ్వకేట్ జనరల్ విజయనారాయణన్ జోక్యం చేసుకుని, అసలు ఈ పిటిషన్ విచారణ యోగ్యమా..? కాదా..? అన్నది తేల్చాల్సి ఉందని వాదన వినిపించారు. అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని ఇదివరకే హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఇక్కడ గుట్కా వ్యవహారం ముడిపడి ఉందని డీఎంకే తరపున కపిల్ సిబల్ వాదన వినిపించడంతో వెనక్కు తగ్గక తప్పలేదు. వివరణ ఇవ్వడానికి సమయం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు, తదితర అంశాల్ని పరిశీలించి కోర్టుకు వివరణ ఇవ్వడానికి సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. అంతవరకు సస్పెన్షన్ విషయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోమని కోర్టుకు హామీ ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుని, సమగ్ర వివరాలను కోర్టు ముందు ఉంచాలని పేర్కొంటూ, గుట్కా వ్యవహారంగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు డీఎంకే సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు వీలు లేదని అసెంబ్లీ స్పీకర్ ధనపాల్కు ఆదేశాలు ఇచ్చారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు తాత్కాలిక స్టే విధిస్తూ, తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేశారు. కోర్టు అభయంతో ప్రస్తుతానికి డీఎంకే సభ్యుల సస్పెండ్‌కు విరామం పడ్డట్టే. గుట్కా విషయంగాకోర్టులో పలు పిటిషన్లు సైతం ఉన్న దృష్ట్యా, తదుపరి విచారణ సమయంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయోనన్న ఎదురు చూపులు డీఎంకే వర్గాల్లో నెలకొన్నాయి. గవర్నర్ చెంతకు కోర్టు స్టేతో డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తంచేశారు. కోర్టు స్టే ప్రజాస్వామ్య విజయంగా వ్యాఖ్యానించారు. మైనారిటీలో ఉన్న సీఎం పళని స్వామి బాధ్యతాయుతంగా పదవి నుంచి తప్పుకుంటే మంచిదని హితవు పలికారు. మెజారిటీని నిరూపించుకోవాలని పదేపదే తాము డిమాండ్ చేస్తూ వస్తున్నామని, అయితే, దొడ్డిదారిన నెగ్గడానికి తమ మీద సస్పెన్షన్ వేటు వేయడానికి వ్యూహరచన చేశారని మండి పడ్డారు. ప్రస్తుతం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా గవర్నర్‌కు లేఖల్ని సమర్పించారని అన్నారు. ఈ విషయంగా గవర్నర్‌తో భేటీకి అనుమతి కోరినట్టు తెలిపారు. పదో తేదీన అనుమతి కోరామని, అక్కడి నుంచి వచ్చే సమాధానం మేరకు తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు. -
సింగరప్పకు శఠగోపం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు నగరంలోని అళహ సింగరప్ప ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. సుమారు రూ.30 కోట్ల విలువైన భూములు పరుల చేతిలోకి వెళ్లిపోయాయి. వీటిని కాపాడుకునే విషయంలో అటు ప్రభుత్వం, ఇటు వంశపారంపర్య అర్చకులు చొరవ చూపకపోవడంతో అక్రమార్కులకు ఫలహారమయ్యాయి. భారతీయ సంస్కృ తి, వారసత్వ పరిరక్షణ సమితి చొరవ చూపినా వివాదం కోర్టులో ఉండటంతో జాప్యం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు పడమర వీధిలోని వన్నెంరెడ్డి వారి వీధిలో శ్రీ సింగరప్ప (లక్ష్మీ నరసింహస్వామి) క్షేత్రం ఉంది. ఇది నగరంలోనే అత్యంత ప్రాచీనమైంది. పురావస్తు శాఖ చెబుతున్న ప్రకారం.. దీనిని 10వ శతాబ్దంలో నిర్మించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కలిసి ఉన్న రోజుల్లో ఈ స్వామిని అళహ సింగరప్ప అని పిలిచేవారు. సింహాచలం, అంతర్వేది, మంగళగిరి, యాదగిరిగుట్ట, అహోబిలం క్షేత్రాల తరహాలో ఇక్కడి సింగరప్ప ఆలయంలోనూ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రాలన్నీ ఒకే కాలం నాటివని చెబుతుంటారు. వేంగి చాళుక్యులు, కాకతీయులు, గజపతులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు ఈ క్షేత్రాన్ని విశిష్టమైనదిగా భావించి సంరక్షణకు పూనుకున్నారు. ఇంతటి ప్రాశస్త్యం గల ఆలయానికి ఆస్తులు సైతం భారీగానే ఉండేవి. నగరంలోని ప్రస్తుత పంపుల చెరువు ఈ క్షేత్రానికి చెందినదే. ప్రజోపయోగార్థం 1915లో అప్పటి పురపాలక సంస్థ పాలకవర్గం దీనిని స్వాధీనం చేసుకుంది. ఇందుకు నష్టపరిహారంగా ఇచ్చిన సొమ్ముతో పెదపాడు మండలం తాళ్లగూడెంలో 47.10 ఎకరాల పంట భూమి కొనుగోలు చేశారు. ఆలయ నిర్వాహకులు దీనిపై వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తూ స్వామి సేవ చేస్తూ వచ్చారు. కాలక్రమంలో వారి వారసులు వేరే వ్యాపకాల్లో పడటంతో ఆలయాన్ని పట్టించుకోలేదు. తాళ్లగూడెంలో కొనుగోలు చేసిన 47.10 ఎకరాల్లో 30 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాం తంలో ఎకరం విలువ రూ.కోటిపైనే ఉంది. ఈ పరిస్థితుల్లో దేవాదాయ శాఖ ఆలయాన్ని, దానికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో నియమించిన ధర్మకర్తల మండలి భూముల అన్యాక్రాంతం విషయాన్ని అప్పటి దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు దృష్టికి తీసుకురావడంతో ఆయన విచారణకు ఆదేశించారు. పెదపాడు మండలంలో 47.1 ఎకరాల భూమితోపాటు ఆలయ చుట్టుపక్కల భూమి కూడా ఈ క్షేత్రానిదేనని తహసీల్దార్లు నివేదిక ఇచ్చారు. అయితే దేవాదాయ శాఖ ఈ భూమిని స్వాధీనం చేసుకునే దిశగా ఇంతవరకూ చర్యలు చేపట్టలేదు. ఈ పరిస్థితుల్లో ఆలయం జీర్ణ దశకు చేరుకుంది. కనీసం హుండీలో కానుకలను కూడా తీయని దుస్థితి ఉంది. ఆలయంలోని శేషశయన వాహనం అపహరణకు గురైంది. ఈ నేపథ్యంలో స్థానికులు ఆలయాన్ని, దాని ఆస్తులను కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు. ఆలయాన్ని శుభ్రం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ వస్తున్నారు. ఏటా కల్యాణం నిర్వహిస్తున్నారు. అయితే అర్చకులు ఈ ఆస్తులన్నీ తమ సొంతమంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై దేవాదాయ శాఖ రిట్ వేయడానికి గడువు కోరడంతో స్టేటస్ కో నడుస్తోంది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి స్వామివారికి చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను తిరిగి క్షేత్రానికి వచ్చేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. -
చంద్రబాబు క్లాసులు తుస్సు!
-
ఏజెన్సీలో ప్రాణాలు పోతుంటే రాజకీయ దండయాత్రలా?
సీఎం చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ద్వజం కొత్తపేట : ఒక ప్రక్క ఏజెన్సీ ప్రాంతంలో వి విధ వ్యాధులతో ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దోమలపై దండయాత్ర పేరుతో రాజకీయ దండయాత్రలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం రాత్రి జగ్గిరెడ్డి మండల పరిధిలోని గంటి గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి ఏజెన్సీ వైపు కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు. కాళ్లవాపు, మలేరియా తదితర వ్యాధులతో జనం చనిపోతుంటే సీఎంకు పట్టకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి సస్పెండ్ చేయాలనే దానిపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని మండిపడ్డారు.ప్రజలు ప్రాణాంతక వ్యాదులకు గురైనా,ప్రాణాలు కోల్పోతున్నా సీఎంగా మన్యంలో పర్యటించకపోవడం గమనిస్తే కేవలం వారి పార్టీకి ఆ ప్రాంతంలో సీట్లు రాలేదన్న కారణంతోనే అటువైపు వెళ్లడం లేదని విమర్శించారు. -
అధ్యక్షా ఇదేమి సంప్రదాయం...!
జిల్లా సమస్యలపై చర్చే లేదు వెంటాడుతున్న అనారోగ్యాల ఊసేలేదు మంత్రి వెంట పరుగులు ... హాజరుకాని డీఎంహెచ్ఓ తూతూ మంత్రంగా సాగిన జెడ్పీ సమావేశం రాష్ట్రానికి శాసన సభ ఎలానో ... జిల్లాకు జెడ్పీ సర్వసభ్య సమావేశం అలాంటింది. తమ జిల్లా ప్రతినిధులు శాసన సభలో ఏ అంశాలు ప్రస్తావించనున్నారోనని ఆశగా ఆ జిల్లా ప్రజలు ఎదురు చూసినట్టే ... తమ మండలంలోని ఏ సమస్యలను మండల ప్రజా ప్రతినిధులు, జెడ్పీ సభ్యులు చర్చకు తేనున్నారోనని మండలాల్లోని ప్రజలు గమనిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జెడ్పీ సమావేశం ఉబుసపోక కేంద్రంగా మారుతోంది. అజెండా ఉండదు ... చర్చనీయాంశ అంశాలేవో తెలియదు ... గత సమావేశం తీర్మానాల ప్రగతి ఎలా ఉంది? అభివృద్ధి ఎలా సాగుతుందో సమాధానం చెప్పేవారే లేరు. యథారాజా తథాప్రజా మాదిరిగా ప్రజాప్రతిని«ధులు గైర్హాజరైతే మేమేం తక్కువ తిన్నామానంటూ అదే బాటను పడుతున్నారు అధికారులు. సాక్షిప్రతినిధి, కాకినాడ : ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పరిష్కారం చూపించేందుకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మించిన వేదిక మరొకటి ఉండదు. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి (డిఆర్సీ) అంటూ ఒకటుండేది. ఇప్పుడది మనుగడలో లేదు. మూడు నెలలకోసారి జరిగే ఈ జెడ్పీ సమావేశాలు జిల్లా అంతటినీ ప్రతిబింబించాలి. కానీ సమావేశాలు జరుగుతున్న తీరుతో జెడ్పీ రానురాను ప్రజల్లో పలచనైపోతోంది. జిల్లా వ్యాప్తంగా 62 మంది జెడ్పీటీసీ సభ్యులు, ఇందుకు కొద్ది అటు ఇటుగా మండల పరిషత్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మాత్రమే హాజరయ్యారు, ఎంపీలు..ఇలా ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో మూడొంతులు మంది ప్రాతినిధ్యంవహిస్తున్న జెడ్పీలో ‘ప్రజల సమస్యలపై లోతైన సమీక్షలు జరిగే రోజులు గతంలో ఉండేవంట’ అని అనుకునే వాతావరణం కనిపిస్తోంది. సోమవారం కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం ఇందుకు అద్దం పడుతోది. చర్చల్లేకుండా కాలక్షేపం... ఉదయం 11.15 గంటలకు ప్రారంభమైన సమావేశం భోజన విరామం అనంతరం తిరిగి 3 గంటలకు ప్రారంభమై నాలుగు గంటలతో ముగిసింది. అంటే ఐదు గంటలతో సభను ముగించేశారు. ఇదివరకైతే పలు అంశాలపై సుదీర్ఘ చర్చ చేపట్టడంతో రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు జరిగిన సందర్భాలు మన జెడ్పీలో అనేకం ఉన్నాయి. సభ్యులు పంపించిన ప్రశ్నలకు అధికారులు ఇచ్చిన సమాధానాలు తెలియచేయడం, సంతృప్తి చెందకుంటే వాటిపై చర్చను చేపట్టడమనే సంప్రదాయం గతంలో ఉండేది. ఇందుకు తొలి గంట ప్రశ్నోత్తరాల సమయంగా నిర్ణయించేవారు. ఇప్పుడసలు ప్రశ్నోత్తరాల సమయమే లేకుండా చేశారని, చర్చకు వచ్చిన అంశాలకు సమాధానాలు కూడా సంతృప్తినివ్వలేకున్నాయని సభా ముఖంగా పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. జిల్లాలో 19 మంది ఎమ్మెల్యేలుంటే పట్టుమని పది మంది మించి ఎమ్మెల్యేలు కనిపించ లేదు. ఎమ్మెల్సీలైతే ఒక్కరు కూడా హాజరుకాలేదు. వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఒకటి, రెండు అంశాలపై చర్చలో పాల్గొన్నాక వెళ్లిపోయారు. భోజన విరామానికి ముందు నిండుగా కనిపించిన సభ ఆ తరువాత పలచబడిపోయింది. ‘పనీపాట లేకుండా వచ్చామనుకుంటున్నారా’అంటూ ఏజెన్సీ ప్రాంతంలో కూవనరం జెడ్పీటీసీతోపాటు పలువురు మహిళా జెడ్పీటీసీలు మాట్లాడే అవకాశం దక్కలేదని స్పందిస్తేనే గానీ వారికి అవకాశం ఇవ్వలేదు. ఆరోగ్యం అంటే అంత నిర్లక్ష్యమా...! ప్రజాప్రతినిధులనే కాదు. ఇటు అధికారుల వైపు నుంచి కూడా దాదాపు ఇదే తీరు కనిపించింది. సమావేశంలో కొందరు అధికారులు నిర్థిష్టమైన సమాధానాలు చెప్పకపోవడం, కొందరు గైర్హాజర్ కావడాన్ని బట్టి సమావేశానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాçష్ట్ర స్థాయిలో అసెంబ్లీ తరహాలోనే జిల్లా స్థాయిలో అంతటి ప్రాధాన్యం కలిగిన జెడ్పీ సమావేశం జరిగే తీరు ఇదేనా అని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఏజెన్సీలో అంతుపట్టని కాళ్లవాపు వ్యాధితో ఏడుగురు గిరిజనులు మృత్యువాతపడినా వ్యాధి నిర్థారణ కాని పరిస్థితుల్లో సమావేశంలో చర్చకు అవకాశం ఉన్నా డీఎంహెచ్ఓ గైర్హాజర్ కావడం విస్మయాన్ని కలిగించింది. ఈ విషయమై పలువురు సభ్యులు ప్రస్తావిస్తే జగ్గంపేటలో ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు కార్యక్రమం ఉండటంతో రాలేదనే సమాధానం లభించింది. అంటే ఇక్కడ ఏడుగురు గిరిజనులు చనిపోయి, ఏజెన్సీ సహా జిల్లా అంతటా మలేరియా, టైపాయిడ్, విష జ్వరాలు విజృంభిస్తున్న పరిస్థితులు చర్చకు వస్తాయని తెలియదా అని సభ్యులు ప్రశ్నలకు సమాధానం లేదు. ఇక్కడ ప్రజల ఆరోగ్యంపై చర్చకంటే మంత్రి పర్యటనకే ప్రాధాన్యం ఇవ్వడం ప్రజా సమస్యలపై వారికున్న చిత్తశుద్ధిని తెలియచేసింది. అలాగైతే అధికారులు తమ సబార్డినేట్లను పంపినట్టే తాము కూడా తమ భార్యలు, పిల్లలను పంపితే సరిపోతుందా అని పలువురు ప్రశ్నించడం గమనార్హం. కానరాని సగం శాఖల అధిపతులు 22 శాఖలకు సంబంధించిన సమాచారంతోపాటు అనుబంధంగా ఆరు శాఖల సమాచారాన్ని మాత్రమే ఎజెండాలోకి తీసుకువచ్చారు. ప్రధానమైన శాఖలు 55కుపైనే ఉన్నా వాటిలో సగానికి పైనే శాఖలను ఎజెండాలో విస్మరించిన అంశం ప్రస్తావనకు రాగా, వచ్చే సమావేశాల్లో అన్నింటినీ తీసుకువస్తామని జెడ్పీ సీఈఓ పద్మ సమాధానం సభ్యులకు సంతృప్తినివ్వలేదు. సమావేశంలో వచ్చిన సమస్యలను ఆయాశాఖలకు నివేదిస్తే ఆ తరువాత సమావేశం నాటికి పరిష్కరించ గలిగితే పరిష్కరించినట్టు లేకుంటే సాధ్యం కాదని ఆయా శాఖల అధిపతుల నుంచి సమాధానం జెడ్పీ ద్వారా సభ్యులకు తెలియజేయాలి. అది కూడా జరగడం లేదనే విషయం ఈ సమావేశం సాక్షిగా బయటపడింది. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఇక ముందు అలా జరగకుండా చూస్తామని జెడ్పీ సీఈఒనే స్వయంగా పేర్కొనడాన్ని బట్టి కొన్ని శాఖల నుంచి సమాచారం రాకపోవడం వాస్తవమేనని విషయం వెల్లడైంది. సభలో రైతుల రుణాలు, పాఠశాల భవనాల నిర్మాణాలు, పవర్టిల్లర్లు పంపిణీ తదితర అంశాలపై ఒకపక్క చర్చ నడుస్తుంటే అదే సమయంలో వేదిక దిగువన పలువురు అధికారులు సభ్యులతో మరేదో అంశాలపై గుసగుసలతో సభ గందరగోళంగా మార్చడం సభా సంప్రదాయాలను పక్కదారిపట్టించడం కాదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇక ముందైనా సభా సమయాన్ని వృధా కానివ్వకుండా అన్ని అంశాలపై సుదీర్ఘమైన చర్చ జరిపి జిల్లాలో ప్రధాన సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో సభ్యులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నిషేధంపై నిర్లక్ష్యం
– పర్యావరణ పరిరక్షణ చర్యలు శూన్యం – విచ్చలవిడిగా పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగం – నిషేధం ఉన్నా పట్టించుకోని యంత్రాంగం – ప్రకటనలకే పరిమితమవుతున్న ప్రభుత్వం ‘పర్యావరణ పరిరక్షణతోనే రాబోయే తరాలకు భవిష్యత్.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడతాం..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అంతా తరచూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తుంటారు. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు వాడితే కఠిన చర్యలంటూ హెచ్చరికలూ చేస్తుంటారు. వాటిపై నిషేధం ఉన్నా యంత్రాంగం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. దీంతో వాటి వినియోగం జిల్లాలో విచ్చలవిడిగా సాగుతోంది. తణుకు : జనజీవన స్రవంతిలో ప్లాస్టిక్ వాడకం భాగంగా మారింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వాడిపడేసిన ప్లాస్టిక్ సంచులు, కప్పులు, గ్లాసులే కనిపిస్తున్నాయి. పలు దుకాణాల్లో వీటిని గుట్టలుగా పడేసి విక్రయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించినా ఆ దిశగా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు ప్రజల్లో సైతం అవగాహన కనిపించకపోవడంతో జిల్లాలో నిషేధం అనే పదాన్నే నిషేధించినటై ్టంది. పా్లస్టిక్ భూతం పట్టణాల్లో ప్లాస్టిక్ నియంత్రణ ఉద్యమంలా చేపట్టాలి. ప్లాస్టిక్ వల్ల కాలుష్యం ఏర్పడటంతో పాటు భవిష్యత్‌లో భారీ వినాశాలకు కారణమవుతుందంటూ ఉన్నతాధికారులు చేసే ప్రకటనలు కేవలం ప్రచారానికే ఉపయోగపడుతున్నాయి. జిల్లాలో దాదాపు ఎక్కడా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించలేదు. గతంలో ప్రభుత్వం 20 మైక్రాన్లలోపు ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించింది. మళ్లీ కొన్నాళ్ల తర్వాత 40 మైక్రాన్లలోపు సంచులను, గ్లాసులను వినియోగించరాదంటూ కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు జీవో ఎంఎస్ 158 జారీ చేసింది. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్ సహా తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించే బాధ్యతను ఆయా కమిషనర్లకు అప్పగించారు. అయితే ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా అమలవుతున్న దాఖలాల్లేవు. ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణాలపైనా అధికారులు దాడులు చేయడంలేదు. పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ సంచులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. డ్రెయినేజీలు, మురుగునీటి కాలువలు, చెత్తకుండీలు ఇలా ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. వివిధ రకాల వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియగదారులు కూడా ఇళ్ల వద్ద నుంచి సంచులు తీసుకురాకుండా ప్లాస్టిక్ బ్యాగ్‌లపైనే ఆధారపడుతున్నారు. సాధారణంగా ప్లాస్టిక్ ఉత్పత్తులు మట్టిలో కలవడానికి వేల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవి విషవాయువుగా మారి ప్రజలకు క్యాన్సర్, ఆస్తమా, పిల్లల మెదడు మొద్దుబారి జ్ఞాపకశక్తి నశించడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ కప్పుల ద్వారా టీ, కాఫీ వంటి వేడి పదార్థాలు తాగడం ద్వారా గొంతుకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్న పశువులు మత్యువు బారిన పడుతున్నాయి. జరిమానా ఇలా.. జిల్లాలో ఏలూరు సహా మిగిలిన పట్టణాలు, గ్రామాల్లో నిత్యం 500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. వీటిలో సుమారు 150 టన్నుల వరకు ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్లు, గ్లాసులు ఉంటున్నట్టు అంచనా. సాధారణంగా 40 మైక్రాన్లలోపు పాలిథిన్ కవర్లను విక్రయిస్తే మొదటిసారి కూడా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఆ మొత్తం చెల్లించి మళ్లీ విక్రయిస్తే సంబంధిత షాపును సీజ్ చేస్తారు. ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు కొనుగోలు చేసిన వారి నుంచి రూ.200 నుంచి రూ.500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే జిల్లాలో రెండేళ్ల కాలంలో ఏలూరు సహా మిగిలిన పట్టణాల్లో కేవలం 110 మంది మాత్రమే కేసులు నమోదు చేశారు. వీటిలో కొవ్వూరులోనే 85 కేసులు నమోదు చేయగా నరసాపురం, భీమవరం, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో అసలు కేసులు నమోదు చేయలేదు. ఏలూరులో 10, తణుకు, పాలకొల్లులో 5 కేసులు చొప్పున, నిడదవోలులో 2 కేసులు నమోదు చేశారు. ఆయా మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ వినియోగిస్తున్న, విక్రయిస్తున్న వారి నుంచి కేవలం రూ.1.70 లక్షలు మాత్రమే అపరాధ రుసుం విధించారు. ప్రణాళికలు చేస్తున్నాం పా్లస్టిక్ నియంత్రణకు సంబం«ధించి ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి. గతంలో కొన్ని మునిసిపాలిటీల్లో నిషేధం అమలు చేశాం. పటిష్ట ప్రణాళికలు చేసి అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాం. – సకలారెడ్డి, మునిసిపల్ ఆర్డీ, రాజమండ్రి -
అడవిలో ఇసుకాసురులు
ఎడాపెడా తవ్వేస్తున్న అక్రమార్కులు ఫిల్టర్లు ద్వారా జోరుగా ఇసుక తయారీ యథేచ్ఛగా లక్షల్లో అక్రమ వ్యాపారం పట్టించుకోని అటవీ శాఖ అధికారులు మెదక్/మెదక్ రూరల్: చుట్టూ భయంకరమైన అడవి.. అటవీ శాఖ అధికారులకు తప్ప మరో వ్యక్తికి తెలియని ప్రదేశం. మూడో కంటికి తెలియకుండా లక్షల్లో జరుగుతున్న అక్రమ ఇసుక వ్యాపారం. ఫిల్టర్లు ఏర్పాటుచేసి మరీ దుండగులు మట్టిని తవ్వేస్తున్నారు. ఇదీ మెదక్ మండలం రాయినపల్లి పంచాయతీ పరిధి మల్కాపూర్ తండా ప్రాంతంలోని జరుగుతున్న దందా. విషయం తెలిసి అటువైపు వెళ్తే దాడి చేసేందుకు కొందరు ఎప్పుడూ రెడీగా ఉండటంతో ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మెదక్ మండలం రాయిన్‌పల్లి పంచాయతీ పరిధి మల్కాపూర్ తండా ప్రాంతంలోని అడవిలో కొంతకాలంగా కొందరు ఇసుక ఫిల్టర్లను అక్రమంగా ఏర్పాటు చేసి ఇసుకను దర్జాగా తరలించుకుపోతున్నారు. ఫలితంగా పచ్చటి అడవిలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలే కనిపిస్తున్నాయి. మెదక్ పట్టణంతో పాటు మండలానికి చెందిన కొందరు ఏకమై అటవీ ప్రాంతంలో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటుచేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జేసీబీలతో మట్టిని తవ్వేస్తున్నారు. ఈ అడవి చుట్టూ దాదాపు 30 మంది యువకులు బిజినెస్‌కు కాపలాగా ఉంటున్నారు. మరికొంతమంది ఇసుక ఫిల్టర్ల వద్ద పని చేయిస్తుంటారు. మెదక్, చిన్నశంకరంపేట తదితర ప్రాంతాల నుంచి ఇక్కడకు కూలీలను తీసుకొస్తున్నారు. ఈ ప్రాంతంలో 3 ఫీట్ల లోతులో ఇసుక మేటలు విపరీతంగా రావడంతో స్వార్థపరుల పంట పండుతోంది. ఈ ఇసుకను మెదక్ పట్టణంతో పాటు రాత్రిళ్లు హైదరాబాద్‌కు కూడా తరలిస్తున్నట్టు సమాచారం. బైక్‌లు కూడా వెళ్లని దారులు ఇసుక ఫిల్టర్ల వద్దకు ట్రాక్టర్లు తప్ప ద్విచక్ర వాహనాలు వెళ్లలేనంత బురదతో రహదారి ఉంటుంది. అడవిలోకి వెళ్లేందుకు నాలుగైదు దారులు ఏర్పాటుచేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమ దందా జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవం లేదు. ఈ తతంగమంతా అధికారులకు తెలిసే జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, అడవికి ఆనుకొని ఉన్న పొలాల రైతులు గతంలో అక్రమ వ్యాపారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా దాడులు చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. -
తడ్కపల్లికి జ్వరం
మంచం పట్టిన పల్లె.. వణికిస్తున్న విషజ్వరాలు ఆస్పత్రుల చుట్టూ జనం.. అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం సిద్దిపేట రూరల్: వర్షాకాలం.. ఆపై పారిశుద్ధ్యం లోపించడంతో గ్రామీణ ప్రజలను వైరల్ ఫీవర్ వేధిస్తోంది. మురుగు కాల్వలు పొంగి పారుతుండటం.. చెత్తాచెదారం పేరుకుపోతుండటంతో దోమలు వృద్ధి చెంది జర్వాలు తీవ్రమవుతున్నాయి. సమాచారం ఉన్నా అధికారులు, పాలకవర్గం చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట మండలంలోని తడ్కపల్లి గ్రామంలో నాలుగైదు రోజులుగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామానికి చెందిన కవిత, బాలయ్య, గొడుగు సత్తవ్వ, బండ్ల ఎల్లయ్య, బిడిలా లలిత, గడ్డం కనకవ్వ, ఎర్రోని ఎల్లయ్యతో పాటు పలువురు విషజ్వరాల బారినపడ్డారు. వీరంతా కొద్ది రోజులుగా గ్రామంలోని ఆర్ఎంపీ వద్ద వైద్యం పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారు మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట ఆస్పత్రులకు వెళ్తున్నారు. విషజ్వరాలు ప్రబలడానికి పారిశుద్ధ్య లోపమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పడకేసిన పారిశుద్ధ్యం పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో గ్రామంలోని వీధులు, మోరీలు చెత్తతో నిండిపోయాయి. దీంతో దోమలు వృద్ధి చెంది జ్వరాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. చర్యలు చేపడుతున్నాం తడ్కపల్లిలో విషజ్వరాలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. మా సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురికి జ్వరాలు, మరికొందరికి వాంతులు, విరేచనాలు ఉన్నట్లు తెలిసింది. అవన్నీ సీజన్వ్యాధులే. మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పూర్తి పరిశీలన తర్వాతే వివరాలు వెల్లడిస్తాం. – శివానందం, క్లస్టర్ వైధ్యాధికారి సిద్దిపేట -
వేధిస్తున్నారన్నా పట్టించుకోకపోవడంతో...
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడా పరిధిలో పోలీసుల నిర్లక్ష్యం ఇంటర్ విద్యార్థిని ఉసురు తీసింది. తన పొరుగున ఉండే కొంతమంది వ్యక్తులు లైంగికంగా వేధిస్తూ, కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంతో మనస్తాపం చెందిన 11వ క్లాసు విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63 లో నివసించే పాఠశాల విద్యార్థిని తన ఇంటి పక్కనే ఉండే వ్యక్తులు తనను వేధిస్తున్నారంటూ కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్ కెళ్లింది. అయితే పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆందోళన చెందిన ఆ విద్యార్థిని గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. తన పక్క ఫ్లాట్ లో నివసించే వ్యక్తులు తమ కోరిక తీర్చాలని వేధిస్తున్నారని, లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి రేప్ చేస్తామని బెదిరించారంటూ తన సోదరి రాసుకున్న సూసైడ్ నోట్ ఆమె బ్యాగ్ లో చూసినట్లు మృతురాలి సోదరుడు తెలిపాడు. దీంతో అదే రోజు పోలీసు స్టేషన్ కెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించకోలేదన్నాడు. ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్లే తన చెల్లెలు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిర్యాదు చేసి నాలుగు రోజులు గడిచినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థిని తండ్రి తెలిపారు. అందుకే తన బిడ్డ ఈ నిర్ణయం తీసుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారి దినేష్ యాదవ్ స్పందించారు. ఈ వ్యవహారంలో స్థానిక పోలీసులను వివరణ కోరామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.