నిషేధంపై నిర్లక్ష్యం | plastic usage | Sakshi
Sakshi News home page

నిషేధంపై నిర్లక్ష్యం

Published Fri, Sep 23 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

నిషేధంపై నిర్లక్ష్యం

నిషేధంపై నిర్లక్ష్యం

– పర్యావరణ పరిరక్షణ చర్యలు శూన్యం
– విచ్చలవిడిగా పాలిథిన్, ప్లాస్టిక్‌ వినియోగం
– నిషేధం ఉన్నా పట్టించుకోని యంత్రాంగం
– ప్రకటనలకే పరిమితమవుతున్న ప్రభుత్వం
 
 ‘పర్యావరణ పరిరక్షణతోనే రాబోయే తరాలకు భవిష్యత్‌..  ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొడతాం..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అంతా తరచూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తుంటారు. పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ గ్లాసులు వాడితే కఠిన చర్యలంటూ హెచ్చరికలూ చేస్తుంటారు. వాటిపై నిషేధం ఉన్నా యంత్రాంగం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. దీంతో వాటి వినియోగం జిల్లాలో విచ్చలవిడిగా సాగుతోంది. 
 
 
తణుకు : జనజీవన స్రవంతిలో ప్లాస్టిక్‌ వాడకం భాగంగా మారింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వాడిపడేసిన ప్లాస్టిక్‌ సంచులు, కప్పులు, గ్లాసులే కనిపిస్తున్నాయి. పలు దుకాణాల్లో వీటిని గుట్టలుగా పడేసి విక్రయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించినా ఆ దిశగా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు ప్రజల్లో సైతం అవగాహన కనిపించకపోవడంతో జిల్లాలో నిషేధం అనే పదాన్నే నిషేధించినటై ్టంది.  
పా్లస్టిక్‌ భూతం
పట్టణాల్లో ప్లాస్టిక్‌ నియంత్రణ ఉద్యమంలా చేపట్టాలి. ప్లాస్టిక్‌ వల్ల కాలుష్యం ఏర్పడటంతో పాటు భవిష్యత్‌లో భారీ వినాశాలకు కారణమవుతుందంటూ ఉన్నతాధికారులు చేసే ప్రకటనలు కేవలం ప్రచారానికే ఉపయోగపడుతున్నాయి. జిల్లాలో దాదాపు ఎక్కడా ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించలేదు. గతంలో ప్రభుత్వం 20 మైక్రాన్లలోపు ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించింది. మళ్లీ కొన్నాళ్ల తర్వాత 40 మైక్రాన్లలోపు సంచులను, గ్లాసులను వినియోగించరాదంటూ కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు జీవో ఎంఎస్‌ 158 జారీ చేసింది. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌ సహా తణుకు, భీమవరం,  తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిరోధించే బాధ్యతను ఆయా కమిషనర్లకు అప్పగించారు. అయితే ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా అమలవుతున్న దాఖలాల్లేవు. ప్లాస్టిక్‌ ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణాలపైనా అధికారులు దాడులు చేయడంలేదు. పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్‌ సంచులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. డ్రెయినేజీలు, మురుగునీటి కాలువలు, చెత్తకుండీలు ఇలా ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. వివిధ రకాల వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియగదారులు కూడా ఇళ్ల వద్ద నుంచి సంచులు తీసుకురాకుండా ప్లాస్టిక్‌ బ్యాగ్‌లపైనే ఆధారపడుతున్నారు. సాధారణంగా ప్లాస్టిక్‌ ఉత్పత్తులు మట్టిలో కలవడానికి వేల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవి విషవాయువుగా మారి ప్రజలకు క్యాన్సర్, ఆస్తమా, పిల్లల మెదడు మొద్దుబారి జ్ఞాపకశక్తి నశించడం వంటివి  జరుగుతాయని చెబుతున్నారు. ప్లాస్టిక్‌ కప్పుల ద్వారా టీ, కాఫీ వంటి వేడి పదార్థాలు తాగడం ద్వారా గొంతుకు సంబంధించిన క్యాన్సర్‌ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్లాస్టిక్‌ వ్యర్థాలను తింటున్న పశువులు మత్యువు బారిన పడుతున్నాయి.
జరిమానా ఇలా..
జిల్లాలో ఏలూరు సహా మిగిలిన పట్టణాలు, గ్రామాల్లో నిత్యం 500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. వీటిలో సుమారు 150 టన్నుల వరకు ప్లాస్టిక్‌ వస్తువులు, పాలిథిన్‌ కవర్లు, గ్లాసులు ఉంటున్నట్టు అంచనా. సాధారణంగా 40 మైక్రాన్లలోపు పాలిథిన్‌ కవర్లను విక్రయిస్తే మొదటిసారి కూడా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఆ మొత్తం చెల్లించి మళ్లీ విక్రయిస్తే సంబంధిత షాపును సీజ్‌ చేస్తారు. ప్లాస్టిక్‌ సంచులు, గ్లాసులు కొనుగోలు చేసిన వారి నుంచి రూ.200 నుంచి రూ.500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే జిల్లాలో రెండేళ్ల కాలంలో ఏలూరు సహా మిగిలిన పట్టణాల్లో కేవలం 110 మంది మాత్రమే కేసులు నమోదు చేశారు. వీటిలో కొవ్వూరులోనే 85 కేసులు నమోదు చేయగా నరసాపురం, భీమవరం, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో అసలు కేసులు నమోదు చేయలేదు. ఏలూరులో 10, తణుకు, పాలకొల్లులో 5  కేసులు చొప్పున, నిడదవోలులో 2 కేసులు నమోదు చేశారు. ఆయా మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్‌ వినియోగిస్తున్న, విక్రయిస్తున్న వారి నుంచి కేవలం రూ.1.70 లక్షలు మాత్రమే అపరాధ రుసుం విధించారు. 
 
ప్రణాళికలు చేస్తున్నాం 
పా్లస్టిక్‌ నియంత్రణకు సంబం«ధించి ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి. గతంలో కొన్ని మునిసిపాలిటీల్లో నిషేధం అమలు చేశాం. పటిష్ట ప్రణాళికలు చేసి అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాం. 
– సకలారెడ్డి, మునిసిపల్‌ ఆర్డీ, రాజమండ్రి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement