అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ ఫైబర్ అవశేషాలు మన శరీరాల్లోకి శ్వాసించే గాలి, తినే ఆహారం, తాగే నీటి ద్వారా కూడా చేరుతున్నట్లు తాజాగా బయటపడింది. ఈ మైక్రో ప్లాస్టిక్ ఫైబర్లు ధరణిపైనే కాకుండా సముద్రాల్లో కూడా వ్యాపించినట్లు ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. (కొలాయి) నల్లా నీటిలోనూ ప్లాస్టిక్ అవశేషాలు ఉంటున్నాయి. ప్రస్తుతం మన రోజువారీ జీవితంలో అన్నిరకాల అవసరాలకు ఒదిగిపోయేలా ప్లాస్టిక్ రూపాంతరం చెందింది.
వైద్య పరికరాలు మొదలుకుని విమానాల విడిభాగాల వరకు, మనం ధరించే బట్టలు ఇలా ఒకటేమిటి అన్ని వస్తువుల్లోనూ ప్లాస్టిక్ మిశ్రమమవుతోంది. తద్వారా ఉత్పన్నమవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, గాలి,నీరు, ఆహారంలో కలిసిపోవడం ఇప్పుడు పెను సవాల్‌గా మారింది. మానవాళి ఆరోగ్యం, చుట్టూ ఉండే పరిసరాలు, పశుపక్షాదులపై ప్లాస్టిక్ వ్యర్థాల దుష్ప్రభావం ఏ మేరకు పడుతుందనే దానిపై ఇంకా పూర్తిస్థాయిలో ప్రజల్లో అవగాహన ఏర్పడలేదు. సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు కనీసం 600 రకాల జీవజాతులపై ప్రభావం చూపుతున్నాయని అంచనా వేస్తున్నారు. చేపలు, రొయ్యల వంటి సముద్రపు ఆహార ఉత్పత్తుల వల్ల కూడా ప్లాస్టిక్ సూక్ష్మ రూపాల్లో మన శరీరాల్లోకి చేరుతోంది.
పంట పొలాల్లోకి కూడా...
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‌లో 9 శాతం వరకు రీసైకిల్ అవుతుం డగా, 12 శాతం వరకు భస్మం చేయగలుగు తున్నారు. మిగతాదంతా కూడా భూమి, సముద్రాలు, ఇతర సహజసిద్ధ వనరులను కలుషితం చేస్తోంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్లాస్టిక్‌లో చాలా వరకు పర్యావరణరహితంగా నాశనం కానిదే ఉంది. అలా వాడి పడేసిన ప్లాస్టిక్ పూర్తిగా నాశనం అయ్యేందుకు వందేళ్లు పట్టొచ్చు. కాల్చివేయడం తప్ప పూర్తిస్థాయిలో దీనిని నిర్మూలించే అవకాశం లేదు.
కాలిస్తే మళ్లీ విషవాయువులను పర్యావరణంలోకి విడుదల చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ అంతా ఏదో ఒక రూపంలో పర్యావరణంలోనే కొనసాగుతున్నట్లుగా భావిస్తున్నారు. ప్లాస్టిక్ అవశేషాలు పెద్ద మొత్తంలో వ్యర్థ జలాల శుద్ధీకరణ ప్లాంట్లలోకి చేరుకుంటున్నాయి. అయితే అక్కడి వడపోత యంత్రాలు ప్లాస్టిక్‌ను సగం వరకు మాత్రమే నియంత్రించగలుగు తున్నాయి.
మిగతాది సూక్ష్మ రేణువుల రూపంలో ఐరోపా, అమెరికాల్లోని పొలాల్లోకి చేరుకుంటోందని ‘ది జర్నల్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ పత్రికలో ప్రచురితమైన ఒక సర్వే తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం ఐరోపా వ్యవసాయ భూముల్లో 4.3 లక్షల టన్నులు, ఉత్తర అమెరికాలోని పొలాల్లో మూడు లక్షల టన్నుల వరకు ప్లాస్టిక్ అవశేషా లున్నట్లు స్పష్టమైంది. ఆహార పదార్థాల్లోకి కూడా చేరిన ప్లాస్టిక్ ముప్పును ఎదుర్కొనేం దుకు శాస్త్రజ్ఞులు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment