
తడ్కపల్లికి జ్వరం
మంచం పట్టిన పల్లె.. వణికిస్తున్న విషజ్వరాలు
ఆస్పత్రుల చుట్టూ జనం.. అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం
సిద్దిపేట రూరల్: వర్షాకాలం.. ఆపై పారిశుద్ధ్యం లోపించడంతో గ్రామీణ ప్రజలను వైరల్ ఫీవర్ వేధిస్తోంది. మురుగు కాల్వలు పొంగి పారుతుండటం.. చెత్తాచెదారం పేరుకుపోతుండటంతో దోమలు వృద్ధి చెంది జర్వాలు తీవ్రమవుతున్నాయి. సమాచారం ఉన్నా అధికారులు, పాలకవర్గం చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
సిద్దిపేట మండలంలోని తడ్కపల్లి గ్రామంలో నాలుగైదు రోజులుగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామానికి చెందిన కవిత, బాలయ్య, గొడుగు సత్తవ్వ, బండ్ల ఎల్లయ్య, బిడిలా లలిత, గడ్డం కనకవ్వ, ఎర్రోని ఎల్లయ్యతో పాటు పలువురు విషజ్వరాల బారినపడ్డారు. వీరంతా కొద్ది రోజులుగా గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్ద వైద్యం పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారు మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట ఆస్పత్రులకు వెళ్తున్నారు. విషజ్వరాలు ప్రబలడానికి పారిశుద్ధ్య లోపమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పడకేసిన పారిశుద్ధ్యం
పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో గ్రామంలోని వీధులు, మోరీలు చెత్తతో నిండిపోయాయి. దీంతో దోమలు వృద్ధి చెంది జ్వరాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది.
చర్యలు చేపడుతున్నాం
తడ్కపల్లిలో విషజ్వరాలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. మా సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురికి జ్వరాలు, మరికొందరికి వాంతులు, విరేచనాలు ఉన్నట్లు తెలిసింది. అవన్నీ సీజన్‌వ్యాధులే. మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పూర్తి పరిశీలన తర్వాతే వివరాలు వెల్లడిస్తాం. – శివానందం, క్లస్టర్ వైధ్యాధికారి సిద్దిపేట