సింగరప్పకు శఠగోపం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు నగరంలోని అళహ సింగరప్ప ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. సుమారు రూ.30 కోట్ల విలువైన భూములు పరుల చేతిలోకి వెళ్లిపోయాయి. వీటిని కాపాడుకునే విషయంలో అటు ప్రభుత్వం, ఇటు వంశపారంపర్య అర్చకులు చొరవ చూపకపోవడంతో అక్రమార్కులకు ఫలహారమయ్యాయి. భారతీయ సంస్కృ తి, వారసత్వ పరిరక్షణ సమితి చొరవ చూపినా వివాదం కోర్టులో ఉండటంతో జాప్యం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు పడమర వీధిలోని వన్నెంరెడ్డి వారి వీధిలో శ్రీ సింగరప్ప (లక్ష్మీ నరసింహస్వామి) క్షేత్రం ఉంది. ఇది నగరంలోనే అత్యంత ప్రాచీనమైంది. పురావస్తు శాఖ చెబుతున్న ప్రకారం.. దీనిని 10వ శతాబ్దంలో నిర్మించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కలిసి ఉన్న రోజుల్లో ఈ స్వామిని అళహ సింగరప్ప అని పిలిచేవారు. సింహాచలం, అంతర్వేది, మంగళగిరి, యాదగిరిగుట్ట, అహోబిలం క్షేత్రాల తరహాలో ఇక్కడి సింగరప్ప ఆలయంలోనూ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రాలన్నీ ఒకే కాలం నాటివని చెబుతుంటారు. వేంగి చాళుక్యులు, కాకతీయులు, గజపతులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు ఈ క్షేత్రాన్ని విశిష్టమైనదిగా భావించి సంరక్షణకు పూనుకున్నారు. ఇంతటి ప్రాశస్త్యం గల ఆలయానికి ఆస్తులు సైతం భారీగానే ఉండేవి. నగరంలోని ప్రస్తుత పంపుల చెరువు ఈ క్షేత్రానికి చెందినదే. ప్రజోపయోగార్థం 1915లో అప్పటి పురపాలక సంస్థ పాలకవర్గం దీనిని స్వాధీనం చేసుకుంది. ఇందుకు నష్టపరిహారంగా ఇచ్చిన సొమ్ముతో పెదపాడు మండలం తాళ్లగూడెంలో 47.10 ఎకరాల పంట భూమి కొనుగోలు చేశారు. ఆలయ నిర్వాహకులు దీనిపై వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తూ స్వామి సేవ చేస్తూ వచ్చారు. కాలక్రమంలో వారి వారసులు వేరే వ్యాపకాల్లో పడటంతో ఆలయాన్ని పట్టించుకోలేదు. తాళ్లగూడెంలో కొనుగోలు చేసిన 47.10 ఎకరాల్లో 30 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాం తంలో ఎకరం విలువ రూ.కోటిపైనే ఉంది. ఈ పరిస్థితుల్లో దేవాదాయ శాఖ ఆలయాన్ని, దానికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో నియమించిన ధర్మకర్తల మండలి భూముల అన్యాక్రాంతం విషయాన్ని అప్పటి దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు దృష్టికి తీసుకురావడంతో ఆయన విచారణకు ఆదేశించారు. పెదపాడు మండలంలో 47.1 ఎకరాల భూమితోపాటు ఆలయ చుట్టుపక్కల భూమి కూడా ఈ క్షేత్రానిదేనని తహసీల్దార్లు నివేదిక ఇచ్చారు. అయితే దేవాదాయ శాఖ ఈ భూమిని స్వాధీనం చేసుకునే దిశగా ఇంతవరకూ చర్యలు చేపట్టలేదు. ఈ పరిస్థితుల్లో ఆలయం జీర్ణ దశకు చేరుకుంది. కనీసం హుండీలో కానుకలను కూడా తీయని దుస్థితి ఉంది. ఆలయంలోని శేషశయన వాహనం అపహరణకు గురైంది. ఈ నేపథ్యంలో స్థానికులు ఆలయాన్ని, దాని ఆస్తులను కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు. ఆలయాన్ని శుభ్రం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ వస్తున్నారు. ఏటా కల్యాణం నిర్వహిస్తున్నారు. అయితే అర్చకులు ఈ ఆస్తులన్నీ తమ సొంతమంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై దేవాదాయ శాఖ రిట్ వేయడానికి గడువు కోరడంతో స్టేటస్ కో నడుస్తోంది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి స్వామివారికి చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను తిరిగి క్షేత్రానికి వచ్చేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.