దానం భూమి కనిపించదేం..
- అన్యాక్రాంతమైన ‘భూదాన’ భూమి
- 400 ఎకరాలపై స్పష్టత లేని పరిస్థితి
- దొరకని సర్వే నంబర్లు.. ఉన్నా కనిపించని భూములు
- గ్రామాల్లో అన్వేషిస్తున్న రెవెన్యూ అధికారులు
కొత్తగూడెం : దానం భూములు అన్యాక్రాంతమయ్యాయి.. ఎకరాలకెకరాల సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల్లో చెరిగిపోయాయి.. ఉన్న భూమి ఎక్కడుందో ఎవరికీ తెలియదు.. నిరుపేదలు, గిరిజనులు, దళితులు, కూలీలకు భూమి అందించి.. చేదోడు వాదోడుగా నిలవాలనే మంచి పనికి మచ్చపడింది.. భూములున్న రైతుల వద్ద నుంచి సేకరించిన దానం భూములు అగుపించకుండాపోయాయి. దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఆచార్య వినోభాబావే ఆశయం నీరుగారిపోయే పరిస్థితులు దాపురించాయి.. 448 ఎకరాల కమతానికి సంబంధించి సర్వే నంబర్లు దొరకని పరిస్థితి నెలకొంది.
ఆచార్య వినోభాబావే నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో 1953లో ప్రారంభించిన భూదానోద్యమానికి ఆకర్షితులై సుమారు 19 మంది కొత్తగూడెం తహసీల్ పరిధిలో 448 ఎకరాల వరకు భూదానం చేశారు. వాటికి సంబంధించిన వివరాలను భూదాన్ ట్రస్టులోనూ పొందుపరిచారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ భూములు ఇప్పుడు కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం భూదాన్ భూములను పట్టుకునే పనిలో నిమగ్నమైన రెవెన్యూ అధికారులకు.. ఉన్న రికార్డుల్లో అసలు ఆ సర్వే నంబర్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్నిచోట్ల సర్వే నంబర్లు ఉన్నా.. భూమి ఎక్కడుందనే విషయంపై స్పష్టత రావడం లేదు. 1950కి సంబంధించి రెవెన్యూ రికార్డులను పరిశీలించినప్పటికీ ఆ వివరాలు తెలియకపోవడంతో అధికారులు సైతం వాటిని వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది.
కొత్తగూడెం తాలూకాలో 448 ఎకరాలు
అప్పటి కొత్తగూడెం తాలూకా పరిధిలో ఆచార్య వినోభాబావే పర్యటన సందర్భంగా సుమారు 19 మంది వరకు 448 ఎకరాలను భూదాన్ ట్రస్ట్‌కు అందించారు. చుంచుపల్లి గ్రామంలో సర్వే నం.170, 171, 168, 169, 167, 434లో 17.30 ఎకరాలు, గార్ల సీతంపేటలో 1.20 ఎకరాలు, కారుకొండ సర్వే నం.264లో 40 ఎకరాలు, కొత్తగూడెం రెవెన్యూ గ్రామంలో సర్వే నం.63, 64, 727లో 77 ఎకరాలు, రాఘవాపురం సర్వే నం.26,28, 211, 212లో 50.05 ఎకరాలు దానం చేశారు. సీతంపేట సర్వే నం.2151లో 6.20 ఎకరాలు, సింగభూపాలెం సర్వే నం.19, 22లో 4.06 ఎకరాలు, సుజాతనగర్ సర్వే నం.233, 240లో 229.24 ఎకరాలు, రేగళ్లలో 75 ఎకరాలు భూదాన్ కార్యక్రమానికి అందించారు. వీటిలో సీతంపేట సర్వే నంబర్‌లో ఉన్న 6.20 ఎకరాల భూమిని మాత్రమే రెవెన్యూ అధికారులు గుర్తించారు. కారుకొండ రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ లభించినప్పటికీ.. భూమి ఎక్కడుందనే విషయమై స్పష్టత రాలేదు. మిగిలిన సర్వే నంబర్లు అసలు రికార్డుల్లో లేకపోవడం గమనార్హం.
గిరిజనులకు భూమి పంచినా..
కారుకొండ రెవెన్యూ గ్రామంలో భూదాన్ కార్యక్రమం, సీలింగ్ ద్వారా లభించిన అసైన్డ్ భూమిలో సుమారు 280 ఎకరాల మేర ఆదివాసీ గిరిజనులకు అందించారు. అప్పట్లో వీరికి కేవలం పట్టాలు అందించిన రెవెన్యూ అధికారులు.. గిరిజనులకు భూమిని చూపించకపోవడంతో ఇప్పటివరకు ఆ భూములు వారికి దక్కలేదు. అయితే ఆ భూమి భూదాన్ భూమా.. లేక సీలింగ్ భూమా.. అనే విషయంపై స్పష్టత దొరకలేదనేది సమాచారం. దీంతోపాటు ఈ సర్వే నంబర్‌లో అనేక బై నంబర్లు రావడం, కొందరు బడా బాబుల చేతుల్లోకి భూములు వెళ్లడంతో భూ సేకరణ రెవెన్యూ అధికారులకు కష్టతరంగా మారింది.
మహోద్యమం నీరుగారినట్లేనా..
భూమి లేని నిరుపేదలకు భూమిని పంచాలనే ఉద్దేశంతో ఆచార్య వినోభాబావే చేసిన భూదానోద్యమం దేశవ్యాప్తంగా విశిష్టతను సంతరించుకునప్పటికీ.. ఆ ఉద్యమం ద్వారా లభించిన భూములు మాత్రం ఇక్కడ దొరక్కపోవడం నివ్వెరపరుస్తోంది. సర్వే నంబర్లు లేకపోవడంతో ఆ భూములు దొరకని పరిస్థితి నెలకొంది. భూదానోద్యమం ద్వారా లభించిన భూములను అప్పట్లోనే గుర్తించి.. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వాటికి భద్రత ఉండేదని పలువురు చెబుతున్నారు. ఏదేమైనా మహోద్యమం మాత్రం నీరుగారాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై తహసీల్దార్ అశోక చక్రవర్తిని వివరణ కోరగా.. కాస్రా పహాణీలను పరిశీలించినప్పటికీ సర్వే నంబర్లు దొరకలేదని తెలిపారు. మరోమారు ఇతర రికార్డులను పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.