
ఆ బాబులకు సరే నాకేంటి?
ఇసుక.. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మొదలుకుని సామాన్య, మధ్యతరగతి వర్గాల్లోనూ పదే పదే చర్చకు వస్తున్న ప్రధాన అంశమది. మూడురోజుల కిందట ఏలూరు నగరానికి వచ్చినప్పుడు ఇసుక విధానంలో లోపాలున్నాయని చెప్పుకొచ్చిన సీఎం చంద్రబాబు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఇసుక అక్రమాలపై మాత్రం పెదవి విప్పలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన దరిమిలా 22 నెలలుగా గోదావరి తీరంలో ఎక్కడికక్కడ ఇసుక గుట్టలను మింగేసి రూ.కోట్లు వెనకేసుకున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు చివరకు కాలువలు, వాగుల్లోని ఇసుకనూ వదల్లేదు. న్యాయస్థానాలు మందలించినా లెక్కచేయలేదు. ఇప్పుడు తణుకుకు చెందిన ఓ ఇసుక మాఫియా నాయకుడు ప్రభుత్వ పెద్దలకు రూ.కోట్లు ముట్టజెప్పి ఎట్టకేలకు తనవద్దనున్న ఇసుక కొండలను కరిగించేందుకు అనుమతులు తెచ్చుకున్నాడు. అయితే మా లెక్క తేల్చిన తర్వాతే అమ్ముకోవాలంటూ ఓ టీడీపీ ప్రజాప్రతినిధి నిస్సిగ్గుగా మోకాలడ్డటం గోదావరి తీరంలో కలకలం రేపుతోంది.
ఇసుక వ్యాపారికి సిద్ధాంతం
తణుకుకు చెందిన బడా ఇసుక వ్యాపారికి సిద్ధాంతం, తణుకు, తీపర్రు, పెండ్యాల, పందలపర్రుల్లో సుమారు రూ.వంద కోట్ల విలువైన ఇసుక నిల్వలు ఉన్నాయి. జిల్లాలోనే ఇసుక మాఫియా నాయకుడిగా వ్యవహరిస్తున్న సదరు వ్యాపారి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి అక్షరాలా రూ.15 కోట్లు ‘పెట్టుబడి’ పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత రూ.5 కోట్లు మాత్రమే వెనక్కు ఇచ్చిన బడాబాబులు రూ.10 కోట్లను తమ వద్దే ఉంచేసుకున్నారని తెలుస్తోంది. నేరుగా ప్రభుత్వ పెద్దలతో ఉన్న ‘ఆర్థిక సంబంధాలు’ ఎప్పుడైనా పనికొస్తాయన్న ముందుచూపుతో సదరు వ్యాపారి కూడా ఆ సొమ్మును అలానే వదిలేశారని సమాచారం.
తాజాగా ఆయన బడాబాబులతో ఉన్న ఆర్థిక సంబంధాలనే ఉపయోగించి ఇసుక గుట్టలు అమ్ముకునేందుకు అనుమతులు తెచ్చుకున్నారు. తాను నిల్వ చేసిన మొత్తం ఇసుక గుట్టలను విక్రయించేవరకు బయటి వ్యక్తులకు ఇసుక టెండర్లు ఖరారు చేయకుండా ప్రభుత్వ పెద్దల నుంచి హామీ తీసుకున్నారని చెబుతున్నారు. ఇందుకోసం మళ్లీ పెద్దలకు రూ.కోట్లు ముట్టజెప్పారని తెలిసింది. అధికార యంత్రాంగం అడ్డంకులు సృష్టించకుండా వారికి కూడా రూ.2 కోట్లు అందించినట్టు చెబుతున్నారు. ‘అటు ప్రభుత్వ పెద్దలకు.. ఇటు అధికారులకు ఇచ్చేశాం.. ఇక అడ్డు లేకుండా ఇసుక విక్రయాలు చేసుకోవచ్చ’ని సదరు వ్యాపారి భావించారు.
5 యూనిట్ల ఇసుకను రూ.19 వేలు చొప్పున సరఫరా చేసేందుకు సన్నాహాలు చేశారు. సరిగ్గా అదే సమయంలో టీడీపీ ప్రజాప్రతినిధి రంగప్రవేశం చేశారు. గుట్టకు రూ.కోట్లు లేదా గంపగుత్తుగా రూ.7 కోట్లు ఇస్తే గానీ విక్రయించడానికి వీల్లేదని అడ్డుపడ్డాడు. ‘అదేంటి బడాబాబులకు ఇచ్చిన తర్వాత మళ్లీ మీకేంటని’ సదరు వ్యాపారి నిలదీస్తే ‘వాళ్ల వాటా వాళ్లదే. నా వాటా నాదే. నాకు ఇచ్చిన తర్వాతే నువ్వు అమ్ముకోవాల’ని తెగేసి చెప్పాడట.
బేరమాడినా తగ్గలేదు
‘అటు బడా బాబులకు, ఇటు అధికారులకు ఇచ్చాను. మళ్లీ మీకు రూ.కోట్లు నేను ఇవ్వలేను. ఎంతో కొంత ఇస్తాను. సర్ధుకోండి’ అని వ్యాపారి బేరమాడినా సదరు ప్రజాప్రతినిధి మాత్రం వెనక్కి తగ్గలేదని అంటున్నారు. ఈ విషయమై ఇరువురు లారీ డ్రైవర్లు, కూలీల సమక్షంలో వాదులాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. చర్చలు చివరికి రచ్చగా మారినా వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ఇసుక విక్రయాలు నిలిచిపోయాయి. టీడీపీ నేతలు రంగప్రవేశం చేయడంతో రెండురోజుల నుంచి దఫదఫాలుగా ఇరువర్గాల మధ్య మళ్లీ చర్చలు సా..గుతున్నట్టు తెలుస్తోంది. ఇసుక కొరతతో భవననిర్మాణ రంగంతోపాటు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయి అల్లాడిపోతుంటే టీడీపీ నేతలు తమ వాటా కోసం ఇలా బజారున పడటం ఏవగింపు కలిగిస్తోంది.