
టోకెన్ ఉంటే ఓకే
►ఇసుక అక్రమ రవాణాకు వరం
►టోకెన్ల ముసుగులో రాత్రివేళ భారీగా తరలింపు
►కొన్ని చోట్ల బాహటంగానే రవాణా
రాంబిల్లి(యలమంచిలి): ఇసుక టోకెన్ల రూపంలో కనక వర్షం కురిపిస్తోంది. దీంతో అక్రమార్కులు రంగంలోకి దిగి యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. రజాల, పెదకలవలాపల్లి సమీపంలో శారద నది నుంచి భారీ స్థాయిలో అక్రమంగా తరలిస్తున్నారు. టోకెన్ల ముసుగులో కొన్ని లోడ్లు తరలిస్తుండగా, ఎలాంటి అనుమతులు లేకుండా మరికొన్ని లోడ్లు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. రజాల వద్ద రాత్రి వేళలో యంత్రాలతో తవ్వి ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ట్రాక్టరు లోడ్ ఇసుకను రూ.3వేలకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
రూ.3 లక్షల ఇసుక నిల్వలు
పెదకలవలాపల్లి సమీపంలో సుమారు రూ. 3 లక్షల విలువ చేసే ఇసుక నిల్వలు పలుచోట్ల దర్శనమిస్తున్నాయి. రోజూ సుమారు రూ.2 లక్షల విలువైన ఇసుకను తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రజాల గ్రామానికి చెందిన కొందరు అధికారులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించకపోవడం విశేషం. పది రోజుల నుంచి ఈ దందా కొనసాగుతోంది. తహసీల్దార్ మహేశ్వరరావు ప్రభుత్వ నిర్మాణాల నిమిత్తం కొంత మందికి టోకెన్లు ఇచ్చారు. ఎంతమందికి ఏ ప్రాతిపదికన ఎన్ని టోకెన్లు ఇచ్చారో తెలియడం లేదు. తహసీల్దార్ ఎమ్మెల్సీ ఓట్లు కౌంటింగ్ వి«ధుల్లో విశాఖపట్నంలో ఉన్నారు. మరో పక్క ఈ టోకెన్లు కలెక్షన్ చేయకపోవడంతో అవే టోకెన్లతో పలుమార్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
తవ్వకాలతో చొచ్చుకొస్తున్న సముద్రం నీరు
రజాల వద్ద ఇసుక అక్రమ తవ్వకాలతో సముద్రం నీరు వై.లోవ, రజాల, కొత్తూరు వద్ద ఉన్న ఏడుమూళ్ల ఆనకట్ట వరకూ చొచ్చుకొస్తుంది. దీంతో పొలాల్లో ఉప్పునీరు చేరడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నేల చౌడుగా మారుతుందని కలవరపడుతున్నారు. మరోపక్క నదిలో ఉప్పునీరు వస్తుండటంతో పశువులు ఆ నీరు తాగడం లేదని, వాటికి నీరు అందజేసేందుకు
పడరాని పాట్లు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.