కష్టాలు పుష్కలం
కష్టాలు పుష్కలం
Published Tue, Aug 16 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
వారం రోజులైనా అందని వేతనాలు
నిధులు రాలేదని చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
సాక్షి, అమరావతి :
వారంతా దినసరి కూలీలు. పుష్కరాల్లో గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు 20వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఈనెల 9న వచ్చారు. వారం రోజులైనా ఒక్క రూపాయి అందలేదు. చేతి ఖర్చులకని తీసుకువచ్చిన డబ్బులు అయిపోయాయి. టీ తాగేందుకు కూడా చిల్లర లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
150 పుష్కరఘాట్లలో విధులు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 150 పుష్కర ఘాట్లలో సుమారు 20 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది దినసరి వేతనంపై పనిచేస్తున్నారు. రోజుకు 8 గంటలపాటు మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. చెత్త ఊడ్చడం, ఎత్తివేయడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన చోట దుస్తులు మార్చుకునే గదుల్లో, పిండ ప్రదానం షెడ్లలో వేసిన చెత్తను తొలగిస్తున్నారు. అలాగే రహదారులు శుభ్రం చేయడంతోపాటు రాత్రి వేళల్లో దోమల ఫాగింగ్ చేస్తున్నారు. ఇన్ని విధాలా కష్టపడుతున్నా కనీస వేతనం వారికి ఇవ్వడం లేదు.
వేతనాల్లోనూ కక్కుర్తి !
ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.400 వంతున రోజువారి వేతనంతో పాటు వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి ఐదురోజులకు ఒకసారి వేతనాలు చెల్లించాల్సిఉన్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. రూ. 400కు బదులుగా రూ.250 నుంచి రూ.300 వంతున వేతనం ఇస్తామని ముందే ఒప్పించారు. ప్రభుత్వం ఇచ్చే వేతనంలో కూడా కాంట్రాక్టర్లు కోత పెడుతూ వారి పొట్ట కొడుతున్నారు.
నిధులు ఇవ్వని ప్రభుత్వం
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఖజానా ఖాళీగా వుంది. పుష్కరాల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసం ప్రభుత్వం రూ.184 కోట్లు మంజూరు చేసింది. కానీ నిధులు మంజూరు జీవో కాపీ ఇచ్చారు కానీ నిధులు మంజూరు చేయలేదు. దీంతో మున్సిపల్ శాఖ ఖజానాలో నిధులు లేవు. 14 వ ఆర్థిక సంఘం నిధులైనా ఖర్చు చేసుకోవాలని ఆదేశాలిచ్చినా ఆ నిధులు ఇప్పటికీ ఖజానాలో జమ కాలేదు. దీంతో కాంట్రాక్టర్లకు నిధులు అందించలేక చతికిలపడింది.
Advertisement
Advertisement