చదివింది 10వ తరగతి మాత్రమే. పదహారేళ్లకే పెళ్లి.. ముగ్గురు పిల్లలకు తల్లి. వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ కూడా కాదు.కానీ ఏదో సాధించాలనే కోరిక, తపన ఆమెను ఉన్నత స్థితిలో నిలబెట్టింది.
ఆమె మరెవ్వరో కాదు అక్షయ్ కుమార్ నటించిన 'ప్యాడ్ మ్యాన్' చిత్రానికి స్ఫూర్తిగా నిలిచిన సరస్వతి. 'ప్యాడ్ ఉమెన్' గా పేరు తెచ్చుకుంది. 'లఖ్పతి దీదీ'లలో ఒకరిగా గుర్తింపు పొందారు. చేయూత నిస్తే అట్టడుగు స్థాయి సాధికారత సాధించగలరు అనడానికి నిదర్శనంగా మారింది.
తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్‌ల తయారీ యంత్రాన్ని కనుగొన్న తమిళనాడుకు చెందిన సామాజిక వ్యవస్థాపకుడు అరుణాచలం మురుగనాథంలా అవతరించి నలుగురికి స్ఫూర్తినిస్తోంది.
16 ఏళ్ల వయసులోనే ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలోని బాద్‌పురా గ్రామంలోకి ఒక పేద కుటుంబంలోకి కోడలిగా వెళ్లింది సరస్వతి భాటి. ఇది చాలా వెనుబడిన గ్రామం. భర్త మోను భాటి ఎలక్ట్రీషియన్. ముగ్గురు పిల్లల పెంపకంలో మునిగిపోతూనే, చుట్టుపక్కల గ్రామాల్లోని చాలా విషయాలను గమనించేది ముఖ్యంగామహిళలు శానిటరీ న్యాప్‌కిన్‌లు దొరకడం చాలా కష్టం. అస్సలు ఋతుస్రావం గురించి ప్రజలు బహిరంగంగా మాట్లాడటమే ఉండదు. ఈ పరిస్థితే ఆమెను ఆలోచించజేసింది.
చిన్నప్పటినుంచి చదువుకోవడం అంటే సరస్వతికి చాలా ఇష్టం. హర్యానాలోని గ్రామాల్లో మాదిరిగానే, ఆమెపుట్టిన గ్రామంలో కూడా బాలికల విద్యకు పెద్దగా ప్రాముఖ్యతలేదు. ఈ నేపథ్యంలోనే చిన్నవయసులోనే పెళ్లీ, పిల్లలు. సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఏదైనా సాధించాలని ఆశ పడింది. 2019లో స్వయం సహాయక బృందంలో చేరాలనుకుంటే దీనికి భర్త ఒప్పుకోలేదు. ‘నేను సంపాదిస్తున్నాగా..నీకెందుకు ఇవన్నీ’ అన్నాడు. కానీ ఏదైనా చేయాలనుకుంటే.. ధైర్యంగా ముందుకు పోవాలి అన్న అమ్మమ్మ మాటలు ఆమెకు ధైర్యాన్నిచ్చాయి. మొత్తానికి 2020లో, ఆమె గ్రామంలోని సూర్యోదయ స్వయం సహాయక సంఘంలో చేరింది. ఈ అడుగే ఆమె జీవితం మలుపు తిప్పింది. .మహిళలు, బ్యాంకింగ్, ఆర్థిక స్థిరత్వం, పెట్టబడులు, వ్యాపార మెళకువలు గురించి తెలుసుకుంది.
ఇంతలో లాక్‌డౌన్ వచ్చింది. దూకాణాలు బంద్. ఎక్కడా కూరగాయలు దొరకలేదు. ఆసమయంలో ఊరగాయలు తయారు చేసి విక్రయిస్తే బావుంటుంది కదా ఆలోచించింది. మరో పదిమంది మహిళలతో కలిసి, వెల్లుల్లి, అల్లం, మామిడి లాంటి పచ్చళ్ల తయారీని మొదలు పెట్టింది. మహిళలతో సమీపంలోని గ్రామాల్లో ప్రచారం చేసుకుంది. తొందర్లనే ఆర్డర్లు రావడం మొదలైనాయి. ఇక్కడితో ఆగిపోలేదు.
ఇది ఇలా సాగుతుండగానే 2021లో సరస్వతి గ్రామంలో ఒక సౌందర్య సాధనాల దుకాణాన్ని ప్రారంభించింది. బ్రాండెడ్ శానిటరీ న్యాప్‌కిన్‌లను చాలా తక్కువ మంది మహిళలు కొనుగోలు చేస్తున్నారని గమనించింది. ఇవి ఖరీదైనవి కాబట్టి చాలా మంది మహిళలు ఇంట్లో వస్త్రాన్ని వాడతారని, శుభత్ర పాటించకపోవండం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని, వీటి వల్ల ఇబ్బందులకు కూడా తెలుసుకుంది. దీంతో సరసమైన ధరలో, ఆరోగ్యకరమైన శానిటరీ నాప్కిన్లను తానే ఎందుకు తయారు చేయకూడదని ఆలోచించింది. ఈ ఆలోచనను వాస్తవంగా మార్చుకోవాలనే దృఢ సంకల్పంతో, ఈ దుకాణాన్ని మూసివేసి, తన కొత్త వెంచర్ పై దృష్టి పెట్టింది. ఈ ఆలోచనకు భర్త పూర్తి మద్దతు ఇవ్వడం విశేషం.
మొదట్లోవాటిని కొనుగోలు చేయడానికి మహిళలు ముందుకు వచ్చేవారు. సవాలక్ష సందేహాల కారణంగా, వీరికి ఆదరణ లభించలేదు. అయితే సరస్వతి స్వయం సహాయక బృందం సభ్యులతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేది. ఎట్టకేలకు ఆమె ప్రయత్నం ఫలించింది. పైగాఇవి ధర తక్కువ, సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉండటం, రాషెస్ సమస్యకూడా ఉండకపోవడంతో గిరాకీ పెరిగింది. బయటి మార్కెట్లో చిన్న ప్యాకెట్ ధర 45 రూపాయలు ఉండగా.. సరస్వతి ఆధ్వర్యంలో తయారుచేస్తున్న ప్యాకెట్ ధర 28 రూపాయలు మాత్రమే ఉండడం విశేషం. గత రెండేళ్లుగా శానిటరీ న్యాప్‌కిన్‌ల అమ్మకం నెలకు రూ. 30 వేలకి చేరుకుంది.
"ప్రతి ప్యాడ్ మాకు రూ. 2 ఖర్చవుతుంది, ప్యాకేజింగ్ తర్వాత, ధర రూ. 2.5. మేము ఏడు ప్యాడ్ల ప్రతి ప్యాక్‌ను రూ. 40కి అమ్ముతాము, అయితే జెల్ ఆధారిత ప్యాడ్‌లు రూ. 60కి అమ్ముతాము. మా ఉత్పత్తులను మార్కెట్ చేయడంలో సహాయపడిన, మాకు మరిన్ని ఆర్డర్‌లను తీసుకువచ్చిన NGOలతో కూడా కనెక్ట్ అయ్యాము. రాష్ట్రంలోని ఏడు నగరాలు, పంజాబ్‌లోని రెండు నగరాల నుండి కూడా ఆర్డర్‌లు వస్తాయి‘’ అని ఆమె గర్వంగా చెబుతుంది సరస్వతి.
ఇక పచ్చళ్ల బిజినెస్ దగ్గరికి వస్తే ప్రతి నెలా, మేము కనీసం 300- 500 కిలోల ఊరగాయల ఆర్డర్లు వస్తాయి. ఇలా ఊరగాయలు ,ప్యాడ్ల అమ్మకం ద్వారా ఆమె వార్షిక టర్నోవర్ ఇప్పుడు రూ. 7 లక్షలు దాటింది. తన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మాలనే లక్ష్యంతో ఉంది. దీనికోసం జీఎస్‌టీ నెంబరు, ప్యాకేజీని మరింత మెరుగుపర్చుకోని, మరిన్ని నగరాలకు తన ప్యాడ్స్ చేరేలా ముందుకు సాగుతోంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఆమెలోని ప్రతిభకు పట్టుదలకు గుర్తింపు లభిచింది. "గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైంది. దీంతో లక్నోలో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ ఆమెను సత్కరించారు. సరస్వతి తన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా, తన సమాజంలోని అనేక మందికి స్ఫూర్తినిస్తోందని జిల్లా అభివృద్ధి అధికారి శివ్ ప్రతాప్ రమేష్ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment