పారిశుద్ధ్య పట్నం
♦ 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం
♦ ప్రతి ఇంటికీ రెండు ఎల్‌ఈడీ బల్బులు
♦ వందరోజుల ప్రణాళికను ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ఎంపిక చేసిన పట్టణాలను బహిర్భూమి రహితం(ఓడీఎఫ్)గా మార్చాలనే సంకల్పంతో వంద రోజుల ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేసింది.. ఈ ప్రణాళికను అమలు చేసిన మున్సిపాలిటీలకు ప్రోత్సాహక నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు 100 శాతం మరుగుదొడ్లను నిర్మించుకునేలా ప్రజలను చైతన్యపరచాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం జిల్లా కలెక్టర్లతో జరిపిన వీడియోకాన్ఫరెన్స్‌లో మార్గదర్శకాలను జారీచేశారు. బహిరంగ మలవిసర్జన ప్రాంతాలను గుర్తించాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు, బహిరంగ ప్రదే శాల్లో టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేయాలని నిర్దేశించారు.
ప్రతి ఇంటికి రెండు ఎల్‌ఈడీ బల్బులు
మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి రెండు ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేయనుంది. విద్యుత్‌ను ఆదా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం సంప్రదాయ బల్బుల వాడకానికి మంగళం పాడాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే రూ.20కే రెండు తొమ్మిది వాట్ల సామర్థ్యం గల ఎల్‌ఈడీలను అందించేందుకు ప్రతిపాదనలు తయారుచేస్తోంది. వీటిని డిస్కమ్‌ల ద్వారా మున్సిపాలిటీల్లోనే గాకుండా గ్రామ పంచాయతీల్లోనూ పంపిణీ చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు న్యూఢిల్లీకి చెందిన ఈఈఎస్‌ఎల్ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. అలాగే మున్సిపాలిటీల్లో అత్యవసర సేవలకు విఘాతం కలుగకుండా మూడో విద్యుత్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తకుండా 24 గంటలపాటు అత్యవసర సేవలందించే సంస్థలకు ప్రత్యేక లైన్ ద్వారా పంపిణీ చేయాలని యోచిస్తోంది.
వందశాతం పన్నుల వసూలు
స్థానిక సంస్థల్లో పన్నుల వ సూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ బకాయిలు, ఆస్తిపన్నును వంద శాతం వసూలు చేసే స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాలు అందజేసే అంశాన్ని పరిశీలిస్తోంది. కొత్తగా ఏర్పాటైన ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కూడా రూ.2 కోట్ల మేర బకాయి పడింది. వీటన్నింటిని రాబట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనుంది. ఇదిలావుండగా, బడంగ్‌పేట, వికారాబాద్ మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు/ ఘన వ్యర్థాల నిర్వహణకు స్వచ్ఛభారత్ మిషన్ కింద నిధులు కేటాయించేందుకు పురపాలక శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి అనుగుణంగా డంపింగ్‌యార్డులకు స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది.