పారిశుద్ధ్య పనులకు మంగళం
-
నాలుగు నెలలుగా విడుదల కాని గౌరవ వేతనం
-
రూ.2.22 కోట్ల బకాయి
-
జిల్లాలో 2.520 పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు
రాయవరం :
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టాలని విద్యాశాఖ భావించింది. విద్యాశాఖలో భాగమైన సర్వశిక్షాభియాన్ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు నిధులను మంజూరు చేస్తుంది. గ్రామాణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న మహిళా శక్తి సంఘాలకు ఈ బాధ్యతలను అప్పగించారు. గ్రామ సంఘాలు నియమించిన వ్యక్తులు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపడుతున్నారు. వీరికి ఇస్తున్న అరకొర గౌరవ వేతన నాలుగు నెలలుగా నిలిచి పోయింది. అసలు ఈ నిధులు విడుదల అవుతాయా? లేదా? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 3,301 ప్రాథమిక పాఠశాలలు, 414 ప్రాథమికోన్నత పాఠశాలలు, 659 ఉన్నత పాఠశాలలున్నాయి. అయితే 2,110 ప్రాథమిక, 214 ప్రాథమికోన్నత, 202 ఉన్నత పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అనుమతి వచ్చింది. ఈ పాఠశాలల మరుగుదొడ్ల పారిశుద్ధ్య నిర్వహణకు డ్వాక్రా మíß ళలను నియమించారు. ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్యం నిర్వహించే వారికి నెలకు రూ.2 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకైతే రూ.2,500, ఉన్నత పాఠశాలలో నిర్వహించే వారికి రూ.4 వేలు గౌరవ వేతనంగా నిర్ణయించారు. వీరి గౌరవ వేతనం నుంచి ప్రాథమిక పాఠశాలకు ఫినాయిల్, హార్పిక్, బ్లీచింగ్, చీపుర్లు కింద రూ.200 తగ్గిస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.300, ఉన్నత పాఠశాలకు రూ.500 చొప్పున తగ్గించి ఆ సొమ్ముతో పాఠశాల పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు.
2014 నుంచి పారిశుద్ధ్య నిర్వహణ..
పాఠశాలల్లో విద్యార్థులకు నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణను ఎస్‌ఎస్‌ఏ 2014 నవంబరు నుంచి చేపడుతుంది. అప్పట్లో ఆరు నెలలకు ఎస్‌ఎస్‌ఏ నేరుగా నిధులను పాఠశాల ఎస్‌ఎంసీ అకౌంట్లకు బదిలీ చేసింది. గతేడాది నవంబరు 20 నుంచి పారిశుద్ధ్యం నిర్వహణ బాధ్యతలను డీఆర్‌డీఏ ద్వారా డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు గౌరవ వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు. మార్చి నుంచి ఆగస్టు వరకు నాలుగు నెలలకు రావాల్సిన గౌరవ వేతనం విడుదల కాలేదు. జిల్లాలో వీరి గౌరవ వేతనం కింద రూ.రెండు కోట్ల 22 లక్షల 52 వేలు విడుదల కావాల్సి ఉంది.
అదిగో ఇదిగో అంటున్నారు..
జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేసే పని చేస్తున్నాను. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. అడిగితే అదిగో ఇదిగో అంటున్నారు.
– గుబ్బల వీరయ్యమ్మ,
వెదురుపాక, రాయవరం మండలం
నిధులు మంజూరు కావాల్సి ఉంది..
పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ చేస్తున్న వారికి గౌరవ వేతనం నిధులు విడుదల కావాల్సి ఉంది. ఫిబ్రవరి వరకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి.
– మల్లిబాబు,
ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్‌డీఏ, కాకినాడ