అగ్నిప్రమాదం.. అనుమానం!
వరంగల్: కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్, అయోన్, శ్రీయోన్ ల మృతిపై సారిక కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాము వచ్చేంతవరకు మృతదేహాలను కదిలించవద్దని పోలీసులను అభ్యర్థించినట్లు సమాచారం. ప్రస్తుతం అగ్నిప్రమాదంగా భావిస్తున్న ఈ సంఘటనలో.. ఇంటి మొదటి అంతస్తులోగల బెడ్రూమ్లో ఉన్న నలుగురూ మరణించారు. దీనిపై పలుకోణాల్లో దర్యాప్తుచేసేందుకు పోలీసులు సంసిద్ధులయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
రాజయ్య కుమారుడు అనిల్ తో సారిక వివాహం 2006లో జరిగింది. వీరిది ప్రేమ వివాహమని తెలిసింది. ఈ దంపతులు కొంతకాలం విదేశాల్లోనూ నివసించారు. రాజయ్య ఎంపీగా కొసాగిన సమయంలో, అనిల్.. యూత్ కాంగ్రెస్ లో క్రియాశీల పాత్ర పోశించారు. ఈ క్రమంలోనే ఆయనకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలిసింది.
తనను, పిల్లలను పట్టించుకోవడంలేదని సారిక.. కొద్ది నెలల కిందట భర్త అనిల్ పై పోలీసులకు ఫిర్యాదుచేసింది. అత్తమామలైన రాజయ్య, ఆయన భార్య కూడా తనను వేదిస్తున్నట్లు సారిక ఫిర్యాదులో పేర్కొంది. కోడలు వేధింపుల కేసు పెట్టడంతో రాజయ్యపై అనేక విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా, కొద్ది రోజులుగా భార్యభర్తలు ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఇంతలోనే బుధవారం సారిక, ముగ్గురు పిల్లలు అనుమానాస్పదరీతిలో అగ్నికి ఆహుతయ్యారు. ఈ సంఘటన జరిగినప్పుడు రాజయ్య, అనిల్ లు ఇంట్లోనే ఉన్నారు.
క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నందున అగ్నిప్రమాదం జరిగిన మొదటి అంతస్తులోకి పోలీసులు మీడియాను అనుమతించడంలేదు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీద్ బాబు స్వయంగా సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాజయ్య కోడలు, మనవళ్ల మృతితో వారు నివసిస్తున్న ప్రాంతంలో తీవ్రవిషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ నెలలో జరగనున్న వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల్లో రాజయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పటీచేస్తుండటం తెలిసిందే. ఈరోజు ఆయన రెండో సెట్ నామినేషన్ దాఖలుచేయాల్సిఉంది. కోడలు, మనవళ్ల మృతితో మనస్థాపానికి గురైన రాజయ్య ఇంటి వరండాలో కూలబడిపోయి రోదిస్తున్న దృశ్యాలు కనిపించాయి.