
ప్రేమతో మొదలు.. విషాదంతో ముగింపు
బీటెక్‌లో అనిల్‌తో పరిచయం
2002లో కులాంతర వివాహం
మూడేళ్ల పాటు లండన్‌లో ఉద్యోగం చేసిన సారిక
హన్మకొండ : ఇంజనీరింగ్ కాలేజీలో అనిల్, సారిక మధ్య మొదలైన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. పెద్దలను ఎదరించి పెళ్లి చేసుకున ఈ జంట చివరికి వివాదాలతో సావాసం చేశారు. ఆఖరికి ఉన్నత విద్యావంతురాలైన సారిక ప్రేమ పెళ్లి విషాదంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరి గ్రామానికి చెందిన శ్రీనివాసాచారి, లలిత దంపతుల రెండో కూతురు సారిక హుజురాబాద్‌లోని కమల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 1998వ సంవత్సరంలో ఇంజనీరింగ్‌లో చేరారు.
అదే కాలేజీలో చదువుతున్న మాజీ ఎంపీ రాజయ్య, మాధవి కుమారుడు అనిల్ పరిచమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఎదిరించి 2002 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2006 నుంచి 2009 వరకు మూడేళ్లపాటు లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసింది. వీరికి అభినవ్ (7)తో పాటు కవలపిల్లలు శ్రీయాన్(3), అయాన్(3) సంతానం. సారిక రెండో సారి గర్భిణీగా ఉన్న సమయంలో అనిల్ మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అనిల్ వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో సారిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ముగ్గురు చంటి పిల్లలతో రాజయ్య ఇంటి ముందు ధర్నా చేసింది. న్యాయస్థానం, పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అయితే రాజయ్యకు ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా సరైన న్యాయం జరగట్లేదని సారిక ఆవేదన చెందేది. ఆఖరికి ఇంటి ఖర్చులకు సైతం డబ్బులు సమకూర్చకపోవడంతో ఇబ్బందులు పడేది. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజయ్యను పోటీలో నిలపొద్దంటూ ఏఐసీసీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు సారిక ఈ మెయిల్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీని విషయమై కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలోనే రాజయ్య ఇంట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సారిక, ఆమె ముగ్గురు కుమారులు మరణించారు.