‘శతమానం భవతి’ బృందం సందడి
– విజయోత్సవ సభకు హాజరైన హీరో, హీరోహిన్
కర్నూలు సీక్యాంప్: శతమానం భవతి చిత్ర బృందం గురువారం నగరంలో సందడి చేశారు. భరత్ థియేటర్‌లో సినిమా విజయోత్సవ సభ నిర్వహించారు. సినిమా ఎలా ఉందో ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ తెలుగింటి సంప్రదాయాలతో వచ్చిన శతమానం భవతి చిత్రం మంచి విజయం సాధించిందన్నారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులు తప్పకుండా సినిమాలు చూస్తారని తెలుగు సంస్కృతి ఉట్టిపడే శతమానం భవతి లాంటి సినిమాలు తీయడం మంచి పరిణామమన్నారు. చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ సంక్రాంతి బరిలో రెండు పెద్ద చిత్రాలు పోటీపడుతున్న తరుణంలో తాము నిర్మించిన చిన్న చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. మంచి చిత్రాలు తీస్తే చిన్న, పెద్ద తేడ లేకుండా అభిమానులు అదరిస్తారని ఈ చిత్రంతో రుజువైందన్నారు. హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను నటించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నటీనటులు రచ్చరవి, నగరానికి చెందిన రామానాయుడు, సురేష్, లక్ష్మీనారాయణ, ఎస్‌ఎమ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.