బాస్.. సంతృప్తిగా ఉంది
బాస్.. సంతృప్తిగా ఉంది
Published Sun, Jul 31 2016 2:03 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
- డీఆర్వో హేమసాగర్
- నేడు ఉద్యోగ విరమణ
అనంతపురం అర్బన్: ‘‘బాస్... ఈ జిల్లాలో పనిచేయడం చాలా సంతృప్తిగా ఉంది...’’ అని డీఆర్‌ఓ పి.హెచ్.హేమసాగర్ అన్నారు. మూడేళ్లపాటు ఇక్కడ డీఆర్‌ఓగా విధులు నిర్వర్తించిన ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ప్రతి ఒక్కరినీ చెప్పండి ‘బాస్’ అంటూ నవ్వుతూ పలకరించడం ఆయన నైజం. ఉద్యోగ విమరణ చేస్తున్న సందర్భంగా సాక్షితో ఆయన మాట్లాడారు. ‘‘మాది కర్నూలు జిల్లా. 1984–85లో ఉద్యోగంలో చేరాను. 2002లో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. కడపలో మూడున్నర సంవత్సరాల పాటు సంక్షేమ కార్పొరేషన్ల జనరల్ మేనేజర్‌గా పనిచేశాను. ఆ తరువాత హైదరాబాద్‌లో ఆరు నెలలు పనిచేశాను. కర్నూలు జిల్లాలో డీఆర్‌ఓగా పనిచేశాను. 2013 జూన్ 3న జిల్లాలో డీఆర్‌ఓగా బాధ్యతలు స్వీకరించాను. అనంతపురం జిల్లాలో పనిచేయడం, మూడేళ్లపాటు ఇక్కడి ప్రజలకు సేవ అందించడంలో ఎంతో సంతోషం, సంతృప్తిని ఇచ్చింది.’’ అన్నారు. ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలకు సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వేత్తున ఎగిసింది. ఆ క్రమంలో ఉద్యోగ వర్గాలకు ఆయన ప్రాతినిథ్యం వహించి ఉద్యమాన్ని ముందుకు నడిపారు.
నేడు సన్మాన సభ
డీఆర్‌ఓ పీహెచ్ హేమసాగర్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనకు ఉద్యోగులు సన్మాన సభ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, ఇతర శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.
Advertisement