సత్యాగ్రహం
బీసీలను రెచ్చగొడుతున్న బాబు
- హామీని అమలు చేయకుండా ఎదురు దాడి
- కాపుల నిరసనలపై ఉక్కుపాదం
- ఊపిరున్నంత వరకు పోరాటం
- మార్చి 26న న్యాయవాదులతో సమీక్ష
- కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
కర్నూలు(అర్బన్): కాపులకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం చంద్రబాబు..బీసీలను రెచ్చగొడుతున్నారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలనే డిమాండ్‌తో కర్నూలు నగరంలోని మెగాసిరి ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం చేపట్టిన సత్యాగ్రహ దీక్షలకు ఆయన హాజరయ్యారు. ముందుగా నగరంలోని శ్రీ కృష్ణదేవరాయలు, దామోదరం సంజీవయ్య విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం దీక్షా వేదిక నుంచి మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాపులను బీసీ జాబితాలో చేర్చే విషయంలో చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
హామీని అమలు చేయకుండా.. కాపులు నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించే ప్రాంతాల్లో సెక‌్షన్ 30, 144 అమలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీ జాబితాలో ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను ఓసీ జాబితాలో చేర్చేందుకు భారత రాజ్యంగ నిర్మాత డా.బీఆర్ అడ్డుకున్నారన్నారు. అయితే రాజకీయ పరిణామాల్లో ఓసీలుగా మారిన ఆయా కులాలను దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య తిరిగి బీసీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. కృతజ్ఞతగా...అంబేద్కర్, దామోదరం సంజీవయ్య జయంతి, వర్ధంతుల్లో పాల్గొనాలని కోరారు. తాము కొత్తగా బీసీ రిజర్వేషన్లు కోరడం లేదని, గతంలో ఉన్నవి తిరిగి పునరుద్ధరించాలని అడుతున్నామన్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి.. 9వ షెడ్యూల్‌లో చేర్చి.. కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధం..
ఎంతో సున్నితమైన మనసు ఉన్న తనను ఉద్యమకారుడిగా మార్చింది చంద్రబాబే అని ముద్రగడ అన్నారు. జాతి శ్రేయస్సు కోసం జరుగుతున్న పోరాటంలో చావోరేవో తేల్చుకుంటామని ఉద్విగ్నంగా చెప్పారు. రాజకీయాలకు, గ్రూపులకు అతీతంగా ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గొనాలని, ముఖ్యంగా మహిళలు కూడా ఉద్యమ పథాన ముందుండాలన్నారు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టమంటే.. ప్రభుత్వం కేసులను పెడుతోందని విమర్శించారు. ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్న ఏ,బీ,సీ,డీల్లో కాకుండా క్రిమిలేయర్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కేవలం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన సరిపోదని, ఇచ్చిన హామీ మేరకు ఏడాది రూ.1000 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేయాలన్నారు.
మార్చి 26న న్యాయవాదులతో సమీక్ష ...
ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మార్చి 26వ తేదీన న్యాయవాదులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. మరో పది రోజుల్లో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన సంఘ పెద్దలతో సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. అనుకున్న లక్ష్యం సాధించే ప్రక్రియలో తాము నిద్రపోమని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిద్ర పట్టకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముద్రగడ దీక్ష విరమించారు. సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల రామకృష్ణ, జిల్లా సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి నారాయణరెడ్డి, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డా.విజయశంకర్, అమరం నరసింహారెడ్డి, కొండా విజయ్, పీ నారాయణరెడ్డి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ వై సత్యనారాయణ, ఆర్జా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.