కేసీ ఈఈ కార్యాలయం ముట్టడించిన రైతులు
పంటలను కాపాడండి
Published Tue, Nov 15 2016 11:40 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– కేసీ ఈఈ కార్యాలయం ముట్టడించిన రైతులు
నంద్యాలరూరల్: కేసీ నుంచి సాగునీరందించి ఎండిపోతున్న పైర్లను కాపాడాలని కేడీసీసీబీ డైరెక్టర్ వడ్డు ప్రతాపరెడ్డి, చిందుకూరు సర్పంచ్ వెంకటకృష్ణారెడ్డి, గడిగరేవుల ఎంపీటీసీ సభ్యుడు సత్యరాజు, తిరుపాడు సర్పంచ్ వెంకటేశ్వర్లు, చిందుకూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు గోవిందరెడ్డి, కార్యదర్శి ఏరాసు వెంకటరమణారెడ్డి, ఉపాధ్యక్షుడు తిరుపంరెడ్డి, ఎర్రగుంటల నీటి సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గడిగరేవుల, బోధనం, తిరుపాడు, పరమటూరు, చిందుకూరు, పెసరవాయి, ఎర్రగుంట్ల, కొరటమద్ది, పులిమద్ది, కరిమద్దెల గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీ కెనాల్ ఈఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతుగా వారు మాట్లాడుతూ పైర్లు ఎండుతున్నా నీటి విడుదలకు ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని నిలదీశారు. కేసీ కెనాల్‌కు తూడిచర్ల చానెల్ ద్వారా 350 క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉండగా 100 క్యూసెక్కులు విడుదల చేసి పైర్లు ఎండిపోవడానికి పరోక్షంగా అధికారులే కారణమయ్యారని ఆరోపించారు. తక్షణమే ఒక తడికి కావాల్సిన సాగునీరు అందించి 10వేల ఎకరాలకు పైగా పంటలు కాపాడాలని కోరారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉలుకూ పలుకూ లేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పంటలను కాపాడాలన్నారు. కేసీ కెనాల్ ఏఈ చంద్రుడు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు.
Advertisement