ఎస్సీ హక్కుల పరిరక్షణే ధ్యేయం | sc rights | Sakshi
Sakshi News home page

ఎస్సీ హక్కుల పరిరక్షణే ధ్యేయం

Published Fri, Aug 5 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

ఎస్సీ హక్కుల పరిరక్షణే ధ్యేయం

ఎస్సీ హక్కుల పరిరక్షణే ధ్యేయం

– సమర్థవంతమైన పాలనతోనే ప్రజల్లో నమ్మకం
– జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యురాలు పీఎం కమలమ్మ

కర్నూలు(అర్బన్‌): షెడ్యూల్డు కులాల ప్రజల హక్కుల పరిరక్షణే కమిషన్‌ ధ్యేయమని జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యురాలు పీఎం కమలమ్మ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో ఎస్సీ సంఘాల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అనంతరం మధ్నాహం జిల్లా అధికారులతో అట్రాసిటీ కేసులు, భూసమస్యలు, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధుల వ్యయం తదితర అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్, జాయింట్‌ కలెక్టర్‌ సీ హరికిరణ్, ఎస్పీ ఆకె రవికష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలమ్మ మాట్లాడుతూ వర్తమాన, భవిష్యత్‌ కాలాలకు అనుగుణంగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ భారత రాజ్యాంగాన్ని రచించారని, అందులోనే ఆర్టికల్‌ 338 ప్రకారం జాతీయ కమిషన్‌ను ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జీఓలు, చట్టాలను జిల్లా అధికారులు సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడుతుందన్నారు. జిల్లా యూనిట్‌గా జిల్లా అధికారులు మాత్రం పనిచేస్తే సరిపోదని, క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు కూడా విధులు సక్రమంగా నిర్వహిస్తే ప్రజల ఇబ్బందులను తొలగించిన వారవుతారన్నారు. ఉద్యోగానికి కొంత మానవత్వాన్ని కూడా జోడిస్తే పాలన సజావుగా సాగుతుందన్నారు.
వినతులపై పూర్తి స్థాయి పరిశీలన ...
వివిధ సమస్యలపై తమకు 200కు పైగా వినతి పత్రాలు అందాయని, వాటన్నింటిని పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. ఇక్కడే పరిష్కారమయ్యే వాటిని మినహాయించి మిగిలినవాటిపై పరిశీలన జరిపి 15రోజుల్లో న్యాయం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో 2010 నుంచి 2016 వరకు నమోదైన అట్రాసిటీ కేసులు, వాటిలో చార్జిషీట్‌ ఓపెన్‌ చేసినవి, రిజక్ట్‌ అయినవి తదితర వివరాలను ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీలు మురళీధర్, వినోదర్‌కుమార్‌ ద్వారా తెలుసుకున్నారు. ఇటీవల జంట హత్యలు జరిగిన ఉప్పలూరు ఘటనపై ఆరా తీశారు. బాధితులకు పరిహారం, చేపట్టిన చర్యలపై ప్రశ్నించారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు పరిహారం మంజూరు చేశామని జేసీ హరికిరణ్‌ సమాధానమిచ్చారు.
సబ్‌ప్లాన్‌ నిధుల దుర్వినియోగం ...
దేవనకొండ మండలంలో సబ్‌ప్లాన్‌ నిధులతో ఎస్సీ కాలనీల్లో అభివద్ధి పనులు చేపట్టకుండా ఇతర కాలనీల్లో పనులు చేపడుతున్నారని విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు సమావేశం దష్టికి తీసుకువచ్చారు. విషయంపై కమిషన్‌ సభ్యురాలు కమలమ్మ అసహనం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నాన్‌ బ్యాకింగ్‌ పథకం కింద 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సహాయాన్ని వెంటనే లబిధదారులకు అందించాలని ఈడీ వీర ఓబులును ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement