సాక్షి, అమరావతి: రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ వచ్చే మార్చి తర్వాత గల్లంతు కానుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ అంటే గత 41 ఏళ్లలో రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. నిజానికి.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఆ పార్టీని చేజిక్కించుకున్న తర్వాత టీడీపీ క్రమంగా ప్రాభవం కోల్పోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. త్వరలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలూ అసెంబ్లీలో సంఖ్యా బలం ద్వారా వైఎస్సార్‌సీపీనే కైవసం చేసుకుంటుంది.
దీంతో రాజ్యసభలో టీడీపీ తొలిసారిగా కనుమరుగు కావడం ఖాయం. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. ఇక రాజ్యసభలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాల్లో ఘనవిజయం సాధించగా.. టీడీపీ 23 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది.
దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని మచ్చిక చేసుకుని కేసుల నుంచి బయటపడేందుకు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌లను బీజేపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు పావులు కదిపారు. ఇక రాష్ట్ర కోటాలో ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 2020లో నలుగురు (టీడీపీ), 2022లో నలుగురు (ముగ్గురు టీడీపీ, ఒకరు వైఎస్సార్‌సీపీ) పదవీకాలం పూర్తవడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. నాడు అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఆ పార్టీకే దక్కాయి. ఇందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సామాజిక న్యాయమంటే ఇదీ అని సీఎం వైఎస్ జగన్ దేశానికి చాటిచెప్పారు.
ఆ మూడూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే..
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 2 నాటికి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి (వైఎస్సార్‌సీపీ), సీఎం రమేష్ (బీజేపీ), కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ)ల పదవీకాలం పూర్తికానుంది. ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేయనుంది. రాజ్యసభకు ఎన్నికకు కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్‌సీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. ఈ మూడు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరడం ఖాయం. దీంతో రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ బలం 11కు చేరనుంది. అంటే రాష్ట్ర కోటాలో సీట్లన్నీ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే చేరుతాయి. టీడీపీ ఉనికే లేకుండాపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment