'భూ వివాదాలను నెలాఖరులోపు పరిష్కరించాలి'
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ
కర్నూలు సిటీ: ఎస్సీ, ఎస్టీల భూ వివాదలపై వచ్చిన ఫిర్యాదులను ఈ నెల 31లోపు పరిష్కరించాలని ఎస్టీ, ఎస్టీ కమిషన్ చెర్మన్ కారెం శివాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. మొదట జిల్లాలో భూ వివాద సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ భూ దురాక్రమణల పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు.
కారణాలు చూపకుండా ఫిర్యాదు వచ్చిన వెంటనే నిర్దేశించిన గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. వివాదాస్పద భూముల్లో ఇతరులకు పట్టాలు ఇస్తే చర్యలు తప్పవన్నారు. జేసీ కోర్టులో ఇలాంటి వివాదాలకు పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ఓర్వకల్లు మండలంలో సాగు చేసుకుంటున్న భూములపై విచారణ చేసి న్యాం చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూములను సేకరించాలన్నారు. ఇందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. వివాదాలపై ఫిర్యాదులు వస్తే ఆ కాపీతో పాటు పరిష్కారాన్ని నివేదిక రూపంలో కమిషన్‌కు పంపాలన్నారు.
ప్రత్యేక కౌంటర్లలో 188 ఫిర్యాదులు
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ భూముల వివాదాలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు ఈ నెల 1 నుంచి 10 తేది వరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని జేసీ హరికిరణ్ తెలిపారు. ఈ కేంద్రాలకు మొత్తం 188 ఫిర్యాదులు రాగా, ఇప్పటికే 60 పరిష్కరించామన్నారు. అధికారులు ప్రజా సాధికార సర్వేలో ఉండడం వల్ల మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి నెల 4వ సోమవారం ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ భూముల వివాదాలపై విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత 17 నెలల కాలంలో ఈ సమావేశాలకు 950 ఫిర్యాదులు రాగా 856 అర్జీలు పరిష్కారం అయ్యాయన్నారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు కమిషన్ చైర్మెన్ కారెం శివాజీకి వినతులు ఇచ్చారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డీఆర్‌ఓ గంగాధర్ గౌడు, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.