బుట్టాయగూడెం : 2016–17 ఆర్థిక సంవత్సరానికి గిరిజిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.139 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నట్టు ఎస్‌ఈ ప్రసాద్ తెలిపారు. శనివారం మండలంలోని ఇప్పలపాడు సమీపంలో సుమారు రూ.3 కోట్లతో నిర్మిస్తున్న ఐటీఐ భవన నిర్మాణం పనులు, కామయ్యపాలెంలోని కోటి రూపాయలతో నిర్మిస్తున్న అదనపు తరగతి భవనాల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్‌ఈ విలేకరులతో మాట్లాడుతూ ఈ నిధులతో 13 జిల్లాల్లోని అన్ని ఐటీడీఏల్లో వసతి గృహాలు, ఇతర భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 7 ఐటీడీఏల్లో మినీ ఆడిటోరియంను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 10 ఏకలవ్య మోడల్ స్కూల్స్ మంజూరయినట్టు చెప్పారు. ఈఈ టీవీఎస్ జోగారావు, డీఈ జి.రామ్‌గోపాల్, ఏఈ అచ్యుతం పాల్గొన్నారు.