చెరువులో పడిన స్కూల్ బస్సు
చెరువులో పడిన స్కూల్ బస్సు
Published Mon, Aug 8 2016 8:42 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
పాలకొల్లు సెంట్రల్ : పట్టణానికి చెందిన నారాయణ స్కూల్ బస్సు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 17 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్, స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం సాయంత్రం గం 5.30గంటలకు స్థానిక బంగారువారి చెరువుగట్టు సాయిబాబా గుడి రోడ్డులో నుంచి వస్తున్న నారాయణ స్కూల్ బస్సుకు ఎదురుగా సైకిల్‌పై విద్యార్థి రావడంతో డ్రైవర్ అతనిని తప్పించేందుకు మార్జిన్‌లోకి వెళ్లాడు. ఈ సమయంలో ఈ తరుణంలో బస్సు అదుపుతప్పి అర్భన్ హెల్త్ సెంటర్ వద్ద ఎదురుగా ఉన్న శ్మశానం చెరువులో పడిపోయింది. బస్సు పడిపోయిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ తాడి అరుణ్‌కుమార్ లోపల ఉన్న 17 మంది విద్యార్థులను బస్సుపైకి చేర్చగా, స్థానికులు కుక్కల రాజు, పెండ్రి పిచ్చయ్య, సైమన్ వారిని బయటకు సురక్షితంగా తీసుకువచ్చారు.
అదృష్టం బాగుంది
అదృష్టం బాగుండి పెనుప్రమాదం తప్పిందని ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థి అక్షశ్రీసాయి తండ్రి పెచ్చెట్టి శ్రీనివాస్ చెప్పారు. ఘటన గురించి తెలిసిన వెంటనే అక్కడకు వచ్చిన ఆయన తనకు నలుగురు సంతానంలో ఒక్కడే ఉన్నాడని, అదృష్టం బాగుండి ప్రమాదం నుంచి బయటపడ్డాడని కంటతడిపెట్టాడు.
చెరువు మార్జిన్ పూడిక లోపమే కారణం
ఇటీవల ఈ చెరువుకు మార్జిన్ పనులు చేపట్టారు. అరకొర పనులతో మమ అనిపించారు. మార్జిన్‌లో మట్టి ఉండడంతో నేల ఉందనుకుని బస్సును డ్రైవర్ పక్కకు మళ్లించాడు. అక్కడ మట్టి బలంగా లేకపోవడంతో బస్సు అదుపుతప్పి చెరువులోకి పడిపోయింది. అదృష్టవశాత్తూ.. విద్యార్థుల బస్సు చెరువులో పడినా ఎవరికీ ఏమీ కాలేదు. వెంటనే అక్కడ మార్చిన్‌ను బలంగా పూడ్చాలని, ఆ ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
Advertisement