వినూత్నంగా..ప్రభావ వంతంగా..!
పాఠశాల కాంప్లెక్స్‌ల నిర్వహణపై పీవో శేషగిరి సూచన.
భానుగుడి (కాకినాడ) : స్కూల్ కాంప్లెక్స్‌ల సమావేశాలు వినూత్నంగా..ప్రభావ వంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ సొసైటీ నుంచి విషయాలను సేకరించి క్షేత్ర స్థాయిలో అమలు పరచాలని పీవో మేకాశేషగిరి తెలిపారు. పీవో కార్యాలయంలో దీనికి సంబంధించి బుధవారం ఏర్పాటు చేసిన మేధావుల కమిటీని సమావేశ పరిచి సూచనలు చేశారు. జిల్లాలో 322 స్కూల్ కాంప్లెక్స్‌ల్లో నెలకు రెండు రోజుల చొప్పున ఉపాధ్యాయులకు పాఠశాలల నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఉపా«ధ్యాయులు తరగతి గదిని ప్రభావవంతంగా నడిపించేందుకు కావాల్సిన నైపుణ్యాలను శిక్షణ ద్వారా అందివ్వాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఎంఓ చామంతి నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో క్షేత్ర స్థాయిలో సమస్యాత్మక విషయాల నివారణ, ఉపాధ్యాయులు మారుతున్న సమాజానికి అనుగుణంగా అప్‌డేట్ అవ్వడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీతో చర్చించారు. ఉపాధ్యాయులు అప్‌డేట్ కావడానికి స్కూల్ కాంప్లెక్స్‌లు ఒక సాధనంగా మలచాలన్నారు. ప్రతి కాంప్లెక్స్‌కి డిజిటల్ క్లాస్‌రూమ్ ఉండడం ద్వారా తరగతి బోధన మరింత నాణ్యమైదనదిగా తీర్చేందుకు ఉన్న అవకాశాలను స్కూల్‌కాంప్లెక్స్ సమావేశాల్లో చర్చించేలా చూడాలన్నారు. ఎస్‌ఎస్‌ఎ సెక్టోరల్ అధికారులు, అసిస్టెంట్ ఏఎంఓ ఆకేళ్ళ శ్రీనివాస్, సీఎంఓ ఐ.వెంకట్రావ్, కమిటీ కన్వీనర్ సలాది సుధాకర్, కమిటీ సభ్యులు మాచిరాజు, కేవీవీ నాయుడు, ఎస్‌ఎస్‌వీ చలపతి, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.