వద్దన్నా..కూల్చేశారు!
► మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు పాఠశాల స్థలం అడిగిన ఎమ్మెల్యే
► నిరాకరించిన అధికారులు
► అయినా సర్పంచ్ సమక్షంలోనే అక్రమంగా కూల్చివేత
సంజామల: స్థానిక మండల పరిషత్ ప్రాథమిక రెగ్యులర్ పాఠశాల ప్రహరీని అధికార పార్టీ నాయకులు సోమవారం అడ్డగోలుగా కూల్చివేశారు. పాఠశాలలో 90 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. అసలే పాఠశాలకు తగిన వసతి సౌకర్యాలు లేవు. మరుగుదొడ్లు, వంట గది ఉన్నా విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం లేదు. అయినా మినరల్ వాటర్ ప్లాంట్ పేరుతో ప్రహరీని కూలగొట్టారు.
హామీని నిలుపుకునేందుకు తంటాలు..
గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నా మూడోది తన సొంత నిధులతో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని నిలబెట్టుకునే చర్యల్లో భాగంగా ఆరు నెలల క్రితం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పాఠశాల స్థలంలో భూమి పూజ చేశారు. ఇక్కడ సరిపోయేంత స్థలం లేకపోవడంతో ప్రహరీని, వంట గది కోసం ఏర్పాటు చేసిన షెడ్డును కూల్చేందుకు నిర్ణయించగా ఎంపీడీఓ మురళీకళ్యాణి అందుకు నిరాకరించారు.
ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇదే విషయం జిల్లా పరిషత్ సీఈఓ దృష్టికి వెళ్లగా ఆయన ఉపాధి పనుల పరిశీలనకోసం వచ్చి గ్రామంలో పాఠశాలనూ సందర్శించి వెళ్లారు. అసలే పాఠశాలకు సరిపోయేంత స్థలంలేక ఇబ్బందులు పడుతుండగా ఉన్న ప్రహరీని, వంట గది షెడ్డును వాటర్ ప్లాంట్‌కు ఇస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అనుమతులు ఇవ్వలేదు.
మరోచోట స్థలం ఉన్నా..
గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు అనువుగా అదే వీధిలోని కమలమ్మ బావి వద్ద స్థలం ఉర్రా అధికారపార్టీ నాయకులు మంకుపట్టుపట్టారన్న∙ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందులోభాగంగానే అనుమతులు రాకపోయినా తమకు అడ్డువచ్చే వారు లేరనే ఉద్దేశంతో బరితెగింపునకు పాల్పడ్డారు. గ్రామ సర్పంచ్ గంగా ఈశ్వరయ్య సమక్షంలోనే టీడీపీ నాయకులు మద్దిలేటి, సాగునీటి సంఘం ఉపాధ్యక్షులు మల్కి వుశేని దగ్గరుండి పాఠశాల ప్రహరీని కూలీలతో కూల్చివేయించారు.
కూల్చివేసిన విషయం తెలియదు: శ్రీరాములు, ఎంఈఓ, సంజామల
పాఠశాల ప్రహరీ కూల్చివేత విషయం నాకు తెలియదు. గతంలో పాఠశాల స్థలం కావాలని అడిగారు కాని ఈ విషయం పూర్తిగా ఎంపీడీఓ పరిధిలో ఉంటుందని తెలిపాను.
జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేశా: గౌరుగారి ఓబుళరెడ్డి, ఎంపీపీ, సంజామల
పాఠశాల ప్రహరీని టీడీపీ కార్యకర్తలు కూల్చివేయడంపై జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేశాను. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం టీడీపీ నాయకులకు తగదు. పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేస్తాం. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
సాక్షి విలేకరికి బెదిరింపులు
వీరు చేసే దుశ్చర్యను సాక్షి విలేకరి ఫొటోలు తీసి కూల్చివేతకు ఏమైనా అనుమతులు వచ్చాయా అని ఆరా తీయగా జెడ్పీ సీఈఓ చూసి వెళ్లారని అనుమతులు ఇచ్చినందుకే పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వెంటనే ఎంపీడీఓ మురళీ కళ్యాణికి ఫోన్ చేసి వివరణ కోరగా అనుమతులు రాలేదన్నారు. అనంతరం ఆమె కూల్చివేతను నిలిపేలని ఫోన్‌లో ఆదేశించారు. అప్పటికే ప్రహరీ కూల్చివేయగా కిచెన్ షెడ్డు కూల్చి వేతకు అడ్డుకట్ట పడింది. దీంతో సాక్షి విలేకరిపై అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు పడతాడని సన్నిహితులతో చెప్పి పంపారు.