minaral water plant
-
సుజలం.. విఫలం
మండపేట: అధికారంలోకి వచ్చిన వెంటనే.. ‘ఎన్టీఆర్ సుజల’ పథకం కింద ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందజేస్తామన్న చంద్రబాబు హామీ ఆచరణలోకి వచ్చేసరికి నీరుగారిపోయింది. 2014 అక్టోబరు 4న కపిలేశ్వరపురం మండలం అంగరలో ఏర్పాటు చేసిన తొలి విడత జన్మభూమిలో భాగంగా మొట్టమొదటి ఎన్టీఆర్ సుజల ప్లాంటును చంద్రబాబు ప్రారంభించారు. జిల్లాలో 1072 పంచాయతీలకు గాను తొలిదశలో దాతల సాయంతో 234 ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేయగా, రాష్ట్ర అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్) నుంచి 19 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మరికొన్ని గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధులతో ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించినా నిధుల లేమితో కార్యరూపం దాల్చలేదు. తాగునీటి సమస్య అధికంగా ఉన్న సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు. నిర్వహణ భారంతో ఇప్పటికే దాదాపు 25 శాతం ప్లాంట్లు మూతపడ్డాయి. రాజోలు నియోజకవర్గంలో మూడు ప్లాంట్లు మూతపడగా, అమలాపురంలో నాలుగు, ముమ్మిడివరంలో రెండు, పి.గన్నవరంలో రెండు ప్లాంట్లు మూతపడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లోను పలు ప్లాంట్లు మూతపడినట్టు అధికారులు చెబుతున్నారు. అంగరలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన సుజల ప్లాంటు మూతపడి ఆరు నెలలు కావస్తోంది. 20 లీటర్లకు రెండు రూపాయలు తీసుకోవాల్సి ఉండగా నిర్వహణ భారంతో కొన్నిచోట్ల రూ.ఐదు నుంచి రూ.10 వరకు తీసుకుంటున్నారు. అడుగుపడని క్లస్టర్లు రెండో విడతగా జిల్లాలోని కోనసీమలో 204 గ్రామాలకు మినరల్ వాటర్‌ను అందించేందుకు అంబాజీపేట, కాట్రేనికోన, పి. గన్నవరం క్లస్టర్లుగా అధికార యంత్రాంగం విభజించింది. రూ.11.53 కోట్ల వ్యయంతో ఆయా చోట్ల మదర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామాల్లో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల ద్వారా రూ.రెండుకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందజేయాలన్నది లక్ష్యం. మదర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మూడు క్లస్టర్ల పరిధిలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జనవరిలో బోర్లు తీయించారు. నిధుల కొరతతో బోర్ల దశలోనే పనులు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు రూ.2కు మినరల్ వాటర్ అందలేదు. పథకం అమలులో చంద్రబాబు సర్కారు వైఫల్యం తమకు మినరల్ వాటర్ అందకుండా చేసిందని ప్రజలు మండిపడుతున్నారు. కేవలం 23 శాతం పంచాయతీల్లో మాత్రమే ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శిస్తున్నారు. ప్రైవేటు ప్లాంట్ల వద్ద 20 లీటర్ల నీటికి రూ.10 నుంచి రూ.30 వరకు వెచ్చించ వలసి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మినరల్ కాదు.. జనరల్
ప్రజల తాగునీటి అవసరాలను ఆసరా చేసుకున్నారు ఆ వ్యాపారులు. నీరున్న ప్రాంతం.. రవాణాకు అనువుగా ఉండే ప్రదేశంలో గది అద్దెకు తీసుకుని బోరేసుకుంటారు. మూడు ఆటోలు, వంద క్యాన్లు కొనుగోలు చేసి.. నలుగురు మనుషులను వర్కర్లుగా పెట్టుకుంటారు. ఉదయం లేచింది మొదలు పొద్దుపోయే వరకు మోటారుతో క్యాన్లలో నీటిని నింపుతూ.. వీధుల్లో రయ్యరయ్య తిరుగుతూ విక్రయిస్తుంటారు. డబ్బులు పెట్టి కొంటున్నాం కదా.. మినరల్ వాటరే తాగుతున్నాం అనుకుంటారు. కానీ.. అవన్నీ జనరల్ వాటర్ అనే విషయం సామాన్య ప్రజలకు తెలియదు. జిల్లాలో అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నా.. మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం కొనసాగుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. సంబంధిత అధికారులు అనుమతి లేని ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడకపోవడంతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో అనుమతి పొందిన ప్లాంట్ల కంటే లేనివే ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మంరూరల్: జిల్లా కేంద్రంతోపాటు మున్సిపాలిటీలు, చిన్న పట్టణాల్లో సుమారు 1,026 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో మూడొంతులకు పైగా అనుమ తి లేకుండా నడిచే ప్లాంట్లే ఉండడం గమనార్హం. కొందరు వ్యాపారులు సంపాదనే లక్ష్యం గా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్లాంటు నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎటువం టి అనుమతులు తీసుకోకుండా.. మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లోపించిన నీటిని క్యాన్ ఒక్కంటికి రూ.10 నుంచి రూ.15 చొప్పున విక్రయిస్తూ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. బస్టాండ్లు, దుకాణాల్లో నీళ్లు అమ్మే వ్యాపారులు ప్లాంట్ల నిర్వాహకులతో కుమ్మక్కై లీటర్ నీళ్ల బాటిల్ రూ.4 నుంచి రూ.5 వరకు అమ్ముతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ఇదంతా యథేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టానుసారంగా లిక్విడ్ వినియోగం.. నీటిని శుద్ధి చేయడానికి మినరల్ వాటర్ ప్లాంట్లలో డోజింగ్ లిక్విడ్‌ను వినియోగి స్తుం టారు. ఈ లిక్విడ్‌ను 20 లీటర్ల శుద్ధి జలాన్ని తయారు చేసేందుకు 100 నుంచి 150 గ్రాముల వరకు ఉపయోగిస్తారు. మిషన్ ద్వారా పంపించిన లిక్విడ్ నీటిని శుద్ధి చేసి.. వృథా నీటి ద్వారా బయటకు వస్తుంది. చాలా వాటర్ ప్లాంట్లలో ఈ లిక్విడ్‌ను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లలో నీటిని శుద్ధి చేయడానికి నీటిలో ఫ్లోరైడ్ శాతాన్ని లెక్కించి నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. నీటిలో ఫ్లోరైడ్ శాతం 1000 నుంచి 1500 శాతానికి పైగా ఉంటే.. ఆ నీటిని శుద్ధి చేస్తే అధిక శాతం నీరు వృథా అవుతుంది. దీంతో అత్యధిక శాతం నీరు నిరుపయోగంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వరు. ప్లాంట్ స్థాపనకు ఉండాల్సిన నిబంధనలిలా.. వాటర్ ప్లాంట్లు నిర్వహించాలంటే ప్లాంట్లలో మినరల్‌తోపాటు కెమిస్ట్ మైక్రోబయాలజీ ల్యాబ్ కలిగి ఉండాలి. ఆయా ల్యాబ్‌లలో నీటి పరీక్షలు చేసేందుకు సల్ఫ్యూరిక్ ఆమ్లం వంటి 108 రకాల కెమికల్స్ అవసరం ఉంటుంది. ప్రతి రోజూ ఫిజికల్ టెస్టులు (రంగు, రుచి, వాసన పీహెచ్ హైడ్రోజన్ ఆయాన్ కాన్సంట్రేషన్) నిర్వహించాలి. ఫ్లోరైడ్, క్లోరైడ్ పరీక్షలు జరపాలి. క్వాలిటీ టెక్నీషియన్లు ఉండాలి. నిత్యం శుభ్రమైన వాటర్ క్యాన్లను వినియోగించాలి. మూడు నెలలకు ఒకసారి క్యాన్లను మార్చాలి. వాటర్ క్యాన్లపై మాన్యుఫ్యాక్చరింగ్ తేదీ, బ్యాచ్ నంబర్, ఎక్స్పైరీ తేదీ తదితర సమాచారం ఉండాలి. ఫ్యూరీఫై చేసిన తర్వాత నీటిని కనీసం 24 గంటలు నిల్వ ఉండాలి. వాటర్ ఫిల్లింగ్ ఏసీలో జరపాలి. వాటర్ ట్యాంక్‌లపై తప్పనిసరిగా మూతలు ఉండాలి. డ్రెస్సింగ్ గది, ప్రొడక్షన్ రూం, ఫిల్లింగ్ గదులు ఉండాలి. రోజుకు నాలుగు గంటలకోసారి నీటి పరీక్షలు జరపాలి. కానీ.. ఇటువంటి నిబంధనలను జిల్లాలోని వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు కనీసం 25 శాతం కూడా పాటించడం లేదని తెలుస్తోంది. ప్లాంట్ల నిర్వహణ కోసం అనుమతులు లేకుండా బోర్లు వేస్తున్నా.. రెవెన్యూ, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా బోర్ వేయాలంటే భూగర్భ జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారుల అనుమతి తప్పక తీసుకోవాలి. కానీ.. నిర్వాహకులు అటువంటి నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా బోర్లు వేస్తుండడంతో భూగర్భ జలాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ప్లాంట్ నిర్వాహకులు బోర్లు వేసి.. వాటి నుంచి సుమారుగా 10వేల లీటర్ల నీటిని తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతంలోని బోర్లు, బావుల్లో నీరు ఇంకిపోయి ప్రజలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వేసవి కాలంలో వారి పరిస్థితి చెప్పలేకుండా ఉంది. శుద్ధ జలానికే ప్రజల మొగ్గు.. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణాలు, గ్రామీణ ప్రాం తాలు అనే తేడా లేకుండా శుద్ధి చేసిన జలాలను తాగేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న ప్లాంట్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా నీటిని అందించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాల్లో అధిక శాతం మినరల్ వాటర్ వ్యాపారులు క్యాన్లను ఆర్డర్ ప్రకారం ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, విందులు, వినోదాల్లో కూల్ వాటర్‌ను కొందరు వినియోగిస్తున్నారు. కూల్ వాటర్ క్యాన్ రూ.40 నుంచి రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. గృహావసరాలకే కాకుండా వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, హోటళ్లలో ఫ్యూరిఫైడ్ నీటినే వినియోగిస్తున్నారు. మార్కెట్లో ఉన్న పోటీ నిమిత్తం పలువురు వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, బేకరీల నిర్వాహకులు శుద్ధ జలాన్ని వినియోగదారులకు అందించాలని కోరుకుంటారు. వివాహాది శుభకార్యాలకు వేలాది లీటర్ల మినరల్ వాటర్‌ను వినియోగిస్తున్నారు. అనుమతి లేని ప్లాంట్ల ద్వారా సరఫరా అయ్యే నీరు కలుషితం అవుతుండడం.. వాటిని ప్రజలు సేవిస్తుండడంతో 80 శాతం మంది వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారని వైద్యులే స్వయం గా పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు సురక్షితమైన తాగునీటి కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నా రు. సురక్షితమైన తాగునీటి కోసం సంపన్న వర్గాల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి నెల కొం త సొమ్మును వెచ్చించడం ప్రస్తుతం తప్పనిసరి అయింది. గతంలో వేసవి కాలానికే పరిమితమైన శుద్ధ జలం వినియోగం ఇప్పుడు ఏడాది పొడవునా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అనుమతి లేని ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒళ్లంతా నొప్పులే.. గ్రామాల్లో ఎలాగూ పరిశుభ్రమైన తాగునీరు అందించరు. దీంతో డబ్బులు పెట్టి మరీ కొనుక్కు న్న మినరల్ వాటర్ తాగితే ఒళ్లం తా నొప్పులుగా ఉం టుంది. పైగా నీళ్లు తాగినప్పుడే తీపిగా ఉంటున్నాయి. ఆ తర్వాత మళ్లీ దాహం వేస్తుంది. ఆరోగ్యం కోసం మినరల్ వాటర్ తాగితే అవి మినరల్ నీళ్లో, జనరల్ నీళ్లో తెలియడం లేదు. – కర్లపూడి వెంకటేశ్వర్లు, మద్దులపల్లి తనిఖీలు చేయాలి.. పరిమితికి మించి నీటిలో రసాయనాలు కలపడం వల్ల ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి. నీటి పరీక్షలు చేయించి నిబంధనల ప్రకారమే మినరల్స్ ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలి. పైగా మినరల్ క్యాన్ల ధరలు కూడా ఇష్టానుసారం పెంచుతున్నారు. వాటిని కట్టడి చేయాలి. – యాట శ్రీను, కామంచికల్ నిబంధనల మేరకే అనుమతులు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ముందుగా టీఎస్ ఐపాస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి ఎంతమేరకు.. ఎన్ని అడుగు లు బోర్ వేయవచ్చనేది పరిశీలించి అనుమతి ఇస్తాం. ప్లాంట్‌లో బోర్ వేయాలంటే నాలుగు నిబంధనలు పాటించాలి. సేఫ్ ఏరియా, సెమీ క్రిటికల్, క్రిటికల్, వెరీ క్రిటికల్ నిబంధనలుం టాయి. వీటిలో క్రిటికల్, వెరీ క్రిటికల్ పరిస్థితి ఉన్నచోట బోరు వేసేందుకు అనుమతి ఇవ్వం. అలా జిల్లాలో చాలా వరకు బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వలేదు. వాల్టా చట్టం ప్రకారం బోరుకు బోరుకు మధ్య దూరం 300 మీటర్లు పాటించాలి. రోజుకు 500 కిలో లీటర్ల నీరు తోడేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మించి ఉన్నట్లయితే అనుమతి ఇవ్వడం కుదరదు. – రాకేష్చందర్, భూగర్భ జలవనరుల శాఖ డీడీ -
మినరల్ వాటార్ తాగుతున్నారా?
తాండూరు పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన నరేష్ నిత్యం స్థానికంగా దొరికే ఫిల్టర్ వాటర్ వినియోగిస్తున్నాడు. ఇటీవల అతడికి జ్వరం వచ్చి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ పరిశీలించి.. వాటర్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పడంతో నోరెళ్లబెట్టాడు. తాను ఫిల్టర్ వాటర్ వాడుతుండగా ఇన్ఫెక్షన్ రావడం ఏంటని ఖంగుతిన్నాడు. దీనిద్వారా మనకు స్థానికంగా వాటర్ ప్లాంట్లలో లభిస్తున్న నీరు ఎంత పరిశుభ్రంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వాటర్ ఫిల్టర్ నిర్వాహకులు సరైన నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాండూరు : ప్రస్తుతం వేసవి కాలం కావడంతో జిల్లా పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో వాటర్ ఫిల్టర్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. వాటర్ ఫిల్టర్ నిర్వాహకులు నీళ్లను నామమాత్రంగా శుద్ధి చేసి జనానికి అంటగడుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో బాటిల్‌కు రూ. 15 నుంచి 20 వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ నేపథ్యం లో ప్రజలు డబ్బులు పెట్టి మరీ రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. తరచూ తనిఖీలు చేయాల్సిన అధికారులు ఎక్కడా కనిపించకపోవడంతో ‘ఫిల్టర్’వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నవిధంగా తయారైంది. తాండూరు మున్సిపల్ పరిధిలో దాదాపు 10 వాటర్ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. సీజన్ కావడంతో ప్రతిరోజూ రూ.లక్షకు పైగా వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనలు పాటించి నాణ్యమైన నీటిని జనానికి అందించాల్సిన నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగిస్తున్నా అడిగే నాథుడు లేకుండా పోయాడు. నిబంధనల ప్రకారం లీటర్ నీటిలో 50 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉండాల్సిన చోట వాటర్ ప్లాంట్లలో ఏకంగా 150–200 పీపీఎం ఉంటుంది. మండలాల్లోనూ అదే పరిస్థితి.. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లోనూ వాటర్ ఫిల్టర్ నిర్వాహకులు సరైన నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదు. పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో ఏటా వాటర్ ఫిల్టర్ కేంద్రాలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన వాటర్ ప్లాంట్లు ప్రస్తుతం గ్రామాల్లోనే విరివిగి విస్తరించాయి. రూ.1లక్ష నుంచి 2లక్షల వరకు వెచ్చిస్తే వాటర్ ప్లాంట్ యూనిట్లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఈనేపథ్యంలో నిబంధనలు పాటించకకుండానే నిర్వాహకులు దందా కొనసాగిస్తున్నారు. నాణ్యత దేవుడికెరుక.. తాండూరు నియోజకవర్గంలో 30కి పైగా నీటిశుద్ధి కేంద్రాలు కొనసాగుతున్నాయి. అందులో కొన్నింటికి నిర్వాహకులు గతంలో అనుమతులు తీసుకున్నా.. తిరిగి వాటిని రెన్యూవల్ చేసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు మున్సిపల్ అనుమతులు లేకుండానే ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రూ. లక్షల్లో వ్యాపారంజరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ నీటితోనే శుద్ధి.. తాండూరు మున్సిపల్ పరిధిలోని చాలా వాటర్ ప్లాంట్లు మున్సిపల్ నీటినే శుద్ధి చేసి జనానికి విక్రయిస్తున్నారు. లేదంటే బోరునీటిని శుభ్రపరిచి జనానికి అంటగడుతున్నారు. 20 లీటర్ల డబ్బా(క్యాన్)ను ఆటోల్లో తరలించి ఇంటింటికి వెళ్లి విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం నిర్వాహకులు నీటి పరీక్షలు నిర్వహించడం లేదు. టీడీఎస్(టోటల్ డిజాల్వ్డ్ సాలీడ్) పరీక్షలు చేసిన అనంతరం ప్రజలకు అందజేయాల్సి ఉన్నా.. ఆ దిశగా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫిల్టర్ చేసి నేరుగా విక్రయిస్తున్నారు. పాటించాల్సిన నిబంధనలు ఇవీ.. వాటర్ ప్లాంట్ నిర్వహణ కోసం మున్సిపల్ లేదా పంచాయతీ అనుమతి తీసుకోవాలి. పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు పొందాలి. ప్లాంట్ నిర్వహణకు బీఎస్ఐ అనుమతులు తీసుకోవాలి. ప్లాంట్లలో మైక్రోబయాలజి, కెమిస్ట్రీ నిపుణులు తప్పనిసరిగా ఉండాలి. నిత్యం పరీక్షలు చేసిన తర్వాతే ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. పీహెచ్ స్థాయి 10 కంటే తగ్గకుండా చూసుకోవాలి. తగ్గితే ఆ నీరు వినియోగించిన ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడే ప్రమాదం ఉంది. నీటిని సరఫరా చేసే డబ్బాలను నిత్యం పొటా షియం పర్మాంగనేట్‌తో శుభ్రం చేయాలి. నీటిలో పూర్తిగా కరిగిపోయే లవణాలను కూడా పరీక్షించాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఖాళీ.. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. భర్తీ చేయాలని కలెక్టర్‌కు నివేదించాం. వాటర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మున్సిపల్ నుంచి కొన్నింటికి అనుమతులు ఇచ్చాం. వాటర్ తరచూ అధికారులు పరిశీలించాలి. కాని.. పని ఒత్తిడితో సాధ్యం కావడం లేదు. వెంటనే పరిశీలిస్తున్నాం. –భోగీశ్వర్లు, కమిషనర్, తాండూరు మున్సిపాలిటీ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి వాటర్ప్లాంట్లలో నిబంధనలు పాటించడం లేదు. అధికారులు తనిఖీలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. నిర్వాహకులు నీటిని నామమాత్రంగా శుద్ధి అమ్ముకుంటున్నారు. దీంతో జనానికి మూత్రపిండాల వ్యాధులు, ఇతర రోగాలు వస్తున్నాయి. –సత్యమూర్తి,తాండూరు -
వద్దన్నా..కూల్చేశారు!
► మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు పాఠశాల స్థలం అడిగిన ఎమ్మెల్యే ► నిరాకరించిన అధికారులు ► అయినా సర్పంచ్ సమక్షంలోనే అక్రమంగా కూల్చివేత సంజామల: స్థానిక మండల పరిషత్ ప్రాథమిక రెగ్యులర్ పాఠశాల ప్రహరీని అధికార పార్టీ నాయకులు సోమవారం అడ్డగోలుగా కూల్చివేశారు. పాఠశాలలో 90 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. అసలే పాఠశాలకు తగిన వసతి సౌకర్యాలు లేవు. మరుగుదొడ్లు, వంట గది ఉన్నా విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం లేదు. అయినా మినరల్ వాటర్ ప్లాంట్ పేరుతో ప్రహరీని కూలగొట్టారు. హామీని నిలుపుకునేందుకు తంటాలు.. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నా మూడోది తన సొంత నిధులతో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని నిలబెట్టుకునే చర్యల్లో భాగంగా ఆరు నెలల క్రితం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పాఠశాల స్థలంలో భూమి పూజ చేశారు. ఇక్కడ సరిపోయేంత స్థలం లేకపోవడంతో ప్రహరీని, వంట గది కోసం ఏర్పాటు చేసిన షెడ్డును కూల్చేందుకు నిర్ణయించగా ఎంపీడీఓ మురళీకళ్యాణి అందుకు నిరాకరించారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇదే విషయం జిల్లా పరిషత్ సీఈఓ దృష్టికి వెళ్లగా ఆయన ఉపాధి పనుల పరిశీలనకోసం వచ్చి గ్రామంలో పాఠశాలనూ సందర్శించి వెళ్లారు. అసలే పాఠశాలకు సరిపోయేంత స్థలంలేక ఇబ్బందులు పడుతుండగా ఉన్న ప్రహరీని, వంట గది షెడ్డును వాటర్ ప్లాంట్‌కు ఇస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అనుమతులు ఇవ్వలేదు. మరోచోట స్థలం ఉన్నా.. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు అనువుగా అదే వీధిలోని కమలమ్మ బావి వద్ద స్థలం ఉర్రా అధికారపార్టీ నాయకులు మంకుపట్టుపట్టారన్న∙ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందులోభాగంగానే అనుమతులు రాకపోయినా తమకు అడ్డువచ్చే వారు లేరనే ఉద్దేశంతో బరితెగింపునకు పాల్పడ్డారు. గ్రామ సర్పంచ్ గంగా ఈశ్వరయ్య సమక్షంలోనే టీడీపీ నాయకులు మద్దిలేటి, సాగునీటి సంఘం ఉపాధ్యక్షులు మల్కి వుశేని దగ్గరుండి పాఠశాల ప్రహరీని కూలీలతో కూల్చివేయించారు. కూల్చివేసిన విషయం తెలియదు: శ్రీరాములు, ఎంఈఓ, సంజామల పాఠశాల ప్రహరీ కూల్చివేత విషయం నాకు తెలియదు. గతంలో పాఠశాల స్థలం కావాలని అడిగారు కాని ఈ విషయం పూర్తిగా ఎంపీడీఓ పరిధిలో ఉంటుందని తెలిపాను. జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేశా: గౌరుగారి ఓబుళరెడ్డి, ఎంపీపీ, సంజామల పాఠశాల ప్రహరీని టీడీపీ కార్యకర్తలు కూల్చివేయడంపై జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేశాను. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం టీడీపీ నాయకులకు తగదు. పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేస్తాం. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. సాక్షి విలేకరికి బెదిరింపులు వీరు చేసే దుశ్చర్యను సాక్షి విలేకరి ఫొటోలు తీసి కూల్చివేతకు ఏమైనా అనుమతులు వచ్చాయా అని ఆరా తీయగా జెడ్పీ సీఈఓ చూసి వెళ్లారని అనుమతులు ఇచ్చినందుకే పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వెంటనే ఎంపీడీఓ మురళీ కళ్యాణికి ఫోన్ చేసి వివరణ కోరగా అనుమతులు రాలేదన్నారు. అనంతరం ఆమె కూల్చివేతను నిలిపేలని ఫోన్లో ఆదేశించారు. అప్పటికే ప్రహరీ కూల్చివేయగా కిచెన్ షెడ్డు కూల్చి వేతకు అడ్డుకట్ట పడింది. దీంతో సాక్షి విలేకరిపై అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు పడతాడని సన్నిహితులతో చెప్పి పంపారు.