రోడ్డుపైనే ఆటోలో ఉన్న డబ్బాల్లో నింపుతున్న ఫిల్టర్ వాటర్
తాండూరు పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన నరేష్ నిత్యం స్థానికంగా దొరికే ఫిల్టర్ వాటర్ వినియోగిస్తున్నాడు. ఇటీవల అతడికి జ్వరం వచ్చి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ పరిశీలించి.. వాటర్ ఇన్‌ఫెక్షన్ అయిందని చెప్పడంతో నోరెళ్లబెట్టాడు. తాను ఫిల్టర్ వాటర్ వాడుతుండగా ఇన్‌ఫెక్షన్ రావడం ఏంటని ఖంగుతిన్నాడు. దీనిద్వారా మనకు స్థానికంగా వాటర్ ప్లాంట్లలో లభిస్తున్న నీరు ఎంత పరిశుభ్రంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వాటర్ ఫిల్టర్ నిర్వాహకులు సరైన నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తాండూరు : ప్రస్తుతం వేసవి కాలం కావడంతో జిల్లా పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో వాటర్ ఫిల్టర్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. వాటర్ ఫిల్టర్ నిర్వాహకులు నీళ్లను నామమాత్రంగా శుద్ధి చేసి జనానికి అంటగడుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో బాటిల్‌కు రూ. 15 నుంచి 20 వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ నేపథ్యం లో ప్రజలు డబ్బులు పెట్టి మరీ రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.
తరచూ తనిఖీలు చేయాల్సిన అధికారులు ఎక్కడా కనిపించకపోవడంతో ‘ఫిల్టర్’వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నవిధంగా తయారైంది. తాండూరు మున్సిపల్ పరిధిలో దాదాపు 10 వాటర్ ప్లాంట్‌లు కొనసాగుతున్నాయి. సీజన్ కావడంతో ప్రతిరోజూ రూ.లక్షకు పైగా వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనలు పాటించి నాణ్యమైన నీటిని జనానికి అందించాల్సిన నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగిస్తున్నా అడిగే నాథుడు లేకుండా పోయాడు. నిబంధనల ప్రకారం లీటర్ నీటిలో 50 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉండాల్సిన చోట వాటర్ ప్లాంట్లలో ఏకంగా 150–200 పీపీఎం ఉంటుంది.
మండలాల్లోనూ అదే పరిస్థితి..
జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లోనూ వాటర్ ఫిల్టర్ నిర్వాహకులు సరైన నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదు. పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో ఏటా వాటర్ ఫిల్టర్ కేంద్రాలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన వాటర్ ప్లాంట్‌లు ప్రస్తుతం గ్రామాల్లోనే విరివిగి విస్తరించాయి. రూ.1లక్ష నుంచి 2లక్షల వరకు వెచ్చిస్తే వాటర్ ప్లాంట్ యూనిట్‌లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఈనేపథ్యంలో నిబంధనలు పాటించకకుండానే నిర్వాహకులు దందా కొనసాగిస్తున్నారు.
నాణ్యత దేవుడికెరుక..
తాండూరు నియోజకవర్గంలో 30కి పైగా నీటిశుద్ధి కేంద్రాలు కొనసాగుతున్నాయి. అందులో కొన్నింటికి నిర్వాహకులు గతంలో అనుమతులు తీసుకున్నా.. తిరిగి వాటిని రెన్యూవల్ చేసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు మున్సిపల్ అనుమతులు లేకుండానే ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రూ. లక్షల్లో వ్యాపారంజరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
మున్సిపల్ నీటితోనే శుద్ధి..
తాండూరు మున్సిపల్ పరిధిలోని చాలా వాటర్ ప్లాంట్లు మున్సిపల్ నీటినే శుద్ధి చేసి జనానికి విక్రయిస్తున్నారు. లేదంటే బోరునీటిని శుభ్రపరిచి జనానికి అంటగడుతున్నారు. 20 లీటర్ల డబ్బా(క్యాన్)ను ఆటోల్లో తరలించి ఇంటింటికి వెళ్లి విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం నిర్వాహకులు నీటి పరీక్షలు నిర్వహించడం లేదు. టీడీఎస్(టోటల్ డిజాల్వ్‌డ్ సాలీడ్) పరీక్షలు చేసిన అనంతరం ప్రజలకు అందజేయాల్సి ఉన్నా.. ఆ దిశగా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫిల్టర్ చేసి నేరుగా విక్రయిస్తున్నారు.
పాటించాల్సిన నిబంధనలు ఇవీ..
వాటర్ ప్లాంట్ నిర్వహణ కోసం మున్సిపల్ లేదా పంచాయతీ అనుమతి తీసుకోవాలి.
పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు పొందాలి.
ప్లాంట్ నిర్వహణకు బీఎస్‌ఐ అనుమతులు తీసుకోవాలి.
ప్లాంట్లలో మైక్రోబయాలజి, కెమిస్ట్రీ నిపుణులు తప్పనిసరిగా ఉండాలి. నిత్యం పరీక్షలు చేసిన తర్వాతే ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంటుంది.
పీహెచ్ స్థాయి 10 కంటే తగ్గకుండా చూసుకోవాలి. తగ్గితే ఆ నీరు వినియోగించిన ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడే ప్రమాదం ఉంది.
నీటిని సరఫరా చేసే డబ్బాలను నిత్యం పొటా షియం పర్మాంగనేట్‌తో శుభ్రం చేయాలి.
నీటిలో పూర్తిగా కరిగిపోయే లవణాలను కూడా పరీక్షించాలి.
ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్ ఖాళీ..
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. భర్తీ చేయాలని కలెక్టర్‌కు నివేదించాం. వాటర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మున్సిపల్ నుంచి కొన్నింటికి అనుమతులు ఇచ్చాం. వాటర్ తరచూ అధికారులు పరిశీలించాలి. కాని.. పని ఒత్తిడితో సాధ్యం కావడం లేదు. వెంటనే పరిశీలిస్తున్నాం. –భోగీశ్వర్లు, కమిషనర్, తాండూరు మున్సిపాలిటీ
ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి
వాటర్‌ప్లాంట్లలో నిబంధనలు పాటించడం లేదు. అధికారులు తనిఖీలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. నిర్వాహకులు నీటిని నామమాత్రంగా శుద్ధి అమ్ముకుంటున్నారు. దీంతో జనానికి మూత్రపిండాల వ్యాధులు, ఇతర రోగాలు వస్తున్నాయి. –సత్యమూర్తి,తాండూరు
Comments
Please login to add a commentAdd a comment