గిరిచేరని.. విద్యాసిరి
-
మూతపడుతున్న గిరిజన ప్రాథమిక పాఠశాలలు
-
నానాటికీ తగ్గుతున్న విద్యార్థుల అడ్మిషన్లు
-
ఇళ్లకే పరిమితమవుతున్న చిన్నారులు
-
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలో దయనీయ పరిస్థితి
‘విద్యారంగానికే తొలి ప్రాధాన్యం’
‘కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తాం’
‘గిరిజనుల సంక్షేమమే లక్ష్యం’.. రాష్ట్ర మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు నిత్యం చెప్పే మాటలివి. ఇవన్నీ నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ ప్రకటనలు కార్యరూపు దాల్చడం లేదు. గిరిజన బాలల జీవితాల్లో చదువులు వెలుగులు నింపడం లేదు. ఇందుకు సాక్ష్యం ఐటీడీఏ పరిధిలోని విద్యా విభాగం పర్యవేక్షణలో నడిచే గిరిజన ప్రాథమిక పాఠశాలలు(జీపీఎస్). ఒకప్పుడు మెుత్తం 173 జీపీఎస్‌లు ఉండేవి. ఇప్పటిదాకా వివిధ కారణాలతో 36 పాఠశాలలను మూతపడ్డాయి. ప్రస్తుతం 137 మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 1,319 మంది విద్యార్థులు మాత్రమే చదువుతుండగా.. సంబంధిత అధికారులు మాత్రం ఇటీవల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి అందజేసిన జీబీ నోట్‌లో మెుత్తం జీపీఎస్‌లలో 4,528 మంది విద్యార్థులు చదువుతున్నట్లు ప్రస్తావించడం గమనార్హం. గిరిజన ప్రాథమిక విద్యా కేంద్రాలు దీనస్థితిని కప్పిపుచ్చే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రస్తుతం జీపీఎస్‌ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? మౌలిక వసతుల లేమి ఎలా ఉంది? ఉపాధ్యాయుల కొరత వివరాలేంటి? అనే అంశాలతో డిప్యూటీ సీఎంకు నివేదించి ఉంటే వాస్తవ పరిస్థితులు ఆయన దృష్టికి వెళ్లి ఉండేవి. తద్వారా సంస్కరణలకు శ్రీకారం చుట్టి జీపీఎస్‌ల బలోపేతానికి సరికొత్త భవిష్యత్ ప్రణాళికను రూపొందించేందుకు ఆస్కారం ఉండేది.
జీపీఎస్‌లు మూసివేసిన ప్రాంతాల్లో అందులోని పిల్లలు పలుచోట్ల తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులకు వెళ్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఇంటిపట్టునే ఉంటున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు, అధికారులు చొరవచూపి పలువురు విద్యార్థులను హాస్టళ్లకు తరలించారు. తద్వారా ఆ చిన్నారులు బాలకార్మికులుగా మారకుండా మంచి ప్రయత్న ం చేశారు. జీపీఎస్‌లు మూతపడిన పలు గొత్తికోయ గూడేల్లో విద్యార్థులు మండల పరిషత్ పాఠశాలలకు వెళ్తున్నారు.ఇటీవల ఏటూరునాగారం ఐటీడీఏలో జరిగిన 58వ పాలక మండలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాఠశాలల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. అయినా ఆ దిశగా అధికారులు దృష్టిసారించడం లేదు.