అధ్యాపకులకు స్క్రీనింగ్ టెస్ట్
►ఖరారు చేసిన సర్కారు
► శాతవాహనలో40 పోస్టుల భర్తీ
►త్వరలోనే నోటిఫికేషన్
► అధ్యాపకుల క్రమబద్ధీకరణ కష్టమే?
శాతవాహన యూనివర్సిటీ: వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1061 అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉన్నతవిద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు వీసీల కమిటీని నియమించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం మార్గదర్శకాలను రూపొందించిన ఆ కమిటీ.. ప్రభుత్వానికి ఒకటిరెండురోజుల్లో నివేదించనున్నట్లు సమాచారం.
ఇది పూర్తయితే శాతవాహన యూనివర్సిటీలో భర్తీచేయనున్న 40 పోస్టులకు ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది. ఇందులో అధ్యాపకుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించిన అనంతరం ఎంపికైన వారికి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపికచేయనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇక కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులను క్రమబద్ధీకరించడం సాధ్యపడదని ఫ్రొపెసర్ తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి మ«ధ్యంతర నివేదిక ఇచ్చింది. మరోవైపు శాతవాహన పరిధిలోని కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తాము ఏళ్ల తరబడి పనిచేస్తున్నామని, తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌చేస్తున్నారు.
స్క్రీనింగ్ టెస్ట్ తప్పనిసరి
అధ్యాపకుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్టు నిర్వాహించాలని భావించిన ప్రభుత్వం మార్గదర్శకాలను తయారు చేయాలని జెఎన్‌టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఉస్మానియా వీసీ రామచంద్రం, అంబేద్కర్ ఓపెన్‌యూనివర్సిటీ వీసీ సీతారామారావుతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. యూజీసీ నియమ నిబంధనల ప్రకారం అన్ని యూనివర్సిటీలకు ఒకేరకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించేలా ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధమైంది. స్క్రీనింగ్ టెస్టులో అర్హత సా«ధించిన తర్వాత ఒక్కోపోస్టుకు ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూలకు పిలిచి ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
శాతవాహనలో 40 పోస్టులు
శాతవాహన యూనివర్సిటీలో మొత్తం 40 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ప్రొపెసర్లు–09, అసోసియేట్ ప్రొఫెసర్లు–16, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 15 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే శాతవాహన యూనివర్సిటీ ప్రకటన వెలువరించనున్నుట్ల సమాచారం. వీసీల కమిటీ సూచించిన మార్గదర్శకాలు ప్రభుత్వానికి అందిన తర్వాత అన్ని యూనివర్సిటీలకు మార్గదర్శకాలను పంపించి వేర్వేరుగా నోటిపికేషన్‌లుంటాయని తెలిసింది. నోటిపికేషన్ జాతీయ స్థాయిలో ఉంటుందని, భర్తీ పక్రియలో ముందుగా స్క్రీనింగ్ టెస్టు ఉంటుందని, దానికి 100 నుంచి 150 మార్కులు ఉంటాయని సమాచారం.
క్రమబద్ధీకరణ కష్టమే?
కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ క్రమబద్ధీకరణ కష్టమేనని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి సూచించింది. న్యాయస్థానాల వెలువరింవచిన ఉత్తర్వులు, యూజీసీ నిబంధనలను బట్టి చూస్తే రెగ్యులరైజేషన్ సా«ధ్యపడదని, అయితే వేతనాలు పెంచవచ్చని కమిటీ సూచించినట్లు సమాచారం. శాతవాహనలో కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని గతంలో ధర్నాలు, నిరసనలు తెలుపుతూ విధులు బహిష్కరించినా.. ఫలితం లేకుండాపోయింది.