‘మెడికేర్’లో తనిఖీ
Published Thu, May 11 2017 11:50 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
- అడ్డుకున్న డాక్టర్ బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి
నంద్యాల: స్థానిక సంజీవనగర్ జంక‌్షన్ సమీపంలోని మెడికేర్ ఆసుపత్రిలో నిబంధనలకు వ్యతిరేకంగా రక్తాన్ని సేకరిస్తున్నారని ఆరోపణలు రావడంతో గురువారం అధికారులు తనిఖీ చేశారు. ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్, కర్నూలు రూరల్, నంద్యాల ఇన్‌చార్జి డ్రగ్‌ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మి, కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అబిద్‌అలీ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రక్తసేకరణకు వినియోగించే బ్లడ్ బ్యాగ్ లభ్యమైంది. దీన్ని స్వాధీనం చేసుకొని సిబ్బంది నుంచి అధికారుల బృందం సమాచారం సేకరిస్తుండగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మిని ఆసుపత్రి అధినేత డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి అడ్డుకొని బ్లడ్ బ్యాగ్‌ను లాక్కొని మొదటి అంతస్తు నుంచి విసిరేశారు. తర్వాత సిబ్బంది దీన్ని మాయం చేసే ప్రయత్నం చేశారు. దీంతో అధికారుల బృందం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
రక్త సేకరణ అనుమతి లేదు
నంద్యాలలో విజయ బ్లడ్ బ్యాంక్, ప్రభుత్వాసుపత్రి, శాంతిరాం జనరల్ ఆసుపత్రుల్లో మాత్రమే రక్తం తీసుకొనే అవకాశం ఉందని, మిగతా ప్రైవేటు ఆసుపత్రులకు లేదని ఏడీ చంద్రశేఖర్ తెలిపారు. అయితే మెడికేర్‌లో రక్తం సేకరిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో తనిఖీలకు వెళ్లామన్నారు. అధికారుల విధుల నిర్వహణకు అక్కడి డాక్టర్, సిబ్బంది ఆటంకం కలిగించారని, వారిపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. అలాగే ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు.
అధికారులే అసభ్యంగా ప్రవర్తించారు..
అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు అసభ్యంగా ప్రవర్తించారని డాక్టర్ శ్రీకాంతరెడ్డి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ గౌరి బ్లడ్ బ్యాగ్‌ను ఉపయోగించలేదన్నారు. దీన్ని కలిగి ఉండటం తప్పు కాదన్నారు. అయితే తనిఖీలకు వచ్చిన అధికారులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఈ మేరకు ఆమె కూడా ఫిర్యాదును అందజేసిందన్నారు. తాను బ్లడ్ బ్యాగ్‌ను మాయం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు అవాస్తవమన్నారు.
Advertisement
Advertisement