ప్రభుత్వం పరిష్కారం చూపేదెప్పుడో..?
-
36రోజులుగా సమ్మెలో రెండో ఏఎన్‌ఎంలు
-
ఇబ్బందుల్లో ప్రజలు
-
కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం లభిస్తుందని, స్వరాష్ట్ర సాధన కోసం వివిధ రంగాలతో పాటు తాము ఉద్యమాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ సమస్యలు పరిష్కరించడం లేదని రెండో ఏఎన్‌ఎంలు వాపోతున్నారు. డిమాండ్ల సాధన కోసం వారు రాస్తారోకోలు, ధర్నాలు, ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడి, వంటావార్పు, ప్రముఖ నేతల విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టి నిరసనను వ్యక్త చేశారు. వివిధ రకాలుగా తమ నిరసనను తెలుపుతూ 36 రోజులుగా పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నారు.
అందని సేవలు...
రెండో ఏఎన్‌ఎంలు విధుల్లో లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు సరిగా అందడం లేదు. ప్రధానంగా నెలనెల ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలు అందక గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్యం అందడం లేదని పలు గ్రామాలకు చెందిన ప్రజలు వాపోతున్నారు. నియోజకవర్గంలోని ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాలతో పాటు తాంసి, తలమడగు మండలాల్లో కలిపి మొత్తం 43 మంది రెండో ఏఎన్‌ఏంలు ఉన్నారు. వీరు సమ్మె బాట పట్టడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి వెంటనే వారి సమస్యలు పరిష్కరించి ప్రజలకు రెండో ఏఎన్‌ఎంల సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
డిమాండ్లు ఇవే...
-
కాంట్రాక్టు రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలి.
-
10వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ. 21,300లతో పాటు, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతరల అలవెన్సులు అందజేయాలి.
-
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ఆరోగ్య బీమా (ఇఎస్‌ఐ) సౌకర్యం కల్పించాలి.
-
వ్యాక్సిన్ అలవెన్స్ రూ. 500, యూనిఫాం అలవెన్స్ రూ. 1500, ఎఫ్‌టీఏ రూ. 550 చెల్లించాలి.
-
35 రోజుల క్యాజువల్ సెలవులు మంజూరు చేయాలి. 180 రోజులతో కూడిన మెటర్నటీ సెలవులు ఇవ్వాలి.
-
సబ్ సెంటర్‌లు అద్దె రూ. 1000తో పాటు స్టేషనరీ, జిరాక్స్ ఖర్చులు ఇవ్వాలి.
-
నైట్ డ్యూటీలు, ఓపీ డ్యూటీలు రద్దు చేయాలి, బదిలీకి అవకాశం కల్పించాలి.
-
ఎవరైనా విధి నిర్వహణలో చనిపోతే వారికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.