చితకబాదారు
సర్వజనాస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్
బంధువును చూసేందుకు వచ్చిన యువకుడిపై దాడి
అనంతపురం సిటీ: సర్వజనాస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు సోమవారం వచ్చిన ఓ వ్యక్తిని చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. ఆర్థోవార్డులో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు యల్లనూరు మండలానికి చెందిన రామాంజి సర్వజనాస్పత్రికి వచ్చాడు. అయితే సిబ్బంది అతన్ని వార్డులోకి అనుమతించలేదు. అరగంట పాటు అక్కడే పడిగాపులు గాసిన యువకుడు, తనను లోపలకు పంపితే బంధువును పలకరించి వస్తానని సెక్యూరిటీని ప్రాధేయపడ్డాడు. అయినా వారు వినిపించుకోకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది యువకుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి రక్తగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సెక్యూరిటీ ఇన్‌చార్జ్ సంఘటనా స్థలానికి వచ్చి రామాంజినేయులు అక్కడి నుంచి పంపించివేశారు. తానేం తప్పుచేశానని తనపై దాడి చేశారో చెప్పాలని రామాంజనేయులు వాదించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సెక్యూరిటీపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక, బంధువులు ఎక్కడున్నారో అర్థం కాక రామాంజనేయులు తిరిగి గ్రామానికి బయలు దేరాడు. ఈ ఘటన చూసిన ఆస్పత్రిలోని వారంతా సెక్యూరిటీ తీరుపై పెదవి విరిచారు.