బ్రిటన్‌ను టార్గెట్ చేసిన ఐఎస్‌ఐఎస్!
లండన్: బ్రిటన్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా యూకే భద్రతా విభాగం ప్రకటించింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దేశంలో దాడులకు సన్నాహాలు చేసుకుంటున్నారనీ, వీటిని నియంత్రించడానికి నిఘా విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని బ్రిటన్ భద్రతా విభాగం ఎమ్ఐ5 డైరెక్టర్ జనరల్ ఆండ్రూ పార్కర్ గురువారం ప్రకటించారు. బ్రిటన్లో ఐఎస్ఐఎస్ దాడులు జరగడానికి గల అవకాశాలు ఇంత ఎక్కువగా ఎన్నడూ చూడలేదని తెలిపిన పార్కర్, గత సంవత్సరం ఉగ్రవాదులు దాడి కోసం చేసిన ఆరు ప్రయత్నాలను విఫలం చేశామని తెలిపారు.
సిరియా నుండి ఐఎస్ఐఎస్ ప్రేరేపిత ఉగ్రవాదులు బ్రిటన్లో దాడులు జరపడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. దేశం నుండి సుమారు 750 మంది ఉగ్రవాదులు సిరియాకు వెళ్లడం, బ్రిటన్లో దాడికి గల అవకాశాలను పెంచుతుందని హెచ్చరించారు. టీనేజ్ పిల్లల నుండి వయోజనుల వరకు అందరినీ ఇస్లామిక్ ఉగ్రవాదులు అంతర్జాలం ద్వారా ప్రభావితం చేస్తున్నారని, యువత త్వరగా వారి ఉచ్చులో పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆధునిక సమాచార వ్యవస్థ ద్వారా ద్వేషాన్ని రగిలించడంలో ఐఎస్ఐఎస్ ఆరితేరిందని పార్కర్ తెలిపారు. బ్రిటన్లో నిఘా వ్యవస్థకు సంబంధించిన చట్టాలలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందనీ, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చట్టాలలో వెసులుబాటు చేయాల్సిన అవసరం అని పార్కర్ తెలిపారు.