సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేసి పర్యవేక్షిస్తున్నారు.
ఓల్డ్ సిటీలో క్విక్ రియాక్షన్ టీం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను శుక్రవారం ఉదయం ఏర్పాటు చేశారు. ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు కలగకుండా చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఒవైసీ వాహనంపై ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు జరగడంతో హైదరాబాద్ పాతబస్తీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల గురించి ప్రచార, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం కావడంతో కలకలం రేగింది. ఆందోళనకు గురైన ఎంఐఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు సమాచారం తెలుసుకునేందుకు దారుస్సలాంకు పరుగులు తీశారు.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఇందుకోసం ఏకంగా 7వేల మంది పోలీసుల భారీ బందోబస్తుతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
సంబంధిత వార్త: ఒవైసీ కారుపై దుండగుల కాల్పులు.. ఒకరి అరెస్టు.. పిస్తోల్ స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment