పుష్ప వాహనంపై ఊరేగుతున్న పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు
శ్రీమఠం పీఠాధిపతి సీమోల్లంఘన
Published Fri, Sep 16 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
– చాతుర్మాస దీక్ష విరమణ
– కనుల పండువగా సాగిన పుర ప్రవేశ యాత్ర
– ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు
– రూపాయి నాణేలతో పీఠాధిపతికి తులాభారం
మంత్రాలయం : హరిదాసుల భజన కీర్తనలు.. డోలు వాయిద్య నాదాలు.. మహిళా భక్తుల కోలాటాలు, నింగిన మిరుమిట్లు గొల్పుతున్న బాణసంచా తారా జువ్వలు మధ్య పీఠాధిపతి సీమోల్లంఘన వైభవోపేతంగా సాగింది. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు 42 రోజుల పాటు చాతుర్మాస దీక్షలో తరించారు. దీక్ష విరమణలో భాగంగా శుక్రవారం రాత్రి పుర ప్రవేశ యాత్ర శోభాయమానంగా జరిగింది. ముందుగా శ్రీమఠం డోలోత్సవ మండపంలో పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు స్వర్ణమండపంలో చాతుర్మాస సమరూప, భాగవత పోత్సపతి మంగళ మహోత్సవం నిర్వహించారు. శ్రీమఠం నుంచి పల్లకీలో స్వామిజీని ఊరేగింపుగా ప్రాంగణం బయటకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి వాహనాల్లో గ్రామ పొలిమేరలో వెలసిన కొండాపురం ఆంజనేయస్వామి ఆలయం చేరుకున్నారు.
ఆంజనేయస్వామి మంగళప్రదంగా పూజలు, హారతులు పట్టి భక్తులకు పీఠాధిపతి ఆశీర్వచనాలు చేశారు. స్థానిక వీవీజీ అతిథిగహం వద్ద ప్రత్యేక పుష్పాలంకరణ వాహనంలో ఆశీనులయ్యారు. శ్రీమఠం అధికారగణం వాహనంపై కొలువుదీరిన పీఠాధిపతికి పూలమాల సమర్పణతో స్వాగతం సుమాంజలులు పలికారు. పుష్ప వాహనానికి గజరాజు ఆహ్వానం పలుకుతుండగా భారీ భక్తజన సందోహం మధ్య పుర ప్రవేశ యాత్ర అలా ముందుకు సాగింది. రాఘవేంద్ర సర్కిల్‌లో పేల్చిన బాణసంచాలు, 150 మంది డోలు వాయిద్యకారుల విన్యాస వాయింపులు, దాససాహిత్య మండలి మహిళల కోలాటాలు, భక్తుల హర్షధ్వానాల మధ్య కడు వైభవంగా యాత్ర శ్రీమఠం చేరకుంది.
యోగీంద్ర మండపంలో పీఠాధిపతికి శ్రీమఠం అధికారులు రూపాయి నాణేలతో తులాభారం నిర్వహించారు. దాసవాణి భక్తిగేయాలు, హరిదాసుల కీర్తనలతో శ్రీమఠం హోరెత్తింది. వేడుకలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వార పాలక అనంతస్వామి పాల్గొన్నారు.
Advertisement