
సంగీతానికి లక్ష్యసిద్ధి ఉండాలి
విజయవాడ కల్చరల్: సంగీతానికి లక్ష్యసిద్ధి ఉండాలని సంగీత విద్వాంసుడు, సినీ సంగీత దర్శకుడు వీణాపాణి వివరించారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల సంయుక్తంగా సంగీత కళాశాలలో 72 మేళ కర్తరాగాల సులభతర అవగాహన సదస్సు కార్యక్రమాన్ని 13 రోజులపాటు నిర్వహించనున్నాయి. మంగళవారం నాటి కార్యక్రమంలో వీణాపాణి మాట్లాడుతూ సంగీతాన్ని మొక్కుబడిగా నేర్చుకోకూడదని, దిశా నిర్దేశం, లక్ష్యం ఉండాలని ప్రపంచంలోని సంగీతమంతా శబ్దం నుండే పుట్టిందని సంగీతానికి ప్రాణాధారం శబ్దమేనని వివరించారు. వాటి నుంచే స్వరకల్పన తయారైందని వివరించారు. లక్షమంది సంగీత విద్యార్థులకు 72 మేళ కర్తరాగాలతో అవగాహన కలిగించటానికి కృషిచేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్డర్ విజయభాస్కర్, దికల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కెఎస్. గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు.