పెద్దపల్లిలో బిల్డింగ్‌లను పరిశీలిస్తున్న కలెక్టర్
- పెద్దపల్లిలో బిల్డింగ్‌లను పరిశీలించిన కలెక్టర్ నీతూ ప్రసాద్
పెద్దపల్లి : పెద్దపల్లిలో కలెక్టరేట్ ఏర్పాటు చేసేందుకు అనువైన భవనం కోసం కలెక్టర్ నీతూప్రసాద్ అన్వేషిస్తున్నారు. భవనం కోసం బుధవారం కలెక్టర్ పట్టణంలోని పలు బిల్డింగ్‌లను పరిశీలించారు. పట్టణంలోని ఐటిఐ, ఎస్సారెస్పీ క్యాంపు, కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. ఐటిఐ అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని చాలారోజులుగా పలువురు అధికారులతోపాటు సామాన్యులూ అభిప్రాయపడుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ కూతవేటు దూరంలో.. రాజీవ్ రహదారి పక్కనే ఉండడం ద్వారా కలెక్టరేట్‌కు రావడం.. వెళ్లడం అనుకూలంగా ఉంటుందని స్థానిక అధికారులు నివేదిక సమర్పించారు. దీనిపై కలెక్టర్ ఇక్కడికి చేరుకుని ఐటిఐ, ఎస్సారెస్పీ క్యాంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎంపీడీవో బిల్డింగ్‌లను పరిశీలించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవో అశోక్ కుమార్‌తో ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సీఐ మహేష్, తహసీల్దార్ అనుపమారావు, ఎంపీడీవో మల్లేశం తదితరులున్నారు.